సాక్షి, హైదరాబాద్: ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆశ్రయించింది. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు వై.సోమరాజు సోమవారం కమిషన్ సభ్యుడు కాకుమాను పెదపేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అమెరికాకు చెందిన రెండు ఫార్మా కంపెనీలు ఇటీవల భద్రాచలం ప్రాంతంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై తమ మందులు ప్రయోగించగా.. ముగ్గురు బాలికలు చనిపోయారని తెలిపారు.
ఔషధ నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోకుండానే మందులను ప్రజలపై ప్రయోగిస్తూ జీవించే హక్కును కాలరాస్తున్నారన్నారు. బాలికల మరణానికి కారణమైన ఫార్మా కంపెనీలపై సెక్షన్ 300 కింద క్రిమినల్ చర్యలు చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి రెండు నెలల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని భారత ఔషధ నియంత్రణ మండలి డెరైక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి డెరైక్టర్ జనరల్‌తోపాటు ఖమ్మం ఎస్పీలను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది.
క్లినికల్ ట్రయల్స్‌తో ప్రాణాలు తీస్తున్నారు
Published Tue, Sep 3 2013 1:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
Advertisement