కర్చీఫ్ వేసేసిన గంటా
చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ఇప్పటి నుంచి కర్చీఫ్ వేసేసుకుంటున్నారు. మాజీమంత్రి, భీమిలీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈసారి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిపైనే కన్నేశారు. చంద్రబాబు ఆదేశిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపడతానంటూ తన మనసులో మాటను వెల్లడించారు. లేకుంటే సామాన్య కార్యకర్తగానే ఉండిపోతానంటూ గంటా చెప్పుకొచ్చారు.
కాగా విశాఖ జిల్లాలో మరోసారి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మరోసారి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎన్నికల్లో ఇద్దరూ గెలవడంతో మంత్రిపదవులపై కన్నేసిన ఈ నేతల మధ్య మాటలు హద్దులు మీరడంతో అధినేత జోక్యం చేసుకున్నట్టు సమాచారం. గత ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు టీడీపీ హ్యాండిచ్చి ప్రజా రాజ్యం పార్టీలోకి దూకి, అక్కడి నుండి చిరంజీవితో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి దూకేసి మంత్రి అయిపోయారు.
పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు బయటకి దూకేసి పారిపోయిన గంటా, కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చి మళ్లీ సొంతగూటికి చేరిన విషయం తెలిసిందే. కాగా గంటా రాకను అప్పట్లో అయ్యన్నపాత్రుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఓదశలో టీడీపీని వదిలేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే బాబు బుజ్జగింపులతో ఆయన తన ప్రయత్నం విరమించారు. ఈసారి గంటా, అయ్యన్నల మధ్య మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు వార్ మొదలైందనే చెప్పుకోవచ్చు. మరి బాబు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది వేచి చూడాల్సిందే.