Hundies
-
కరోనా సమయంలో రెచ్చిపోతున్న దొంగలు
సాక్షి, నిజామాబాద్ : కరోనా సమయంలో తమకు అనుకూలంగా మరల్చుకొని దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఆలయ హుండీలే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆలయ హుండీలు ఎత్తుకెళ్లి నగదు చోరీ చేసి పొలాల్లో హుంండీలను వదిలేసి పరారవుతున్నారు. గ్రామంలోని హనుమాన్ పోలేరమ్మ సహా ఆరు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. నవీపేట్ మండలంలో ఒకేరోజు 6 ఆలయాల్లో హుండీలను దోచుకెళ్లారు దుండగులు. ఆలయంలోని సీసీ టీవీ ఫుటేజీలో ఇదంతా రికార్డు అయ్యింది. వరుస దొంగతనాలతో స్థానికులు భయందోళనకు గురువుతున్నారు. ఇక ఆలయాల్లో వరుస చోరీలు పోలీసులకు సవాల్‌గా మారింది. రోజూ ఏదో ఒక ప్రాంతంలో దొంగతానాలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కరోనా నేపథ్యంలోనే చోరీలు జరుగుతున్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
నిశా'చోరులు': ఆలయాలే టార్గెట్
వారి వృత్తి చోరీలు.. ఆలయాలే టార్గెట్.. రాత్రి వేళల్లో జన సంచారం ఉండదు కాబట్టి ఆ సమయంలోనే దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇలా కామారెడ్డితోపాటు నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలలో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. సాక్షి, కామారెడ్డి: రాత్రి వేళల్లో నిర్మానుష్యంగా ఉన్న ఆలయాలను టార్గెట్ చేస్తూ మూడు జిల్లాల పరిధిలో 18 చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ శ్వేత శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. మాచారెడ్డి మండలం నడిమి తండాకు చెందిన భూక్యా దరి, భూక్యా గణేశ్ ఆలయాల్లో చోరీలు చేయడా న్ని వృత్తిగా ఎంచుకున్నారు. ఆలయాల్లో రాత్రి సమయంలో ఎవరూ ఉండరు కాబట్టి సులువుగా దొంగతనాలు చేయవచ్చన్నది వీరి ఉద్దేశం. ఆలయాల తాళాలు పగులగొట్టి, హుండీలు, వస్తువులు ఎత్తుకెళ్లేవారు. ఆభరణాలను అమ్ముకుని అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. వీరు నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల పరిధిలో 18 ఆలయాల్లో చోరీలు చేశారు. గురువారం రామారెడ్డి ఎస్సై రాజు పోలీసులతో కలిసి గొల్లపల్లి వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన వీరిద్దరు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు పట్టుకుని విచారించగా.. చోరీల డొంక కదిలింది. నేరాల చిట్టా.. గణేశ్, దరిలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో 4, దేవునిపల్లి పీఎస్ పరిధిలో 3, మాచారెడ్డి, దోమకొండ, రాజంపేట పీఎస్‌ల పరిధిలో ఒక్కో చోరీ కేసు నమోదై ఉంది. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి, సిరికొండ పీఎస్‌ల పరిధిలో ఒక్కొక్కటి, సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట పరిధిలో 3, ఎల్లారెడ్డిపేట పరిధిలో 2, వీర్నపల్లి ఠాణా పరిధిలో ఒకటి చొప్పున కేసులున్నాయి. ఆయా ఆలయాల్లో హుండీలోని నగదు, ఆభరణాలతోపాటు యాంప్లిఫయర్ పరికరాలను ఎత్తుకెళ్లారు. మొత్తం 18 కేసుల్లో రూ. లక్షా 63 వేల సొత్తును అపహరించారు. నిందితులను పట్టుకుని లక్షా 2 వేల విలువైన 11 యాంప్లిఫయర్లు, ఇతర వస్తువులను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాలుంటాయని తెలిసినా... ఆలయాల్లో సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసినా నిందితులు దొంగతనాలకు పాల్పడేవారని ఎస్పీ తెలిపారు. చాలా చోట్ల సీసీ కెమెరాల ఆధారంగానే నిందితులను గుర్తించామన్నారు. కొన్ని సందర్భాల్లో ఆలయాల్లోని సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసేందుకు సైతం ప్రయత్నించారన్నారు. చివరికి సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగానే నేరాల చిట్టా బయటపడిందన్నారు. కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి పోలీస్స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలను అత్యధికంగా ఏర్పాటు చేసే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులను అభినందించారు. 18 ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన రామారెడ్డి పోలీస్ కానిస్టేబుళ్లు బాబయ్య, కృష్ణలకు నగదు పురస్కారాలను అందజేశారు. కేసు ఛేదనలో కృషి చేసిన డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, రామారెడ్డి ఎస్సై కే.రాజు, కానిస్టేబుళ్లు నరేష్, భూమయ్య, రంజిత్, హోంగార్డు నర్సింలులను అభినందించారు. -
డ్రైయినేజీలో ఆలయ హుండీలు!
