
బండారును బుజ్జగించిన మంత్రి గంటా!
విశాఖ : చంద్రబాబు నాయుడు కేబినెట్లో చోటు దక్కకపోవటంతో మనస్తాపం చెందిన ఆపార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ తన అలక వీడటం లేదు. దాంతో మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. బండారును బుజ్జగించే యత్నంలో భాగంగా బుధవారం ఉదయం ఆయన నివాసానికి గంటా వెళ్లారు. ఈ సందర్భంగా మంతనాలు జరిపారు. అయితే భేటీపై గంటా మాత్రం పెదవి విప్పలేదు.
కాగా కొత్త మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించలేదన్న బాధతో అలిగిన విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా తెలుగుదేశం పార్టీలో చిచ్చు మొదలైనట్టయింది. ఆయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబుకు పంపించిన విషయం తెలిసిందే. కాగా బాబు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన బండారు మధ్యలోనే వెనుదిరిగి వచ్చేశారు.