Human Rights Protection
-
మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల్లోని సంస్థలు ప్రపంచ ప్రతిష్టాత్మక బహుమానానికి ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై దండెత్తుతున్న రష్యా అధినేత పుతిన్ ఏకపక్ష వైఖరిపై ఇదొక నిరసన అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం వంటి అంశాల్లో గొప్ప చాంపియన్లు అయిన ముగ్గురిని (ఒక వ్యక్తి, రెండు సంస్థలు) శాంతి బహుమతితో గౌరవిస్తుండడం ఆనందంగా ఉందని నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రీస్–ఆండర్సన్ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడారు. వారంతా సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ మానవీయ విలువలు, న్యాయ సూత్రాల రక్షణ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం వర్థిల్లాలని ఆల్ఫెడ్ నోబెల్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. బియాల్‌యాస్కీని విడుదల చేయండి జైలులో ఉన్న అలెస్ బియాల్‌యాస్కీని విడుదల చేయాలని బెలారస్ పాలకులకు బెరిట్ రీస్–ఆండర్సన్ విజ్ఞప్తి చేశారు. బహుమతి బియాల్యాస్కీలో నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని, ఆయనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించబోదని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా మానవ హక్కుల సంస్థకు శాంతి బహుమతి ప్రకటించడం ద్వారా.. శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న పుతిన్‌కు ఉద్దేశపూర్వకంగా ఏదైనా సంకేతం పంపదలిచారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ప్రజలకు మంచి చేసేవారికి బహుమతి ఇస్తుంటామని, అంతేతప్ప తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, వ్యక్తుల పుట్టినరోజులతో తమకు సంబంధం లేదని బెరిట్ రీస్–ఆండర్సన్ బదులిచ్చారు. ఈ ప్రైజ్ పొందడం ద్వారా ఆయా సంస్థల వెనుక ఉన్న వ్యక్తులు వారు నమ్మినదాని కోసం మరింత ఉత్సాహంతో కృషి సాగిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. గత ఏడాది(2021) నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా అందుకున్న రష్యా జర్నలిస్టు దిమిత్రీ మురతోవ్, ఫిలిప్పైన్స్ జర్నలిస్టు మారియా రెస్సా అక్కడి ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పనిచేస్తున్న మీడియా సంస్థల్లో ఉద్యోగాలను కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటానికి వీరిద్దరికి నోబెల్ లభించింది. యుద్ధంపై ఎక్కుపెట్టిన ఆయుధం ఉక్రెయిన్‌లోని కొందరు శాంతి కాముకులు 2007లో ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దేశంలో అశాంతి రగులుతున్న తరుణంలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య ఉద్యమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఉక్రెయిన్ పౌర సమాజాన్ని బలోపేతం తదితరాలు సంస్థ ముఖ్య లక్ష్యాలు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఈ సంస్థ మరింత క్రియాశీలకంగా పనిచేస్తోంది. సాధారణ ప్రజలపై రష్యా యుద్ధ నేరాలను రికార్డు చేసి, ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ యుద్ధ నేరాలకు రష్యాను జవాబుదారీగా మార్చేందుకు కృషి చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన అసలైన ఆయుధం మానవ హక్కుల పోరాటమేనని ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ చెబుతోంది. అంకితభావం గల ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీ నేటి రష్యాలోని వైర్టిసిల్లాలో 1962 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం బెలారస్‌కు వలస వెళ్లింది. విద్యాభ్యాసం అనంతరం బియాల్‌యాస్కీ కొంతకాలంపాటు పాఠశాల ఉపాధ్యాయుడిగా, తర్వాత సైన్యంలో డ్రైవర్‌గా పనిచేశారు. 1980వ దశకం నుంచి బెలారస్లో ఆయన మానవ హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 1996లో ‘వియాస్నా హ్యూమన్ రైట్స్ సెంటర్’ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. అంకితభావం కలిగిన మానవ హక్కుల, పౌరస్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించారు. హవెల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అవార్డును 2013లో, నోబెల్‌కు ప్రత్యామ్నాయంగా భావించే రైట్ లైవ్లీçహుడ్ అవార్డును 2020లో గెలుచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సారథ్యం వహిస్తున్న బియాల్‌యాస్కీని పన్నులు ఎగవేశారన్న కారణంతో బెలారస్ పాలకులు 2021 జూలై 14న నిర్బంధించారు. ఆయన ప్రస్తుతం ఎలాంటి విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నా పాలకులు లెక్కచేయడం లేదు. ఎన్నో అవరోధాలు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నమ్మిన సిద్ధాంతానికి బియాల్‌యాస్కీ కట్టుబడి ఉండడం విశేషం. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాటం ‘మెమోరియల్’ సంస్థ 1989 జనవరి 28న అప్పటి సోవియట్ యూనియన్ చివరిదశలో ఉన్న సమయంలో ఏర్పాటైంది. ప్రధానంగా ఇది న్యాయ సేవా సంస్థ. కమ్యూనిస్టు పాలకుల అణచివేత చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి అండగా నిలిచింది. రష్యాలో మానవ హక్కుల విధ్వంసంపై, రాజకీయ ఖైదీల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ‘మెమోరియల్’ ప్రధాన కార్యాలయం రష్యా రాజధాని మాస్కోలో ఉంది. సంస్థ బోర్డు చైర్మన్‌గా యాన్ రచిన్‌స్కీ వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఈ సంస్థను ఈ ఏడాది ఏప్రిల్ 5న రష్యా ప్రభుత్వం మూసివేసింది. అయినప్పటికీ ‘మెమోరియల్’ కార్యకలాపాలు అనధికారికంగా కొనసాగుతూనే ఉండటం విశేషం. -
