Huge buildings Construction
-
సౌదీలో ప్రపంచ ఎనిమిదో వింత!
మీకు స్కై స్క్రాపర్ అంటే తెలుసుగా.. అదేనండీ ఆకాశహర్మ్యం.. వందలాది అడుగుల ఎత్తైన భారీ భవనం. మరి సైడ్‌వే స్కైస్క్రాపర్ గురించి ఎప్పుడైనా విన్నారా? సౌదీ అరేబియాలో త్వరలో అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం కానుంది. పేరుకు తగ్గట్లే ఇది ఎత్తుకన్నా పక్కలకు ఎక్కువగా విస్తరించి ఉంటుందన్నమాట. ఆ ఇందులో పెద్ద విశేషం ఏముందిలే అనుకోకండి.. ఎందుకంటే ఈ నిర్మాణం ఏకంగా 120 కిలోమీటర్ల పొడవు ఉండనుంది మరి!! మరోలా చెప్పాలంటే దీని పొడవు దాదాపుగా అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం అంత ఉండనుంది!! ప్రపంచంలోని ఎనిమిదో వింతగా అందరినీ అబ్బురపరచనుంది. ఈ భారీ ప్రాజెక్టులో మరిన్ని విశేషాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే.. ఎన్నెన్నో ప్రత్యేకతలు... సౌదీ యువరాజు, ఉప ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏకంగా 26,500 చదరపు కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన భవిష్యత్ నగరం ‘నియోమ్ సిటీ’లో భాగంగా 120 కి.మీ. పొడవైన రెండు సైడ్‌వే స్కైస్క్రాపర్లను నిర్మించనున్నారు. వాయవ్య సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రానికి చెందిన గల్ఫ్ ఆఫ్ అకాబా తీరం నుంచి ఎడారిలో ఉన్న కొండల మధ్య దాకా ఈ ప్రాజెక్టు విస్తరించనుంది. ఈ రెండు భవనాలను అద్దాలతో అలంకరించనున్నందున దీనికి ‘మిర్రర్ లైన్’ అని పేరు పెట్టారు. ఎత్తులోనూ ఇవి ప్రపంచంలోని ఇతర ఆకాశహర్మ్యాల స్థాయిలో రూపుదిద్దుకోనున్నాయి. 490 మీటర్ల వరకు అంటే దాదాపుగా అర కిలోమీటర్ ఎత్తు వరకు ఈ భవనాలను కట్టనున్నారు. న్యూయార్క్‌లో ఉన్న 102 అంతస్తుల ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చిట్టచివరి కొన వరకు ఉన్న ఎత్తు 443 మీటర్లకన్నా ఈ జంట భవనాలు మరెంతో ఎత్తు వరకు కనిపించనున్నాయన్నమాట. ఇంత పొడవైన జంట భవనాల్లో కిలోమీటర్లకొద్దీ కట్టబోయే ఇళ్లలో ఏకంగా 50 లక్షల మంది నివసించవచ్చట! రోజుకు మూడపూటలా భోజనానికి ‘సబ్‌స్క్రైబ్’ చేసుకున్న వారికి అవసరమైన పంటలను సైతం ఈ విస్తీర్ణంలోనే పండిస్తారట. భవనాల ఒక చివరి నుంచి మరో చివరి వరకు 20 నిమిషాల్లో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా భూగర్భంలో హైస్పీడ్ రైల్వే లైన్, పాదచారుల కోసం వాక్ వేస్, నేల నుంచి వెయ్యి అడుగుల ఎత్తులో భారీ స్టేడియం వంటి ఎన్నో హంగులు ఇందులో ఉండనున్నాయి. ఈ పే...ద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు కూడా అత్యంత భారీగానే ఉండనుంది. సుమారు 50 ఏళ్లు పట్టే ఈ ప్రాజెక్టు పూర్తికి ఏకంగా రూ. 80 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా! సాక్షి సెంట్రల్ డెస్క్ -
‘పర్యావరణ’ రుసుము ఇక సరళం
* పదివేల చదరపు అడుగులకు పైగా స్థలంలో నిర్మించే భవనాలకు వర్తింపు సాక్షి, హైదరాబాద్: భారీ భవనాల నిర్మాణంపై పర్యావరణ ప్రభావిత రుసుము చెల్లింపులను ప్రభుత్వం సరళీకృతం చేసింది. 10,000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంగల స్థలంలో నిర్మించే భారీ భవనాలపై ప్రతి చదరపు అడుగుకు రూ.3 చొప్పున ఈ రుసుమును విధించాలని ఆదేశిస్తూ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భారీ భవనాల నిర్మాణంలో ఉపయోగించే నిర్మాణ సామగ్రి తయారీ కోసం పెద్ద మొత్తంలో వినియోగించే సహజ వనరుల వల్ల పర్యావరణంపై పడే ప్రభావ తీవ్రతను లెక్కగట్టి ఈ ఫీజులను ప్రభుత్వం వసూలు చేస్తోంది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై భవన నిర్మాణ అనుమతులకు ముందే ఈ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. గతంలో భవన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం భూగర్భ గనుల శాఖ అధికారులు ఈ రుసుము మొత్తాన్ని లెక్కగట్టి విధించేవారు. అయితే ఈ ప్రక్రియలో పారదర్శకత కొరవడిందని తెలంగాణ రియల్ ఎస్టేట్ సంఘాల సమాఖ్య ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. దాంతో ఇకపై భవన నిర్మాణ అనుమతులకు ముందే బిల్డింగ్ ప్లాన్‌కు అనుగుణంగా ఈ ఫీజును వసూలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఇప్పటికే నిర్మాణం జరుగుతున్న, నిర్మాణం పూర్తయిన భవనాలపై సైతం ఈ ఫీజులు విధించాలని ప్రభుత్వం సూచించింది. అలాగే లెసైన్స్డ్ ఇంజనీర్ ఇచ్చిన ధ్రువపత్రం ఆధారంగా బిల్డర్లు స్వచ్ఛందంగా ఈ ఫీజులను చెల్లించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో పాటు గనుల శాఖ అధికారులు ఈ భవనాలపై దాడులు నిర్వహించినప్పుడు ఈ ధ్రువపత్రాలను చూపిస్తే సరిపోతుంది. పర్యావరణ ప్రభావ రుసుము చెల్లింపులను సరళీకృతం చేసినందుకు తెలంగాణ డెవపలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.