భారీ అకౌంట్ల చోరీపై యాహూ ధ్రువీకరణ
వందల మిలియన్ యూజర్ అకౌంట్ల డేటా దొంగతనానికి పాల్పడినట్టు యాహూ కంపెనీ బహిరంగంగా ధ్రువీకరించబోతుంది. ఈ విషయంపై అధికార వర్గాలు ఓ ప్రకటన విడుదలచేశాయి. వందల మిలియన్ యాహూ యూజర్ అకౌంట్లు ఈ చోరీ బారిన పడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. యూజర్ అకౌంట్ల హ్యాకింగ్ విషయం ఆగస్టులోనే బయటికి వచ్చింది. దాదాపు 200 మిలియ్ యాహూ యూజర్ అకౌంట్ ఆధారాలను పీస్ అనే హ్యకర్ అమ్మకానికి పెట్టినట్టు రిపోర్టు వచ్చాయి. సుమారు 1,07,000కు ఈ అకౌంట్లను రియల్డీల్ మార్కెట్ ప్లేస్‌లో హ్యాకర్ అమ్మకానికి పెట్టాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై విచారణ కొనసాగుతుందని, చోరీపై యూజర్లు కంగారు పడాల్సిన పనిలేదని యాహూ భరోసా ఇచ్చింది.
కానీ ప్రస్తుతం ఈ అకౌంట్ల చోరిని యాహూ సైతం ధ్రువీకరించేందుకు సిద్దమైంది. ఈ డేటాలో యూజర్ల పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారం, ఇతర ఈమెయిల్ అడ్రస్‌లు ఉన్నాయి. ఇటీవలే యాహూ కోర్ వ్యాపారాలైన ఇంటర్నెట్ ఆస్తులను వెరిజోన్ సుమారు రూ.32,500 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో ఈ హ్యాకింగ్‌ను యాహూ ధృవీకరిస్తున్నట్టు వెల్లడవడం, ఆ కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపనుందోనని మార్కెట్ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఒప్పందం ముగిసే వరకు సీఈవో మారిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు సైతం హల్ చల్ చేస్తున్నాయి.