సాక్షి, కోనేరు(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని చిలకలపూడి ఎఫ్‌సీఐ గోదాము సమీపంలోని డ్రెయినేజీలో రెండు హుండీలు దర్శనమిచ్చాయి. రోడ్డు పక్కన ఉన్న డ్రెయిన్‌లో పలువురు యానాదులు ఇనుపముక్కల కోసం వెతుకుతుంటారు. దీనిలో భాగంగా బుధవారం యానాదులకు డ్రెయిన్‌లో పగులకొట్టి ఉన్న రెండు కానుకల హుండీలు దొరికాయి. విషయాన్ని గ్రహించిన స్థానికులు హుండీలను పక్కనపెట్టి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు హుండీలను పరిశీలించి ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దుండగులు హుండీలోని నగదును అపహరించి వాటిని డ్రెయిన్‌లో పడవేసినట్లుగా భావిస్తున్నారు. -
దేవుళ్లకే శఠగోపం!
సాక్షి, కొత్తకోట రూరల్: జల్సాలకు ఆలవాటు పడిన కొందరు ఆలయాలను కూడా వదలడం లేదు. ఇటీవల కురుమూర్తిస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ఘటన మరవకముందే కొత్తకోటలోని మూడు ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పట్టణ శివారులోని వెంకటగిరి, పట్టణంలోని సాయిబాబ, కోట్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను ఎత్తుకెళ్లి గ్రామ శివారులోని పొలాల్లో పడేశారు. ఈ క్రమంలో కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3 వేల నగదు, సాయిబాబ ఆలయంలో రూ.500, వెంకటగిరి ఆలయంలో అరకిలో వెండి (శఠగోపం)తోపాటు తీర్థం పోసే పాత్ర ఎత్తుకెళ్లారని ఎస్ఐ తెలిపారు. ఉదయమే ఆయా ఆలయాల్లో తాళాలు పగులగొట్టి ఉండగా వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందిం చారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాకేంద్రాలను నుంచి క్లూస్ టీంలు వచ్చి పొలాల్లో పడేసిన హుండీలను పరిశీలించారు. దొంగతనానికి గురైన హుండీలపై ఉన్న వేలిముద్రలను క్లూస్‌టీం సభ్యులు సేకరించారు. మూడు ఆలయాలను వనపర్తి డీఎస్పీ సృజన, సీఐ వెంకటేశ్వర్రావు పరిశీలించి ఎస్ఐతో వివరాలు తెలుసుకున్నారు. -
ఘాట్లలో హుండీల లెక్కింపు
ఆత్మకూర్: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆత్మకూర్ మండల పరిధిలోని నందిమల్ల, మూలమల్ల, జూరాల గ్రామాల్లోని ఆలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలను బుధవారం కురుమూర్తి దేవస్తానం ఈవో శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో లెక్కించారు. మూలమల్లలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో రూ.58,470లు, నందిమల్లలోని శ్రీ బ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం హుండీలో రూ.23,130లు, జూరాల గ్రామంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన హుండీలో రూ.24,097లు ఉన్నట్లు తెలిపారు. లెక్కింపులను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆలయ నిర్వాహకుల సమక్షంలో చేపట్టినట్లు తెలిపారు.