ముస్లిం సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం
సంక్షేమ పథకాలకు పెద్దపీట
మంత్రులు గంటా, అయ్యన్న
రంజాన్ తోఫా కానుకల పంపిణీ
మహారాణిపేట(విశాఖ): ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం మొదట నుంచి అండగా ఉంటోందని జిల్లా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు అన్నారు. రంజాన్ సందర్భంగా గురువారం సాయంత్రం ఏయూ అంబేద్కర్ హాల్లో ముస్లిం సోదరులకు చంద్రన్న రంజాన్ తోఫా కానుకలను అందచేశారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీల గోధుమపిండి, 2 కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముస్లింల కోసం ప్రభుత్వం రోష్ని, దుకాణ్, దుల్హన్ పథకాలను ప్రవేశపెట్టిందని, అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రంజాన్ సందర్భంగా జిల్లాలో కోటి రూపాయల విలువైన సరకులను 21,200 ముస్లిం కుటుంబాలకు అందచేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పండగ అయిన వెంటనే ముస్లింల సమస్యలపై చర్చించేందుకు ముస్లిం పెద్దలతో ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పండగ సమయాల్లో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలకు ఈ కానుకలను అందచేస్తున్నారన్నారు.
ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో ముస్లిం కోసం రూ.379 కోట్లు కేటాయించిందన్నారు. ఎంపీలు హ రిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలకు జిల్లా అంతా ప్రచారం కల్పించాలని కలెక్టర్ యువరాజ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద్ సత్యనారాయణ, కె.ఎస్.ఎన్.రాజు, వాసుపల్లి గణేశ్‌కుమార్, కలెక్టర్ ఎన్.యువరాజ్, జేసీ జనార్దన్ నివాస్, డీఎస్‌ఓ జె.శాంతకుమారి, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ.రెహ్మాన్, డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిట్టిరాజు, ఏఎస్‌ఓలు పాల్గొన్నారు.