పెను తుపాను పడగెత్తినా.. పట్టించుకోని గంటా, అయ్యన్న
మినీ మహానాడులో ఒకరు మొక్కుబడి సమీక్షతో సరిపెట్టారు మరొకరు
ఏడాదిన్నర క్రితం హుద్‌హుద్ తుపానుతో భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్న విశాఖ ప్రజలు తుపాను పేరెత్తితే చాలు ఇప్పటికీ హడలిపోతున్నారు. తాజాగా వచ్చిన రోను తుపాను విశాఖ సమీపంలోనే తీవ్ర తుపానుగా బలపడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మళ్లీ ఎంత విధ్వంసం జరుగుతుందోనని ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. అధికారులు సహాయ చర్యలకు సమాయత్తమయ్యారు. కానీ జిల్లా మంత్రులు మాత్రం ఇవేవీ పట్టలేదు. ప్రజల పట్ల బాధ్యతా గుర్తుకు రాలేదు. అయ్యన్న నర్సీపట్నం దాటి రాలేదు. గంటా మొక్కుబడి సమీక్షతో సరిపెట్టి.. నగరం దాటి వెళ్లిపోయారు.
విశాఖపట్నం: హుద్‌హుద్ విధ్వంసం ఇంకా కళ్లముందే మెదులుతుండటం.. తాజాగా రోను తుపాను హెచ్చరికలతో విశాఖ ప్రజలు బెంబేలెత్తారు. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే బుధ, గురువారాల్లో ఎడతెరపి లేకుండా జిల్లా అంతటా వర్షాలు కురిశాయి. తుపాను శుక్రవారం విశాఖ సమీపంలోనే తీవ్ర తుఫాన్‌గా బలపడుతుందని, గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం తుపానును ఎదుర్కొనేందుకు అప్రమత్తమైంది. శక్తి మేరకు ముందస్తు చర్యలు చేపట్టింది. అయితే జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మాత్రం దాని గురించి పట్టించుకోలేదు. తుపాను హెచ్చరికలను చాలా తేలిగ్గా తీసుకున్నారు. అదృష్టవశాత్తూ తీవ్ర తుపానుగా బలపడకముందే రోను ఒడిశా వైపు వెళ్లిపోయింది.. వెళ్తూ వెళ్తూ జిల్లా మంత్రుల అంతులేని నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది.
నర్సీపట్నం దాటి రాని అయ్యన్న
పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గత మూడు రోజుల నుంచి నర్సీపట్నంలోనే ఉన్నా విశాఖ వైపు తొంగిచూడలేదు. తాను సీనియర్ మంత్రినని చెప్పుకునే ఆయన విశాఖ ప్రజలు భయాందోళనలో ఉన్నా కనీసమాత్రంగా కూడా ఎక్కడా పర్యటించలేదు. చివరికి తుపాను ముప్పుపై అధికారులు నిర్వహించిన సమీక్షలోనూ పాల్గొనలేదు. శుక్రవారం నర్సీపట్నంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీమహానాడులో పాల్గొనేందుకు రెండు, మూడు రోజులుగా అక్కడే మకాం వేసిన మంత్రి వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది.
మొక్కుబడి సమీక్షకే గంటా
బుధ, గురువారాల్లో విశాఖలోనే ఉన్న గంటా శ్రీనివాసరావు ఎక్కడా క్షేత్రస్థాయి పర్యటనలు చేయలేదు. గురువారం సాయంత్రం అధికారులతో మొక్కుబడి సమీక్ష నిర్వహించి రాత్రికి విజయవాడ బయలుదేరి వెళ్లారు. వాస్తవానికి గురువారం రాత్రే వాతావరణశాఖ అధికారులు తీవ్ర తుపానుపై ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం తుపాను తీవ్రరూపం దాలుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటిస్తూ వచ్చారు. ఈ సమయంలో విశాఖలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాల్సిన మంత్రి గంటా గురువారం రాత్రే విజయవాడకు వెళ్లిపోయారు. అటు నుంచి అటే శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు పయనమయ్యారు. పెను తుపాను పడగెత్తిన సమయంలోనే ఇద్దరు మంత్రులూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని విశాఖ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కరవు వేళలోనూ అంతే
రోను తుపానుకు ముందు జిల్లాలో తీవ్ర కరవుఛాయలు అలుముకున్నాయి. ఈ వేసవిలో వడదెబ్బకు 147 మంది మృ త్యువాత పడ్డారు. పంటలే కాదు బోర్లు, బావులు, చెరువులు ఎండిపోయి తీవ్ర దుర్భిక్షం నెలకొంది. చివరికి విశాఖ నగరంలో కూడా తీవ్రమైన మంచినీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో కరవు తీవ్రత ఉన్న రోజుల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని ఊరూరా పంపిణీ చేసేవారు. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క ట్యాంకు కూడా తిరగని పరిస్థితి దాపురించింది. కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలిన మంత్రులు ఏ మాత్రం పట్టించుకోలేదు. చివరికి కరువుపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విశాఖలోనే నిర్వహంచిన సమీక్షకు ఇద్దరు మంత్రులూ డుమ్మాకొట్టారు. ఇప్పుడు రోను తుపాను విషయంలోనూ అదే నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించారు.
గంటాకు సినిమాలే ముఖ్యమా?
రోడ్డు ప్రమాదంలో 11మంది జిల్లావాసులు మృత్యువాత పడినా.. మంత్రిగా స్పందించకుండా సరైనోడు సినిమా వేడుకల్లో మునిగితేలిన గంటా వైఖరి నెల కిందట తీవ్ర విమర్శల పాలైంది. ఏ మాత్రం బాధ్యత లేకుండా మంత్రి వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు కూడా గంటా రోను తుపాను కంటే సినిమానే ప్రధానమన్నట్టు వ్యవహరించారని ప్రచారం జరుగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్న మంత్రి బ్రహ్మోత్సవం సినిమా చూశారని అంటున్నారు. ఓ పక్క విశాఖ ప్రజలు రోను భయంతో అల్లాడుతుంటే గంటా ఏమాత్రం పట్టకుండా ఎంచక్కా హైదరాబాద్‌లో కూర్చుని సినిమా వీక్షించారన్న ఆరోపణలు శుక్రవారం విశాఖలో వర్షం కంటే జోరుగా హోరెత్తాయి.