పట్టాల కోసం పోరుబాట
♦ కదం తొక్కిన జవహర్‌నగర్‌వాసులు ♦ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ శామీర్‌పేట్ / జవహర్‌నగర్: ప్రభుత్వాలు మారినా పేదల జీవితాల్లో వెలుగులు లేవని ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్‌నగర్‌లోని ఇళ్లను క్రమబద్ధీకరించి, జీవో 58, 59ను అమలుపర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బాలాజీనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని ఎన్నో పోరాటాలు చేశారని.. నివసించే గూడు కోసం పోరాటం చేయాల్సి రావడం విచారకరమన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం జవహర్‌నగర్‌కు వలస వచ్చి భయంగుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. నివాసహక్కు కల్పించాలని ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు ఎక్కడ గుడిసె వేసుకుంటే అక్కడే పట్టాలిస్తామని ప్రకటనలు చేసి జీవో 58,59ను అమల్లోకి తెచ్చారని, జవహర్‌నగర్‌లో నివసించే పేదల ఇళ్లకు పట్టాలిచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్వయంగా చెప్పడం టీఆర్ఎస్ పాలనకు అద్దం పడుతోందన్నారు. పేదల ఇళ్లను క్రమబద్ధీకరించకుండా కాలయాపన చేయడమే కాకుండా మరోవైపు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మిగులు భూములను స్థానికుల అవసరాలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మేడ రవి, కన్వీనర్ మస్తాన్‌బీ, కో చైర్మన్లు జి.అనురాధ, శివబాబు, వి.కిరణ్, డాక్టర్ వెంపటి బాస్కర్, సునీత, ఎండీ జావెద్, కోశాధికారి జి.చంద్రమౌళి, మీడియా ప్రతినిధులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, ఎస్కె మీరా, పాకాల డానియేల్, కోకన్వీనర్లు షేక్షావలి, సీహెచ్ బాలనర్సింహ, లక్ష్మీబాయి, రాజ్యలక్ష్మి, బి.మోహన్, అనంతలక్ష్మి, పాషామియా, పలు ప్రజా సంఘాల, కాలనీల నాయకులు పాల్గొన్నారు. -
బాధితురాలికి న్యాయం చేయాలి
బషీరాబాద్ : అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని దళిత స్త్రీ శక్తి న్యాయవాది భాగ్యలక్ష్మి, మానవ హక్కుల పరిరక్షణ బృందం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం వారు మండల పరిధిలోని మంతన్‌గౌడ్ తండాను సందర్శించి బాధితురాలి(13)తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఇటీవల బాలికపై జీవన్గి గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. వారు బాలిక కుటుంబీకులతో పాటు స్థానికులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. బాలిక శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉండడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనను అధికారులు తీవ్రంగా పరిగణించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని బాధితురాలికి సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా చైతన్యవేదిక జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిత్, మానవ హక్కుల పరిరక్షణ సంఘం సభ్యులు అనిత, తాండూరు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆరీఫాబేగం ఉన్నారు. -
క్లినికల్ ట్రయల్స్‌తో ప్రాణాలు తీస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆశ్రయించింది. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు వై.సోమరాజు సోమవారం కమిషన్ సభ్యుడు కాకుమాను పెదపేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అమెరికాకు చెందిన రెండు ఫార్మా కంపెనీలు ఇటీవల భద్రాచలం ప్రాంతంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై తమ మందులు ప్రయోగించగా.. ముగ్గురు బాలికలు చనిపోయారని తెలిపారు. ఔషధ నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోకుండానే మందులను ప్రజలపై ప్రయోగిస్తూ జీవించే హక్కును కాలరాస్తున్నారన్నారు. బాలికల మరణానికి కారణమైన ఫార్మా కంపెనీలపై సెక్షన్ 300 కింద క్రిమినల్ చర్యలు చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి రెండు నెలల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని భారత ఔషధ నియంత్రణ మండలి డెరైక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి డెరైక్టర్ జనరల్‌తోపాటు ఖమ్మం ఎస్పీలను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది.