Hudhud the storm
-
మంత్రులూ.. మీరెక్కడ?
పెను తుపాను పడగెత్తినా.. పట్టించుకోని గంటా, అయ్యన్న మినీ మహానాడులో ఒకరు మొక్కుబడి సమీక్షతో సరిపెట్టారు మరొకరు ఏడాదిన్నర క్రితం హుద్‌హుద్ తుపానుతో భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్న విశాఖ ప్రజలు తుపాను పేరెత్తితే చాలు ఇప్పటికీ హడలిపోతున్నారు. తాజాగా వచ్చిన రోను తుపాను విశాఖ సమీపంలోనే తీవ్ర తుపానుగా బలపడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మళ్లీ ఎంత విధ్వంసం జరుగుతుందోనని ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. అధికారులు సహాయ చర్యలకు సమాయత్తమయ్యారు. కానీ జిల్లా మంత్రులు మాత్రం ఇవేవీ పట్టలేదు. ప్రజల పట్ల బాధ్యతా గుర్తుకు రాలేదు. అయ్యన్న నర్సీపట్నం దాటి రాలేదు. గంటా మొక్కుబడి సమీక్షతో సరిపెట్టి.. నగరం దాటి వెళ్లిపోయారు. విశాఖపట్నం: హుద్‌హుద్ విధ్వంసం ఇంకా కళ్లముందే మెదులుతుండటం.. తాజాగా రోను తుపాను హెచ్చరికలతో విశాఖ ప్రజలు బెంబేలెత్తారు. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే బుధ, గురువారాల్లో ఎడతెరపి లేకుండా జిల్లా అంతటా వర్షాలు కురిశాయి. తుపాను శుక్రవారం విశాఖ సమీపంలోనే తీవ్ర తుఫాన్‌గా బలపడుతుందని, గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం తుపానును ఎదుర్కొనేందుకు అప్రమత్తమైంది. శక్తి మేరకు ముందస్తు చర్యలు చేపట్టింది. అయితే జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మాత్రం దాని గురించి పట్టించుకోలేదు. తుపాను హెచ్చరికలను చాలా తేలిగ్గా తీసుకున్నారు. అదృష్టవశాత్తూ తీవ్ర తుపానుగా బలపడకముందే రోను ఒడిశా వైపు వెళ్లిపోయింది.. వెళ్తూ వెళ్తూ జిల్లా మంత్రుల అంతులేని నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. నర్సీపట్నం దాటి రాని అయ్యన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గత మూడు రోజుల నుంచి నర్సీపట్నంలోనే ఉన్నా విశాఖ వైపు తొంగిచూడలేదు. తాను సీనియర్ మంత్రినని చెప్పుకునే ఆయన విశాఖ ప్రజలు భయాందోళనలో ఉన్నా కనీసమాత్రంగా కూడా ఎక్కడా పర్యటించలేదు. చివరికి తుపాను ముప్పుపై అధికారులు నిర్వహించిన సమీక్షలోనూ పాల్గొనలేదు. శుక్రవారం నర్సీపట్నంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీమహానాడులో పాల్గొనేందుకు రెండు, మూడు రోజులుగా అక్కడే మకాం వేసిన మంత్రి వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది. మొక్కుబడి సమీక్షకే గంటా బుధ, గురువారాల్లో విశాఖలోనే ఉన్న గంటా శ్రీనివాసరావు ఎక్కడా క్షేత్రస్థాయి పర్యటనలు చేయలేదు. గురువారం సాయంత్రం అధికారులతో మొక్కుబడి సమీక్ష నిర్వహించి రాత్రికి విజయవాడ బయలుదేరి వెళ్లారు. వాస్తవానికి గురువారం రాత్రే వాతావరణశాఖ అధికారులు తీవ్ర తుపానుపై ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం తుపాను తీవ్రరూపం దాలుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటిస్తూ వచ్చారు. ఈ సమయంలో విశాఖలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాల్సిన మంత్రి గంటా గురువారం రాత్రే విజయవాడకు వెళ్లిపోయారు. అటు నుంచి అటే శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు పయనమయ్యారు. పెను తుపాను పడగెత్తిన సమయంలోనే ఇద్దరు మంత్రులూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని విశాఖ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కరవు వేళలోనూ అంతే రోను తుపానుకు ముందు జిల్లాలో తీవ్ర కరవుఛాయలు అలుముకున్నాయి. ఈ వేసవిలో వడదెబ్బకు 147 మంది మృ త్యువాత పడ్డారు. పంటలే కాదు బోర్లు, బావులు, చెరువులు ఎండిపోయి తీవ్ర దుర్భిక్షం నెలకొంది. చివరికి విశాఖ నగరంలో కూడా తీవ్రమైన మంచినీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో కరవు తీవ్రత ఉన్న రోజుల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని ఊరూరా పంపిణీ చేసేవారు. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క ట్యాంకు కూడా తిరగని పరిస్థితి దాపురించింది. కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలిన మంత్రులు ఏ మాత్రం పట్టించుకోలేదు. చివరికి కరువుపై జిల్లా ఇన్చార్జి మంత్రి, ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విశాఖలోనే నిర్వహంచిన సమీక్షకు ఇద్దరు మంత్రులూ డుమ్మాకొట్టారు. ఇప్పుడు రోను తుపాను విషయంలోనూ అదే నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించారు. గంటాకు సినిమాలే ముఖ్యమా? రోడ్డు ప్రమాదంలో 11మంది జిల్లావాసులు మృత్యువాత పడినా.. మంత్రిగా స్పందించకుండా సరైనోడు సినిమా వేడుకల్లో మునిగితేలిన గంటా వైఖరి నెల కిందట తీవ్ర విమర్శల పాలైంది. ఏ మాత్రం బాధ్యత లేకుండా మంత్రి వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు కూడా గంటా రోను తుపాను కంటే సినిమానే ప్రధానమన్నట్టు వ్యవహరించారని ప్రచారం జరుగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్న మంత్రి బ్రహ్మోత్సవం సినిమా చూశారని అంటున్నారు. ఓ పక్క విశాఖ ప్రజలు రోను భయంతో అల్లాడుతుంటే గంటా ఏమాత్రం పట్టకుండా ఎంచక్కా హైదరాబాద్‌లో కూర్చుని సినిమా వీక్షించారన్న ఆరోపణలు శుక్రవారం విశాఖలో వర్షం కంటే జోరుగా హోరెత్తాయి. -
వృద్ధులారా.. మీ స్ఫూర్తికి వందనం
ఎవరి సాయానికీ ఎదురు చూడలేదు సమష్టిగా సుందరనందనవన నిర్మాణం హుద్‌హుద్ పెకలించినా పునరుద్ధరణకు అందరూ ఒక్కటయ్యారు మురళీనగర్ వాకర్స్‌క్లబ్ సభ్యుల ఆదర్శం మురళీనగర్ : మురళీనగర్ వాకర్స్ క్లబ్ సభ్యులు ఎవరి సాయం కోసం ఎదురు చూడలేదు. చేతులు ముడుచుకు కూర్చోలేదు. తాము నారు, నీరు పోసి పెంచుకున్న పార్కును హుద్‌హుద్ తుపాను కకావికలం చేసినా కొండంత ధైర్యంతో పూర్వ వైభవం తెచ్చుకున్నారు. వృద్ధాప్యంలో కూడా పచ్చదనం పరవళ్లు తొక్కే విధంగా పార్కును తీర్చిదిద్దారు. సమైక్య కృషికి తార్కాణంగా వాకర్స్ పార్కును నందనవనంగా తీర్చిదిద్దిఆదర్శంగా నిలిచారు. క్లబ్లో 648మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది 60ఏళ్లు దాటినవారే. వీరంతా చక్కని పార్కును నిర్మించుకున్నారు. దీని అభివృద్ధికి వీరు ప్రభుత్వాధికార్లు చూట్టూ ఎప్పుడూ తిరగ లేదు. వారే చందాలు వేసుకుని పార్కును అభివృద్ధి చేసుకుంటున్నారు. అందుకే వాకర్స్ పార్లు పచ్చదనంతో నిత్యం కళకళలాడుతుంది. 