Humpty Sharma
-
కష్టం ఫలించింది...
వయసులో చిన్నదే గానీ ఆలియా భట్ సాధించిన విజయాలు బాగానే ఉన్నాయి. ఈ 21 ఏళ్ల బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్లు కొట్టాయి. తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తోపాటు హైవే, హంప్టీ శర్మా కీ దుల్హానియా, 2 స్టేట్స్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. కష్టపడడంతోపాటు అదృష్టం కలసి రావడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయని ఆలియా చెప్పింది. నాలుగైదు హిట్లు దక్కినంత మాత్రాన గర్వం నెత్తికి ఎక్కడకూడదంది. ‘విజయాన్ని ఎలా కొలుస్తారో నాకు తెలియదు. నా అదృష్టం కొద్దీ మంచి అవకాశాలు దొరికాయి. సత్తా ఉన్న దర్శకులతో పనిచేసే భాగ్యం దక్కింది. వీళ్లు నా నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. పరిశ్రమలో మంచి స్థానం సంపాదించుకోవడానికి కారకుడైన కరణ్ జోహార్‌కు కృతజ్ఞతలు. శ్రమించే తత్వం, అదృష్టం వల్లే విజయాలు దక్కాయి’ అని వివరించింది. ఆలియా మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌కు కరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. అయితే కెరీర్లో ఎన్ని మార్పులు వచ్చినా, తన వ్యక్తిత్వంలో మార్పేమీ లేదని ఈ యువతి చెప్పింది. ప్రస్తుతం హిట్లు ఖాతాలో ఉన్నా, భవిష్యత్‌లో అపజయాలు ఉంటాయోమోనన్న భయం కూడా వెన్నాడుతోందని తెలిపింది. హిందీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టమని స్పష్టం చేసింది. ఇక ఆలియా తదుపరి సినిమా షాందార్ కాగా, ఇందులో షాహిద్ కపూర్ హీరో. రణ్‌బీర్ కపూర్‌తోనూ మరో సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే.. ఆలియా అందంపైనా బాగా దృష్టి పెట్టింది. బరువు తగ్గడం, మంచి ఆహారంపై శ్రద్ధ చూపుతోంది. మరీ బక్కపల్చగా ఉండడం తనకు ఇష్టముండదని, ఫిట్‌గా కనిపిస్తే చాలన్నది ఆలియా అభిప్రాయం. డబ్బు పెట్టి థియేటర్లకు వచ్చే వారికి ఆహ్లాదంగా అనిపించేలా నటులు ఉండాలని చెప్పింది. -
చిలిపి పాత్రలంటే ఇష్టం
వరుణ్ ధవన్ ముంబై: వరుణ్ ధవన్... నటించింది రెండు సినిమాల్లోనే అయినా యవతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అల్లరి పనులు చేసే చిలిపి పాత్రలంటే ఇష్టపడే ధావన్ తాను అటువంటి పాత్రలకు సరిగ్గా సరిపోతానని ‘మై తేరా హీరో’ సినిమాతో నిరూపించాడు. తాజాగా ‘హంప్టీ శర్మా కి దుల్హనియా’లో కూడా దాదాపుగా అదేరకమైన పాత్ర దక్కింది. ‘సరిగ్గా నేను ఎటువంటి పాత్రలనైతే ఇష్టపడతాను అటువంటి పాత్రల్లోనే నటించే అవకాశం వస్తోంది. హంప్టీ శర్మా...లో నేను చురుకైన రొమాంటిక్ హీరోలా కనిపించినా ఎంతో ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రమది. సాధారణ ప్రేమకథా చిత్రాలు చూసి ప్రేక్షకులకు విసుగొచ్చేసింది. అందుకే హంప్టీ శర్మా కి దుల్హనియా ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ కాస్త భిన్నంగా చూపించాలనుకున్నాం. ఈ ఏడాది ఉత్తమ ప్రేమకథా చిత్రంగా మా సినిమా నిలుస్తుందని భావిస్తున్నాన’ని చెప్పాడు. శశాంక్ కేతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్.. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ నటి ఆలియా భట్‌తో కలిసి నటిస్తున్నాడు. ఆలియాతో కలిసి నటించడం భలే సరదాగా ఉంటుందని, అయితే తొలి చిత్రానికి, ప్రస్తుత చిత్రానికి ఆమెలో ఎంతో మార్పు కనిపించిందన్నాడు. మనిషిగా ఆమెలో ఏ మార్పు లేకున్నా నటిగా ఆలియాలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం ఆమె అద్భుతంగా నటిస్తోందని, ఆమెతో కలిసి నటించడాన్ని తాను ఆస్వాధిస్తున్నానన్నాడు. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా గురించి మాట్లాడుతూ... మేమిద్దరం పోటీ పడుతున్నట్లు మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే మా ఇద్దరి మధ్య ఎటువంటి పోటీ లేదు. సిద్ధార్థ్ సినిమా విడుదలయ్యే రోజు కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాను. అతను కూడా అంతే. అతను నాకు సోదరుడిలాంటివాడు. అందుకే నన్ను ఎప్పుడూ ‘మై తేరా హీరో’ అంటూ ఆటపట్టిస్తాడు. నేను అంతే ఎప్పుడూ అతణ్ని ఆటపట్టిస్తుంటాను. ఇద్దరం భలే సరదాగా ఉంటామ’న్నాడు.