వంద శాతం సాధిస్తాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి పరీక్షల్లో ‘వంద శాతం ఫలితాలే లక్ష్యం’.. అదే ‘మా నినాదం’ అంటోంది జిల్లా విద్యాశాఖ యంత్రాంగం. టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండడంతో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తూ.. తదుపరి చర్యల్లో బీజీ అవుతోంది. గతేడాది ప్రభుత్వ పాఠశాలలు పదోతరగతి వార్షిక పరీక్షల్లో 72 శాతం ఫలితాలు సాధించగా.. ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
స్టడీ మెటీరియల్ రూపొందించడంతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని డీఈఓ పేర్కొంటున్నారు. ఇటీవల సంక్రాంతి సెలవుల్లోనూ నిర్వహించిన ప్రత్యేక తరగతులకు మంచి స్పందన రావడంతో విద్యాశాఖ అధికారులు మరింత ఉత్సాహంతో ఉన్నారు. టెన్త్లో అత్యుత్తమ ఫలితాల కోసం తీసుకుంటున్న చర్యలు.. ప్రత్యేక ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికారి యం.సోమిరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అవి ఆయన మాటల్లోనే...
ప్రతి విద్యార్థి పాస్ కావాల్సిందే..
జిల్లాలో 436 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 24వేల మంది పదోతరగతి విద్యార్థులున్నారు. ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షల్లో ప్రతి విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించాలనేది మా లక్ష్యం. బడిలో 60శాతం హాజరు నిండిన విద్యార్థి తప్పకుండా పాసవుతాడు. ఆమేరకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేశారు. డిసెంబర్ నెలాఖరులో బోధన పూర్తి కావడంతో ఇప్పుడు రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కింది తరగతి విద్యార్థులకు ప్రాథమిక మెళకువలు నేర్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
రూ.21లక్షలతో స్టడీ మెటీరియల్
విద్యార్థులు సులభమైన పద్ధతిలో పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ప్రత్యేకంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ను రూపొందించాం. దాదాపు రూ.21 లక్షలు వెచ్చించి ఈ మెటీరియల్ను త యారు చేయించాం. మరో రెండుమూడు రోజుల్లో విద్యార్థులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తాం. ఒక్కో విద్యార్థిపై రూ.92 చొప్పున వెచ్చిస్తున్నాం.
హెచ్ఎంలతో ప్రత్యేక సమీక్ష
ఈ వారంలో ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్లతో కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పాఠశాలపై చర్చిస్తాం. పురోగతిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా పునఃశ్చరణ తరగతులు నిర్వహించేందుకు కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాం. 6,7,8,9 తరగతుల విద్యార్థుల బోధన తీరుపైనా సమీక్ష చేస్తాం.
క్షేత్రస్థాయి తనిఖీలు విస్తృతం చేస్తాం
హెచ్ఎంల మీటింగ్ తర్వాత నేను కూడా విస్తృత తనిఖీలు చేస్తా. అవేవిధంగా జి ల్లాలోని నలుగురు ఉపవిద్యాధికారులకు ప్రత్యేకంగా వాహనాలు ఇచ్చాం. ప్రతిరో జు క్షేత్ర పర్యటనలు తప్పకుండా చేయా ల్సి ఉంటుంది. వచ్చేవారం నుంచి వారి పరిధిలోని అన్ని పాఠశాలలను క్ర మం తప్పకుండా తనిఖీ చేసి నివేదిక ఇ స్తారు. ఉపాధ్యాయుల బోధన, పిల్లల పరిస్థితి మెరుగుపడుతుంది. ఇందుకుగాను ఉప విద్యాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా మండల విద్యాధికారులు కూడా ఉన్నత పాఠశాలల తనిఖీల్లో భాగస్వాములయ్యేలా చూస్తాం.