1997లో దీనిని అభివృద్ధి చేసిన తర్వాత మురళీనగర్‌లో మరో 8 పార్కులు ఏర్పాటయ్యాయి. వాకర్స్ పార్కు ఇతర పార్కులకు స్ఫూర్తిగా నిలిచింది. మొదట్లో జీవీఎంసి ప్రజా భాగస్వామ్య పద్ధతిలో రూ.2లక్షల50వేల నిధులతో అభివృద్ధి చేసింది. పచ్చదనం ఏర్పాటులో సభ్యులే కీలకంగా వ్యవహరించారు. ప్రతి సభ్యుడూ దాతే.. : సభ్యుల్లో ఎక్కువ మంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పించనుదార్లు ఉన్నారు. వీరు ఇతోధిక సాయం చేస్తునే ఉంటారు. పార్కు అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. దీంతో ఇక్కడ పూర్తి సౌకర్యాల్ని క ల్పించుకోగలిగారు. ఇంతగా అభివృద్ధి చేసిన హుద్‌హుద్ తుపాను గత సెప్టెంబరులో పూర్తిగా నాశనం చేనపుడు వీరు కలత చెందారు. అంతలోనే కర్తవ్యం గుర్తుకు వచ్చి పార్కులో పూర్వ వైభవం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ప్రబుత్వం, స్వచ్చంద సంస్థల సాయంతో ఇక్కడ వ్యర్థాలను తొలగించడంతోపాటు వృక్షాలకు ప్రూనింగు చేయించారు. తర్వాత ఒక్కొక్కటిగా సౌకర్యాలు సమకూర్చుకున్నారు. భిన్నత్వం : ఏపార్కులోను లేని అరుదైన మొక్కలు ఇక్కడ మనం చూడవచ్చు. బోధి చెట్టు, మంచి గంధం, ఎర్రచందనం, రుద్రాక్ష, ఆల్బుకారా, బ్రెజిలియన్ రెయిన్‌ట్రీ వంటివి 20రకాల మ్కొలను ఇక్కడ చూడవచ్చు. మర్రి, జువ్వి, తురంతో, గన్నేరు, మర్రి, చింత తదితర 50ఏళ్ల వయజు కలిగిన బోన్సాయ్ మొక్కలు పెంచుతున్నారు. కార్తీక మాసంలో మహిళలు పూజలు చేసుకోవడానికి అశ్వద్ధ వృక్షం ఉంది. దీని చుట్టూ అరుగు కట్టి పూపజలకు ఏర్పాటు చేశారు. పచ్చదనం పరవళ్లు ఐదునెలల్లోనే పచ్చదనంతో అభివృద్ధి చేశారు. వాకి ంగు ట్రాకును బాగుచేశారు. ఇరువైపులా అందంగా పెంచి కోటన్స్ వనం ముచ్చట గొలిపే విధంగా దర్శనమిస్తోంది. పార్కులో ప్రవేశించిన వెంటనే కాసేపు కూర్చుని గాలి పీల్చాలనే ఉత్సుకత కలుగుతుంది. పౌంటెన్‌కు చుట్టూ అందమైన మొక్కలు పెంచారు. బుషెస్ కనువిందు చేస్తున్నాయి. సైకస్, ఫెర్న్ వంటి అనేక జాతుల మొక్కలు ఇక్కడ పెంచుతున్నారు. జూజలకు వినియోగించే పత్రాలకోసం జాజి, మారేడు, జమ్మి, మామిడి, జామ, ఉసిరిక, జిల్లేడు, తులసి, ఉమ్మెత్త, బదరీపత్రం మొక్కలు పెంచుతున్నారు. సాంస్క ృతిక వేదిక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహహణకు వేదికను నిర్మించారు. కొద్దికాలంలోనే దీని పైకప్పు ఎగిరిపోవడంతో దీనిన పూర్తి స్థాయిలో సీలింగు చేసి పునరుద్ధరించుకున్నారు. కొత్తగా లైట్లు వేసి విద్యుత్ వెలుగుల నింపారు. సాయంత్రం సీనియర్ సిటిజన్స్ ఆత్మీయ కలయిక కోసం ఫ్యాన్లు, కుర్చీలు సమకూర్చారు. బెంచీలు ఏర్పాటు చేసుకున్నారు. నిరంతం భక్తి సంగీతాన్ని వినిపించి ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన తీసుకురావాలని మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వీరి పనులకు ముగ్దులైన జీవీఎంసి అధికార్లు స్పందించి రూ.2.30లక్షలతో ప్రహరీ గోడను మరమ్మతు చేసి రంగులు వేయించారు. పూర్వ అధ్యక్షుడు మ్యూజిక్సిస్టమ్ను బాగు చేశారు. దీనికి రూ.12వేలు ఖర్చు చేశారు. సర్కులర్ స్వింగ్, ఊయల వంటి ఆటపరికరాలు బాగు చేయించారు. పూర్వ అధ్యక్షుడు ఆర్.సత్యనాథం రీడింగు రూం నిర్మించారు. -
విద్యుత్ శాఖలో అవినీతి తుఫాన్!
అత్యవసర సేవల పేరుతో లెక్కలేనంత ఖర్చు విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో రూ.కోట్లలో అవినీతి జరిగిందని ఆరోపణలు తీవ్ర ప్రభావిత మండలాల్లో కన్నా మిగతా చోట్ల అత్యధిక ఖర్చు గంట్యాడలో రూ.13.01 కోట్లు, వేపాడలో రూ.11.97 కోట్ల ఖర్చుపై అనుమానాలు విజయనగరం :హుద్‌హుద్ తుపాను అనంతరం చేపట్టిన విద్యుత్ పునరుద్ధరణ పనుల మాటున కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయా? కూలులు, రవాణా చార్జీల రూపంలోనే కాకుండా మెటీరియల్ కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయా? అధికారుల లెక్కలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయా? ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుద్‌హుద్ ప్రభావం జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, విజయనగరం పైన తీవ్రంగా ఉంది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కానీ పునరుద్ధరణ కోసం చేసిన ఖర్చులు అందుకు భిన్నంగా ఉన్నాయి. భారీగా ధ్వంసమైన చోట కంటే మిగతా చోట్ల అధికంగా ఖర్చు చేయడంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంట్యాడ సెక్షన్లో రూ.13.01కోట్లు, వేపాడ సెక్షన్లో రూ.11.97 కోట్లు ఖర్చుచేయడం అనుమానాలకు దారితీస్తోంది. హుద్‌హుద్ తుపాను వల్ల ధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు జిల్లాలో రూ.129.15 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో మెటీరియల్ కోసం రూ.118.56 కోట్లు, కూలీలు, రవాణా ఖర్చుల కింద రూ.10.59 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో విజయనగరం డివిజన్లో రూ.112.21కోట్లు, బొబ్బిలి డివిజన్లో రూ.16.64 కోట్లు ఖర్చు పెట్టారు. కాకపోతే, విజయనగరం డివిజన్లో సెక్షన్లలో జరిగిన ఖర్చులు చూస్తే ఎవరికైనా అనుమానం రాకమానదు. తీవ్రంగా విద్యుత్‌వ్యవస్థ దెబ్బతిన్న భోగాపురం సెక్షన్లో రూ. 7.85కోట్లు, పూసపాటిరేగ సెక్షన్లో రూ.6.36కోట్లు, విజయనగరం అర్బన్( ఐదు సెక్షన్లు కలిపి)లో రూ.12.09కోట్లు ఖర్చు చేయగా స్వల్పంగా దెబ్బతిన్న గంట్యాడ సెక్షన్ ఒక్కదాంట్లో రూ.13.01 కోట్లు ఖర్చు పెట్టారు. దాని తర్వాత వేపాడలో రూ.11.97కోట్లు, జామిలో రూ.10.70కోట్లు ఖర్చు చేశారు. విశేషమేమిటంటే తుపాను ప్రభావిత మండలాల్లో వేపాడ లేకపోయినప్పటికీ ప్రభావం ఉన్న సెక్షన్లో కన్నా అక్కడ ఎక్కువగా ఖర్చు పెట్టారు. దీంతో ఆయా మండలాల్లో అంత నష్టం ఎక్కడ జరిగిందన్నదానిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలా ఆయా సెక్షన్లలో నికర ఆస్తులు విలువ అంత ఉంటుందో లేదో కూడా చెప్పలేం. కానీ సంబంధిత ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి మెటీరియల్ మాటున కైంకర్యం చేసి ఉండొచ్చనే ఆరోపణలొస్తున్నాయి. ఇందులో నేతల భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది. వారి డెరైక్షన్‌లో మెటీరియల్ ముసుగులో పెద్ద ఎత్తున ఖర్చు చూపించారన్న విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా వినియోగించిన మెటీరియల్ కూడా నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల విద్యుత్ స్తంభాలు మధ్యకు విరిగిపోయి కనిపిస్తున్నాయి. ఆరోపణలకు కొదవే లేదు హుద్‌హుద్ తుపాను అనంతరం గ్రామాలు చీకట్లో మగ్గిపోవడంతో సర్పంచ్‌లు, గ్రామపెద్దలు చొరవ తీసుకుని తమ సొంత ఖర్చులతో గోతులు తవ్వడమే కాకుండా అందుకు అవసరమైన స్తంభాలను తరలించుకున్నారు. కొన్ని పంచాయతీల్లో స్థానిక ప్రజలే పనులు చేపట్టారు. పనిచేయడానికి వచ్చిన సిబ్బందికి భోజనాలు కూడా పెట్టారు. కానీ అవన్నీ ఖర్చుల కింద చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. రోజుకు కూలీకి రూ.350 మాత్రమే చెల్లించి... రూ.500చొప్పున కూలీ ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించినట్టు విమర్శలొచ్చాయి.నష్టం జరగకపోయినా, అసలు విద్యుత్ స్తంభాలే లేకపోయినా... నష్టం జరిగినట్టు చూపించి... పలు మండలాల్లో గల రియల్ ఎస్టేట్ లేఅవుట్లలో ఇదే అదునుగా విద్యుత్ స్తంభాలేసి సొమ్ము చేసుకున్నట్టు తెలిసింది. కొత్త మెటీరియల్ వేసిన చోట ఉన్న పాడైన సామాగ్రిని స్టోరేజ్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. చాలావరకు విక్రయాలు చేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ తదితర మండలాల్లో పలుచోట్ల ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ స్తంభాలు వేయలేదన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో మిగుల్చుకున్న మెటీరియల్‌ను రియల్ ఎస్టేట్‌లో వాడుతున్నారన్న వాదనలు ఉన్నాయి.అలాగే సహాయకార్యక్రమాల్లో భాగంగా తెలంగాణా, ఒడిశా తదితర పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన విద్యుత్ పరికరాలు ఏమయ్యాయో తెలియడం లేదు. -
ఎయిర్టెల్ ‘హుద్‌హుద్ ’ స్పందన భేష్: చంద్రబాబు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హుద్ హుద్ తుపాను సమయంలో భారతి ఎయిర్టెల్ స్పందనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఎయిర్టెల్ స్పందనను మెచ్చుకుంటూ భారతి ఎంటర్‌ప్రెజైస్ చైర్మన్ సునీల్ మిట్టల్‌కి ముఖ్యమంత్రి లేఖ రాశారు. యుద్ధ ప్రాతిపదికన మొబైల్ సర్వీసులను పునరుద్ధరించడంతో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయగలిగినట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు ఎయిర్టెల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తుపాన్ తర్వాత టెలికం సేవలను తక్షణ పునరుద్ధరణకు సంబంధించి ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల సమావేశానికి సునీల్ మిట్టల్ హాజరైన సంగతి తెలిసిందే. రెండు రోజుల తర్వాత కూడా టెలికం సేవలను పునరుద్ధరించకపోవడంపై ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు టెలికం సంస్థలు కేవలం లాభాల కోసమే పనిచేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 18 సాయంత్రానికల్లా సేవలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రికి మిట్టల్ హామినిచ్చారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ నేరుగా విశాఖపట్నం రావడమే కాకుండా బాధితుల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించడంపై అభినందించారు.