ఇంటర్నెట్ ద్వారా మనిషి మెదడుపై నియంత్రణ
వాషింగ్టన్: ఇంటర్నెట్ ద్వారా మనిషి మెదడుపై శాస్త్రవేత్తలు విజయవంతంగా నియంత్రణ సాధించారు. ఒక మనిషి మెదడు ఇంటర్నెట్ ద్వారా మరో మనిషి మెదడుపై నియంత్రణ సాధించిన ఈ ప్రయోగంలో భారత సంతతి శాస్త్రవేత్త ఒకరు కీలక పాత్ర పోషించారు. భారత సంతతికి చెందిన వాషింగ్టన్ వర్సిటీ ప్రొఫెసర్ రాజేష్ రావు ఇంటర్నెట్ ద్వారా తన మెదడులోని సంకేతాన్ని తన సహ శాస్త్రవేత్త ఆండ్రియా స్టోకోకు పంపారు.
సంకేతాన్ని అందుకున్న స్టోకో వేళ్లు దానికి అనుగుణంగా కంప్యూటర్ కీబోర్డుపై కదిలాయి. కాగా, ఇదివరకు డ్యూక్ వర్సిటీ శాస్త్రవేత్తలు రెండు ఎలుకల మెదళ్ల నడుమ సమాచార ప్రసారాన్ని విజయవంతంగా సాధించారు. హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఒక మనిషి మెదడు నుంచి ఒక ఎలుక మెదడుకు సంకేతాలను పంపగలిగారు. అయితే, మనిషి మెదడులోని సంకేతాలను మరో మనిషికి ఇంటర్నెట్ ద్వారా విజయవంతంగా పంపడం ఇదే తొలిసారి కావడం విశేషం.