ఆగని ఆకలి కేకలు
బ్యాంకాక్: ఓ వైపు ఆసియా–పసిఫిక్ దేశాలు(తూర్పు, దక్షిణ, ఈశాన్య ఆసియాతోపాటు ఆస్ట్రేలియా, రష్యాలో కొంత భాగం, పసిఫిక్ తీరంలోని మరికొన్ని దేశాలు) అభివృద్ధిలో దూసుకుపోతున్నా... మరోవైపు వాటిలో ఆకలి కేకలూ అదే స్థాయిలో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడైంది. సుమారు 48కోట్ల 60 లక్షల మంది ఇంకా ఆకలి సమస్యతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. బ్యాంకాక్, మలేసియా, కౌలాలంపూర్ లాంటి మేటి నగరాల్లోనూ ఇప్పటికీ చాలా కుటుంబాలు తినడానికి తిండి లేక అలమటిస్తున్నాయని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌తో పాటు ఐక్యరాజ్య సమితికి చెందిన మరో మూడు ఏజెన్సీలు తెలిపాయి.
ఒక్క బ్యాంకాక్‌లోనే మూడో వంతు చిన్నారులు తగిన ఆహారాన్ని పొందలేకపోతున్నారని వెల్లడించాయి. ఇక మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కేవలం 4శాతం చిన్నారులు మాత్రమే సరిపడ ఆహారాన్ని తీసుకుంటున్నారని సర్వేలో తేలింది. ‘ఈ ప్రాంతాల్లో 2030 నాటికి ఆకలితో బాధపడేవారి సంఖ్యను సున్నాకు తీసుకురావాలంటే... రోజుకు కనీసం లక్షా పదివేల మందిని ఆకలి సమస్యకు దూరం చేయాల్సి ఉంటుంద’ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రీజినల్ డైరెక్టర్ జనరల్ కుందవి కడియన్సన్ తెలిపారు. తూర్పు, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని, గత కొన్నేళ్లలో ఈ ప్రాంతాల్లో ఎలాంటి మెరుగుదలా కనిపించలేదని ఆమె వివరించారు.
ఇక భారత్‌తోపాటు దక్షిణాసియాలోని ఇండోనేసియా, మలేసియా, కంబోడియాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని తెలిపారు. ఈశాన్య ఆసియా దేశాల్లో ప్రత్యేకించి కంబోడియాలో మంచినీటి కొరత సైతం తీవ్రంగా ఉందని ఆమె వెల్లడించారు. అంతేకాదు ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం సుమారు 79 మిలియన్ చిన్నారులు పౌష్టికాహార లోపం కారణంగా పూర్తి స్థాయి ఎత్తు కూడా ఎదగలేకపోతున్నారని తేలింది. ఇక పట్టణ ప్రాంతాల్లోని వారు అనారోగ్యమైన, తక్కువ ధరకు లభించే ప్రాసెస్డ్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒబేసిటీ బారిన కూడా పడుతున్నట్లు వెల్లడైంది.