ఎయిర్‌టెల్ ‘హుద్‌హుద్ ’ స్పందన భేష్: చంద్రబాబు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హుద్ హుద్ తుపాను సమయంలో భారతి ఎయిర్‌టెల్ స్పందనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఎయిర్‌టెల్ స్పందనను మెచ్చుకుంటూ భారతి ఎంటర్‌ప్రెజైస్ చైర్మన్ సునీల్ మిట్టల్‌కి ముఖ్యమంత్రి లేఖ రాశారు.
యుద్ధ ప్రాతిపదికన మొబైల్ సర్వీసులను పునరుద్ధరించడంతో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయగలిగినట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు ఎయిర్‌టెల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తుపాన్ తర్వాత టెలికం సేవలను తక్షణ పునరుద్ధరణకు సంబంధించి ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల సమావేశానికి సునీల్ మిట్టల్ హాజరైన సంగతి తెలిసిందే.
రెండు రోజుల తర్వాత కూడా టెలికం సేవలను పునరుద్ధరించకపోవడంపై ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు టెలికం సంస్థలు కేవలం లాభాల కోసమే పనిచేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 18 సాయంత్రానికల్లా సేవలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రికి మిట్టల్ హామినిచ్చారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ నేరుగా విశాఖపట్నం రావడమే కాకుండా బాధితుల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించడంపై అభినందించారు.