human life Nature
-
మెదడులో కల్లోలం.. ఆ నాలుగు గంటలు ఎంతో కీలకం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై పక్షవాతం బారిన పడతారు. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చేది. కానీ ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల లోపు యువత కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల అనేక మంది పక్షవాతానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 30 శాతం మంది యువతే.. ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారిలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 25 నుంచి 30 శాతం మంది 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తుంటారు. వారి స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగక పోవడం వలన వచ్చే స్ట్రోక్(ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు. ప్రధాన కారణాలివే.. - పెద్ద వయస్సు వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్‌కు కారణంగా చెబుతున్నారు. - 45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సిక్కుసెల్ అనే రక్తంలో జెనిటిక్ లోపాలు, వంశపారంపర్యంగా, హెరాయిన్ వంటి డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. - వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలె్రస్టాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్‌కు గురవుతున్నట్లు వెల్లడిస్తున్నారు. - ఆడవారిలో హార్మోనల్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా కూడా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండెలోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువని వివరిస్తున్నారు. ఆ నాలుగు గంటలే కీలకం.. ఇప్పుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి, నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్‌తో వైకల్యం రాకుండా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన వారికి త్రోంబలైసిస్ ఇంజెక్షన్‌ను ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, ఆకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, తలతిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. -
పరుగెత్తడమూ విద్యే..
వరంగల్ స్పోర్ట్స్ : ‘విద్య అంటే చదవడం, రాయడం.. ర్యాంకుల కోసం వెంపర్లాడడం కాదు.. ఉదయం, సాయంత్రం మైదానాల్లో పరుగెత్తడం.. ఇష్టమైన ఆటల్లో శిక్షణ పొందడమూ విద్యే’ అని బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, భారత జట్టు కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. ఆదివారం హన్మకొండ అశోకా కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి తల్లిదండ్రులు వారి ఆలోచనలను పిల్లలపై బలవంతంగా రుద్దుతూ తరగతి గదులకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు మైదానాలను పరిచ యం చేసి వారికి ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి. అలా చేయడం వల్ల క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుంది. విద్యార్థులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. ప్రతిభకు కొదువలేదు.. తెలంగాణలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదువలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోసియేషన్ పాటుపడుతోంది. క్రీడలు, క్రీడాకారుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. ప్రతిభ ఉండి ఆర్థికంగా, ఇతర కారణాలతో వెనుకబడిన క్రీడాకారుల వివరాలను మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వారికి మెరుగైన శిక్షణ అందజేస్తాం. ఫిట్నెస్ పెంపునకు ఒప్పందం టోర్నమెంట్ల సమయంలో క్రీడాకారులకు తెలియకుండా చిన్న చిన్న ఒత్తిళ్లు వారి మెదడులోకి చొచ్చుకుపోతుం టాయి. తద్వారా క్రీడలపై దృష్టి పెట్టలేక చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరచలేని పరిస్థితులు ఉన్నాయి. క్రీడాకారుల్లో సైకాలజికల్‌గా ఫిట్నెస్ పెంపొందించేందుకు ఖరగ్‌పూర్ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మెరికల్లాంటి కోచ్‌లను తయారు చేస్తాం.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కోచ్‌ల కొరత ఉంది. కోచ్‌లు ఉన్న కొన్ని చోట్ల నైపుణ్యం కలిగిన వారు తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. అందుకే రానున్న రోజుల్లో క్రీడాకారులనే కాదు మెరికల్లాంటి కోచ్‌లను తయారు చేయాలని సిద్ధమవుతున్నాం. అందుకోసం జూలై 1 నుంచి ప్రత్యేక శిక్షణ తరగుతులు నిర్వహించనున్నాం. ఇప్పడికే కోచ్‌లుగా కొనసాగుతున్న వారితోపాటు కొత్త వారికి ప్రత్యేక శిక్షణ అందించడమే తమ లక్ష్యం. వరంగల్‌లో త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీ.. హైదరాబాద్‌లో మాదిరిగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను క్రీడాకారులు మా ముందుకు తీసుకొస్తున్నారు. అయితే అకాడమీ ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. సాంకేతిక ఇతర కారణాలు అనేకం అడ్డొస్తుంటాయి. వరంగల్ కేంద్రంగా త్వరలోనే అకాడమీ ఏర్పాటు చేసేందుకు పలువురి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరలోనే ఏర్పాటుకు కృషి చేస్తున్నాను. -
టెక్నాలజీతో నాణ్యమైన ఫలితాలు
తెయూ(డిచ్పల్లి): టెక్నాలజీ వినియోగం మానవ జీవనంలో భాగమై పోయిందని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ ఖాజీం నఖ్వీ పేర్కొన్నారు. దైనందిన జీవనంలో ప్రతీ సందర్భంలోనూ సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరైందన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తాధ్వర్యంలో ‘రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ’ అంశంపై జరిగిన జాతీయ సెమినార్ తొలి రోజున నఖ్వీ కీలకోపన్యాసం చేశారు. వ్యవసాయంతో పాటు విద్య, విజ్ఞానం, అంతరిక్షం వరకూ ప్రతి విషయంలోనూ సాంకేతిక పరిజ్ఞానం అవసరం తప్పనిసరిగా మారిందన్నారు. ఉన్నత విద్యారంగంలో డిజిటల్ విద్య కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా సమయం ఆదా అవడమే కాకుండా నాణ్యతతో కూడిన ఫలితాలు వస్తాయన్నారు. విద్య, వైద్యారోగ్య రంగాలతో పాటు ప్రతి అంశంలోనూ ఐటీ ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. నేటి యువత విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకున్నపుడే ఉజ్వలమైన భవిత సాధ్యమని టెక్ మహీంద్రా సంస్థ యూరోప్ హెడ్ మురళి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, సమయం ఆదా చేయడంతో పాటు చేసే ప్రతి పనిలోనూ ఫలితాలు ప్రయోజనకరంగా ఉండేలా చొరవ చూపాలని టెక్ మహీంద్రా సంస్థ అసోసియేట్ జనరల్ మేనేజర్ నరేశ్ నేటంకి సూచించారు. సాధించిన ఫలితాలే వ్యక్తిని, వ్యవస్థను ఉన్నత స్థాయిలో నిలబెడతాయని తెలిపారు. తెయూ సైన్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ విద్యావర్థని అధ్యక్షత వహించగా, సెమినార్ కన్వీనర్ ఆరతి ప్రాధాన్యతను వివరించారు.