అమీ..తుమీకి సిద్ధం
నేడు మాడుగులకు మంత్రి అయ్యన్న
రూ.6.31కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
వెళ్లాలా..? వద్దా..? ఎటూ తేల్చుకోలేని కలెక్టర్
పర్యటనకు ‘గంటా’ వర్గం దూరం
విశాఖపట్నం : అధికార తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గపోరుకు మాడుగుల శుక్రవారం వేదిక కాబోతుంది. ఎడముఖం..పెదముఖంగా జిల్లా పార్టీలో గ్రూపులకు ఆజ్యం పోస్తున్న రాష్ర్టమంత్రులు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. వీరి మధ్య అడకత్తెరలో పోకచెక్కలా అధికారులు నిలిగిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ విశాఖ గ్రామీణ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు సొంత నియోజకవర్గమైన మాడుగులలో నేడు బలప్రదర్శనకు సిద్దమయ్యారు. రాజకీయ గురువైన రాష్ర్టమంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడితో రూ.6.31కోట్ల విలువైన భారీ ఎత్తున అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. తాను లేనప్పుడు ఏ విధంగా ఈ కారక్రమాలు తలపెడతారంటూ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్‌కే లేఖ ఇవ్వడంతో పాటు అడ్డుకోకపోతే సభాహక్కుల నోటీసు ఇస్తానంటూ హెచ్చరికలు చేశారు. దీంతో మాడుగులలో అయ్యన్న పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రుల మధ్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో రాష్ర్ట మంత్రి అయ్యన్న పాత్రుడు వెళ్లితీరతానని తెగేసి చెప్పడం..సొంత నియోజకవర్గంలో తలపెట్టిన ఈ కార్యక్రమాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసు కోవడంతో ఈ పరిణామాలు పార్టీలో ఎంతవరకు దారితీస్తాయోననే ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది.చివరి నిముషం వరకు అడ్డుకోవాలని పట్టుదలతో మరోపక్క మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం విఫలయత్నం చేస్తోంది.
ఎంపీ కలెక్టర్‌కు లేఖ సంధించగా గంటా వర్గీయులు ఇప్పటికే నియోజకవర్గంలోని పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులకు అయ్యన్న పర్యటనలో పాల్గొన వద్దంటూ ఫోన్‌లలో బెదిరింపులకు పాల్పడినట్టు తెలిసింది.విశాఖ డెయిరీ రైతులెవ్వరూ పాల్గొనవద్దంటూ గంటా అనుచరుడి నుంచి ఫోన్‌లు వెళ్లినట్టు సమాచారం. మరొక పక్క ఈ కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ తమ ఉన్నతాధికారులతో చర్చించారు. పార్లమెంటు సమావేశాల సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను ఆపనవసరం లేదని చెప్పినట్టుగా వారు కలెక్టర్‌కు సూచించినట్టు సమాచారం. మాడుగులలో తలపెట్టిన ఏ ఒక్క కార్యక్ర మం కూడా ఎంపీ లాడ్స్‌తో చేపట్టినవి కావు కూడా కాదు. అందువలన ఈ కార్యక్రమాలను ఏ విధంగా అడ్డుకోగలమని అధికారులంటున్నారు. గవిరెడ్డి విజయవంతం చేసేందుకు శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నారు. భారీగా జనసమీకరణ చేస్తున్నారు. నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో అయ్యన్న పర్యటన విజయవంతంపై కసరత్తు చేశారు.
ఫ్లెక్సీలతో ముంచెత్తారు. బలనిరూపణలో భాగంగా ఈసందర్భంగా భారీ బహిరంగ సభ కూడా తలపెట్టారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ ఈ పర్యటనలో పాల్గొంటారని గవిరెడ్డి తెలిపారు. అయితే ఈ పర్యటనకు వెళ్లాలా? వద్దా? అంటూ కలెక్టర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వె ళితే గంటా వర్గానికి, వెళ్లకపోతే అయ్యన్నవర్గానికి టార్గెట్ అయిపోతానంటూ కలెక్టర్ మదనపడుతున్నట్టు సమా చారం. మీటింగ్‌ల వంకతో ఈ ఒక్కసారి అయ్యన్న పర్యటనకు దూరంగా ఉండడమే మేలన్న భావనలో కలెక్టర్ ఉన్నట్టుగా తెలియవచ్చింది.