Humsafar
-
త్వరలో పట్టాలెక్కనున్న కొత్త రైలు
న్యూఢిల్లీ: హమ్ సఫర్ రైళ్లను భారతీయ రైల్వేశాఖ త్వరలో పట్టాలెక్కించనుంది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసిన ఆ శాఖ అధికారులు అక్టోబర్ 20 నుంచి హమ్ సఫర్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అయితే, సాధారణ ఎక్స్ ప్రెస్, మెయిళ్లతో పోల్చితే అదనంగా 20శాతం చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు.. హమ్ సఫర్ పేరుతో ప్రత్యేక సర్వీసు(ఏసీ-3టైర్)ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణ ఏసీ-3 టైర్ కోచ్ లలో అందుబాటులో ఉండని సదుపాయాలు ఈ రైళ్లలో ఉంటాయని ఆయన తెలిపారు. మహారాజా ఎక్స్ ప్రెస్ కోచ్ లకు వినియోగించే వినైల్ షీట్ లను ఈ రైళ్లలోని సీట్ల తయారీకోసం వినియోగించారు. రైలు అందంగా కనిపించేందుకు సరికొత్త ఇంటీరియర్ ను సమకూర్చారు. సౌకర్యాలు 1.టీవీ 2.జీపీఎస్ (ప్రయాణికుడి వివరాలను తెలుసుకునేందుకు) 3.ఫైర్ అండ్ స్మోక్ డిటెక్షన్ సిస్టం 4.సప్రెషన్ సిస్టమ్స్ 5.ప్రతి బెర్తుకు ల్యాప్ టాప్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు ఉంటాయి. -
మూడు రకాల కొత్త సూపర్‌ఫాస్ట్ రైళ్లు
రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్లో మూడు కొత్త రకాల సూపర్‌ఫాస్ట్ రైళ్లను ప్రకటించారు. పూర్తిగా థర్డ్ ఏసీ బోగీలతో కూడిన హమ్‌సఫర్ రైలు మొదటిది. ఇందులో కావల్సిన వాళ్లకు భోజనం కూడా పెడతారు. ఇక గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే తేజస్ రైలు రెండోది. ఇందులో వినోదం, స్థానిక ఆహారం, వై-ఫై సదుపాయాలు కూడా ఉంటాయి. ఈ రెండు రైళ్లకు కేవలం చార్జీల ద్వారానే నిర్వహణ వ్యయం మొత్తాన్ని రాబడతారు. వీటితో పాటు ఉదయ్ అనే పేరుతో ఓవర్‌నైట్ డబుల్ డెక్కర్ రైళ్లను, బిజీ మార్గాల్లో పూర్తిగా ఏసీ డబుల్ డెక్కర్ బోగీలతో కూడిన 'ఉత్కృష్ట్' రైళ్లను కూడా ప్రకటించారు. వీటితో పాటు రిజర్వేషన్ లేని ప్రయాణికులకు నాణ్యమైన ప్రయాణాన్ని అందించేందుకు గాను అంత్యోదయ అనే సూపర్ ఫాస్ట్ రైలును ప్రకటించారు. అలాగే, అన్ని రైళ్లలోనూ 'దీన్‌దయాళు' పేరుతో ఉండే అన్ రిజర్వుడు బోగీలలో మంచినీళ్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లను కూడా ప్రవేశపెడుతున్నారు. -
మా ఇద్దరి తీరు వేరు
‘ఖూబ్సూరత్’ హీరో ఫవద్ ఖాన్ అంటే తనకు అభిమానం ఉన్నా పనితీరులో తమ ఇద్దరి మధ్య అంత సత్సంబంధాలు లేవని ‘హమ్‌సఫర్’ డెరైక్టర్ సర్మద్ ఖూసత్ అన్నాడు. 2011లో పాకిస్థాన్‌లో సూపర్‌హిట్ అయిన టీవీ షో ‘హమ్‌సఫర్’కు సర్మద్ దర్మకత్వం వహించగా, ఫవద్ హీరోగా నటించాడు. ‘ఫవద్ మంచి నటుడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే నాకు,అతనికి పని విధానంలో చాలా తేడా ఉంది. మా ఇద్దరి మధ్య ‘కెమిస్ట్రీ’ అంతగా కుదరలేదనే చెప్పాలి. హమ్‌సఫర్ వరకు మా ఇద్దరి మధ్య సంబంధాలు బాగానేఉన్నాయి. అయితే అతడితో మళ్లీ,మళ్లీ పనిచేయాలనే ఆలోచన నాకు లేదు.. అతడు నా విష్ లిస్ట్‌లో లేడు..’ అని స్పష్టం చేశాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా అలాంటిదేమీ లేదన్నాడు. ‘నాకు ఫవద్ నటనంటే చాలా ఇష్టం.. అయితే మా మధ్య అంతగా విభేదాలు లేవు.. భవిష్యత్తులో అతడితో పనిచేయాల్సి వస్తే తప్పకుండా చేస్తా.. నేను, ఫవద్, మహిరా కలిసి మళ్లీ ఒక ప్రాజెక్టు చేస్తామనే అనుకుంటున్నా.. అయితే అతడితో తప్పనిసరిగా చేయాలి అనే భావన నాలో లేదు. నా అభిమాన నటుల్లో అతడు లేడు..’ అని చెప్పాడు. భారత ప్రేక్షకులు ఫవద్ను ఆదరించడం తనకు చాలా ఆనందంగా ఉందని సర్మద్ పేర్కొన్నాడు. ‘భారత ప్రేక్షకులు ప్రతిభను గుర్తిస్తారని మరోసారి రుజువైంది.. ఇటువంటి ఘటనల వల్ల రెండు దేశాల మధ్య అనుబంధం మరింత పెరుగుతుందని భావిస్తున్నా..’ అని పాకిస్థానీ డెరైక్టర్, నటుడు అయిన సర్మద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పాకిస్థానీ రచయిత రచించిన ‘ఫర్హత్ ఇష్థియఖ్స్’ అనే నవల ఆధారంగా ఈ సీరియల్‌ను నిర్మించారు. ఇందులో భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని రచయిత చక్కగా విశదపరిచాడని, ఇటువంటి డ్రామా ఉన్న కథాంశాలను భారత ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సర్మద్ ధీమా వ్యక్తం చేశాడు. -
అతడితోనా..లేదే!
న్యూఢిల్లీ: బాలీవుడ్లో హీరో రణవీర్‌సింగ్‌తో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని పాకిస్థానీ నటి మహిరా ఖాన్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ హిట్ సీరియల్ ‘హమ్‌సఫర్’లో ఆమె కీలకపాత్ర పోషించింది. అతి త్వరలో ఆ సీరియల్ భారత దేశ బుల్లితెర అభిమానులను రంజింపజేయనుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో పాకిస్థాన్‌కు చెందిన కరాచీ నగరం నుంచి మాట్లాడుతూ.. బాలీవుడ్లో తన అరంగేంట్రం రణవీర్ సింగ్‌తో ఉంటుందన్న వార్తలను కొట్టిపారేసింది. తనకు బాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తున్న మాట వాస్తవమే అయినా ఇప్పటివరకు ఏ హిందీ సినిమానూ తాను అంగీకరించలేదని చెప్పింది. ‘అసలు ఇలాంటి పుకార్లు ఎక్కడ పుడతాయో అర్థం కావడంలేదు.. పేపర్లలోనే కాక ఆన్‌లైన్‌లోనూ వస్తున్న ఇటువంటి పుకార్లను చూసి చాలా బాధపడుతున్నా.. నాకు బాలీవుడ్లో చాలా అవకాశాలు వచ్చినా వాటిలో నా మనసును తాకిన కథ ఒక్కటి కూడా లేదు.. అందుకే ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాకూ సంతకం పెట్టలేదు..’ అని నొక్కిచెప్పింది. కాగా, భారత్ సినిమాల్లో అరంగేంట్రం చేసేందుకు ‘హమ్‌సఫర్’లో తనతోపాటు నటించిన ఫవద్ ఖాన్ సహాయసహకారాలు తీసుకుంటానని ఆమె చెప్పింది. తనకు భారత్‌లో పనిచేయాలని ఉందని, అయితే దానికి తగిన పాత్ర లభించాల్సి ఉందని తెలిపింది.‘ఇటీవల బాలీవుడ్లో విడుదలైన ‘ఖూబ్సూరత్’ సినిమాలో నటించిన ఫవద్ ఖాన్ నటనకు బాగానే మార్కులు పడ్డాయి. అతడికి భారతదేశంలో అభిమానులు పెరిగారు.. అతడిని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది.. భారత్ సినిమా రంగంలో ఎలా మసలుకోవాలో ఫవద్ చాలా బాగా వంటబట్టించుకున్నాడు.. ఇంతకు ముందు పాకిస్థాన్‌లో ఎప్పుడూ ఇలా ఇంటర్వ్యూలకు అతడు హాజరయినట్లు నాకు గుర్తులేదు.. భారత్‌లో మాత్రం ఒకేరోజు చాలా ఇంటర్వ్యూల్లో కనిపించాడు.. ’ అని మహిరా పేర్కొంది.