విద్యుత్ శాఖలో అవినీతి తుఫాన్! | Department of Energy in the area of corruption! | Sakshi
Sakshi News home page

విద్యుత్ శాఖలో అవినీతి తుఫాన్!

Published Sun, Jul 26 2015 12:11 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

విద్యుత్ శాఖలో  అవినీతి తుఫాన్! - Sakshi

విద్యుత్ శాఖలో అవినీతి తుఫాన్!

అత్యవసర సేవల పేరుతో లెక్కలేనంత ఖర్చు
విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో రూ.కోట్లలో అవినీతి జరిగిందని ఆరోపణలు
తీవ్ర ప్రభావిత మండలాల్లో కన్నా మిగతా చోట్ల అత్యధిక ఖర్చు
గంట్యాడలో రూ.13.01 కోట్లు, వేపాడలో  రూ.11.97 కోట్ల ఖర్చుపై అనుమానాలు

 
విజయనగరం :హుద్‌హుద్ తుపాను అనంతరం చేపట్టిన విద్యుత్ పునరుద్ధరణ పనుల మాటున  కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయా?  కూలులు, రవాణా చార్జీల రూపంలోనే కాకుండా మెటీరియల్ కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున  అవకతవకలు  చోటు చేసుకున్నాయా?   అధికారుల లెక్కలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయా? ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధుల  ప్రమేయం ఉందా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  హుద్‌హుద్ ప్రభావం జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ,  విజయనగరం పైన తీవ్రంగా ఉంది.  ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కానీ పునరుద్ధరణ కోసం చేసిన ఖర్చులు అందుకు భిన్నంగా  ఉన్నాయి. భారీగా ధ్వంసమైన చోట కంటే మిగతా చోట్ల అధికంగా ఖర్చు చేయడంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంట్యాడ సెక్షన్‌లో రూ.13.01కోట్లు, వేపాడ సెక్షన్‌లో రూ.11.97 కోట్లు ఖర్చుచేయడం  అనుమానాలకు దారితీస్తోంది. హుద్‌హుద్ తుపాను వల్ల  ధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు జిల్లాలో రూ.129.15 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో మెటీరియల్ కోసం రూ.118.56 కోట్లు, కూలీలు, రవాణా ఖర్చుల కింద రూ.10.59 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో విజయనగరం డివిజన్‌లో రూ.112.21కోట్లు, బొబ్బిలి డివిజన్‌లో రూ.16.64 కోట్లు ఖర్చు పెట్టారు.

కాకపోతే, విజయనగరం డివిజన్‌లో సెక్షన్లలో   జరిగిన ఖర్చులు చూస్తే ఎవరికైనా అనుమానం రాకమానదు. తీవ్రంగా విద్యుత్‌వ్యవస్థ దెబ్బతిన్న    భోగాపురం సెక్షన్‌లో  రూ. 7.85కోట్లు, పూసపాటిరేగ సెక్షన్‌లో రూ.6.36కోట్లు, విజయనగరం అర్బన్( ఐదు సెక్షన్లు కలిపి)లో రూ.12.09కోట్లు ఖర్చు చేయగా స్వల్పంగా దెబ్బతిన్న గంట్యాడ సెక్షన్ ఒక్కదాంట్లో రూ.13.01 కోట్లు ఖర్చు పెట్టారు. దాని తర్వాత  వేపాడలో రూ.11.97కోట్లు, జామిలో రూ.10.70కోట్లు ఖర్చు చేశారు.  విశేషమేమిటంటే తుపాను ప్రభావిత మండలాల్లో వేపాడ లేకపోయినప్పటికీ  ప్రభావం ఉన్న సెక్షన్‌లో కన్నా అక్కడ ఎక్కువగా ఖర్చు పెట్టారు. దీంతో ఆయా మండలాల్లో అంత నష్టం ఎక్కడ జరిగిందన్నదానిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలా ఆయా సెక్షన్‌లలో  నికర ఆస్తులు విలువ అంత ఉంటుందో లేదో కూడా చెప్పలేం. కానీ  సంబంధిత ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి మెటీరియల్ మాటున కైంకర్యం చేసి ఉండొచ్చనే ఆరోపణలొస్తున్నాయి. ఇందులో నేతల భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది. వారి డెరైక్షన్‌లో మెటీరియల్ ముసుగులో పెద్ద ఎత్తున ఖర్చు చూపించారన్న విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా వినియోగించిన మెటీరియల్ కూడా నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల విద్యుత్ స్తంభాలు మధ్యకు విరిగిపోయి కనిపిస్తున్నాయి.  

ఆరోపణలకు కొదవే లేదు
హుద్‌హుద్ తుపాను  అనంతరం గ్రామాలు చీకట్లో మగ్గిపోవడంతో సర్పంచ్‌లు, గ్రామపెద్దలు చొరవ తీసుకుని తమ సొంత ఖర్చులతో గోతులు తవ్వడమే కాకుండా అందుకు అవసరమైన స్తంభాలను తరలించుకున్నారు. కొన్ని పంచాయతీల్లో స్థానిక ప్రజలే పనులు చేపట్టారు.  పనిచేయడానికి వచ్చిన సిబ్బందికి భోజనాలు కూడా పెట్టారు. కానీ అవన్నీ ఖర్చుల కింద చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి.

రోజుకు కూలీకి రూ.350 మాత్రమే చెల్లించి... రూ.500చొప్పున కూలీ ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించినట్టు విమర్శలొచ్చాయి.నష్టం జరగకపోయినా, అసలు విద్యుత్ స్తంభాలే లేకపోయినా... నష్టం జరిగినట్టు చూపించి... పలు మండలాల్లో గల రియల్ ఎస్టేట్ లేఅవుట్‌లలో ఇదే అదునుగా  విద్యుత్ స్తంభాలేసి సొమ్ము చేసుకున్నట్టు తెలిసింది. కొత్త మెటీరియల్ వేసిన చోట  ఉన్న పాడైన సామాగ్రిని స్టోరేజ్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. చాలావరకు విక్రయాలు చేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
     
గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ తదితర మండలాల్లో పలుచోట్ల ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ స్తంభాలు   వేయలేదన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో మిగుల్చుకున్న మెటీరియల్‌ను రియల్ ఎస్టేట్‌లో వాడుతున్నారన్న వాదనలు ఉన్నాయి.అలాగే సహాయకార్యక్రమాల్లో భాగంగా తెలంగాణా, ఒడిశా తదితర పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన విద్యుత్ పరికరాలు ఏమయ్యాయో తెలియడం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement