husband harasments
-
రెండో పెళ్లి.. అడిగిన డబ్బులు తేకుంటే మొదటి భార్యను తీసుకొస్తానని..
సాక్షి, మలక్‌పేట: భర్త వేధింపులు తాళలేక వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన గంగనపల్లి కాశీవిశ్వనాథం కుమార్తె స్వప్న(38)ఎంబీబీఎస్ చదివింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పీహెచ్సీలో వైద్యురాలిగా పని చేస్తున్న సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో ఆమెకు పెళ్లైంది. అనివార్య కారణాల వల్ల భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం 2015 ఏప్రిల్‌లో కర్నూలుకు చెందిన ముత్యాల మద్దయ్య కుమారుడు శ్రీధర్‌తో రెండో వివాహం జరిగింది. రూ.10 లక్షలు నగదు, 14 తులాల బంగారం కట్నం కింద ముట్టజెప్పారు. శ్రీధర్ కూడా డాక్టర్. అతడికి మేనమామ కుమార్తెతో పెళ్లికాగా, విడాకులు తీసుకున్నారు. అప్పటికే వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వప్నకు కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు రావడంతో హైదరాబాద్‌కు వచ్చింది. «శ్రీధర్ నల్లగొండ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. భార్యాభర్తలు అస్మాన్‌ఘడ్ తిరుమల హిల్స్‌లో ఉంటున్నారు. ఏడాది పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగింది. అదనపు కట్నం తేవాలని, లేదంటే మొదటి భార్యను తీసుకొస్తానని భర్త వేధిస్తుండంతో స్వప్న మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య కూడా యత్నించింది. చదవండి: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో.. 2020 సంవత్సరంలో స్వప్న తల్లి విజయ మృతి చెందగా అప్పటి నుంచి ఆమెకు చెందిన ఇంట్లో వాటా, ఆమె పేరిట ఉన్న నగదు తీసుకురావాలని స్వప్నను శ్రీధర్ ఒత్తిడి చేస్తున్నాడని తండ్రి విశ్వనాథం ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఈనెల 8న స్వప్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తండ్రికి శ్రీధర్ ఫోన్ చేసి చెప్పాడు. మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబసభ్యులు స్వప్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిరాలి తండ్రి సైదాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసుపై ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, స్వప్న ఆత్మహత్య చేసుకుందన్నారు. శ్రీధర్‌పై కట్నం వేధింపుల కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
భీమారం: భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని వివాహిత ఆందోళనకు దిగింది. ఈమేరకు భర్త ఇంటికి ముందు ధర్నా చేపట్టింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ కిరోసిన్ పోసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... నగరంలోని ఒకటో డివిజన్‌కు చెందిన నరేడ్ల వేణుకు అదే ప్రాంతానికి చెందిన చొప్పరి సరస్వతి, రవీందర్ దంపతుల కూతురు హేమలతతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.13లక్షలు నగదు, 10తులాల బంగారంతో పాటు ఇతర ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. ప్రస్తుతం వేణు (సీఐఎ‹స్ఎఫ్, చెన్నై) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వివాహ అనంతరం భార్యను చెన్నైకి తీసుకెళ్లాడు. కొంతకాలం వారి కాపురం సవ్యంగానే సాగినా తర్వాత కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయి. అదనపు కట్నం (రూ.10లక్షలు) తీసుకురమ్మని వేణు వేధింపులకు గురి చేస్తున్నాడని హేమలత ఆరోపించింది. ఇదిలా ఉండగా వేణు వేధింపులు భరించలేక హేమలత తన భర్త విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ప్రవర్తన మార్చుకోవాలని వేణును హెచ్చరించారు. దీంతో వేణు భార్యతో కొంతకాలం బాగానే ఉన్నాడు. తదనంతరం భార్య హేమలతను పైడిపల్లికి తీసుకొచ్చాడు. నాలుగేళ్ల నుంచి హేమలత తల్లిగారింటి వద్దే ఉంటుంది. తనను భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని హేమలత హసన్çపర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్యభర్తల కేసు కావడంతో వారు మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అయితే తనకు అక్కడ కూడా న్యాయం జరగలేదని, చివరికి న్యాయం కోసం ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. ఆత్మహత్యాయత్నం... తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన హేమలత అసహనానికి గురై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడి ఉన్న పోలీసులు ఆమెను నివారించి, హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
బలవంతంగా తాళి కట్టి ఆరు నెలల పాటు..
బంజారాహిల్స్: తన మెడలో బలవంతంగా తాళి కట్టి ఆరు నెలల పాటు బెదిరించి కాపురం చేశాడని ఇటీవల కాలంలో తనపై అనుమానం పెంచుకుంటూ పీకలదాకా మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. అంబర్‌పేట్‌కు చెందిన అనిల్(24) అనే యువకుడు గత అయిదు సంవత్సరాల నుంచి శ్రీకృష్ణానగర్‌లో నివసించే యువతి(19)ని ప్రేమిస్తున్నాడు. ఆరు నెలల క్రితం గుడికి వెళ్ళాలని అనిల్ ఆ యువతిని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి తీసుకెళ్ళాడు. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం ఓ చెట్టు కింద ఆమె మెడలో తాళికట్టాడు. మరొకరితో పెళ్ళి కాకుండా చేశాడని తనతో రాకపోతే బతుకు ఆగమవుతుందంటూ ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆ యువకుడితో పాటు బాధిత యువతి అంబర్‌పేటకు వెళ్ళి కాపురం పెట్టింది. ఆరు నెలలు గడవకముందే అనిల్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ మానసికంగా వేధించసాగాడు. ఇటీవల మద్యం తాగి వచ్చి కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఆమె పదిరోజుల క్రితం తన తల్లి వద్దకు వచ్చింది. అయినాసరే రోజూ ఇంటికి వచ్చి బెదిరించసాగాడు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
కట్టుకున్నవాడే కాల యముడయ్యాడు
ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్): జీవితంలో సగభాగం పంచి భార్యను సుఖపెట్టాల్సిన భర్త ఆమె పాలిట కాలయముడై కడతేర్చిన బాధాకర ఘటన మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపల్లెకి చెందిన కుంట విజయ(45)కు ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన గంగబాపుతో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ప్రశాంత్, శ్రీకాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పని చేయకుండా మద్యానికి బానిసై గ్రామంలో అందరితో గొడవలు పెట్టుకొని అప్పుల పాలై కుటుంబ ప్రతిష్టను దిగజార్చిన గంగబాపును విడిచి కుంట విజయ తన తల్లిగారి గ్రామమైన ఎల్లారెడ్డిపల్లెలో తన కుమారులను పోషిస్తూ జీవిస్తుంది. ఈ క్రమంలో తన కుమారులను గల్ఫ్ దేశాలకు పంపి గ్రామంలో ఇల్లు కూడా కొనుగోలు చేసింది. భార్య దూరమైన క్రమంలో గంగబాపు కూడా బయటి దేశాలకు వెళ్లి మూడు నెలల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చాడు. కొడుకులు లేని అదును చూసి భార్యకు మాయ మాటలు చెప్పి తనకు దగ్గరై కొంత కాలం మంచి వాడిగా నటించి పాడి పశువులు పెంచుతూ, సమీపంలో ఉన్న విశ్వ ఆగ్రోటెక్ గొర్రెల ఫామ్‌లో కూలి పనులు చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మద్యానికి మరల బానిసై భార్యను వేదిస్తూ తరుచూ గొడవలు పడేవాడని గ్రామస్తులు తెలి పారు. అదే క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగి భార్యతో గొడవ పడి మద్యం మత్తులో సహనం కోల్పోయి రోకలి దుడ్డుతో భార్య తలపై బాది హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. పొద్దున ఇంటి ముందు పశువులను ఎంతకీ విడిచిపెట్టక పోవడంతో అనుమానం వచ్చిన మృతురాలి అక్క కొడుకు ఇంటి తాళం పగులగొట్టి చూడగా కుంట విజయ రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న సీఐ రామాంజనేయులు, ఎస్ఐ రాజశేఖర్ ఘటనపై గ్రామస్తుల నుంచి వివరాలు సే కరించి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుంట విజయ హత్య వార్త తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని విజయ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. -
బ్రిడ్జి రెయిలింగ్‌కు ఉరివేసుకొని
సనత్‌నగర్: తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఫతేనగర్ బ్రిడ్జి రెయిలింగ్‌కు ఉరివేసుకుంది. ఈ సంఘటన సనత్‌నగర్ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన మేరకు.. కాకినాడకు చెందిన భీమేశ్వరరావు, మంగతాయారులు సనత్‌నగర్ ఎస్ఆర్టీ కాలనీలో ఉంటూ నివాసముంటున్నారు. భీమేశ్వరరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొన్నేళ్లుగా భీమేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. భార్యను మానసికంగా, శారీరికంగా వేధించేవాడు. తాగుడు మాన్పించే టాబ్లెట్స్ ఉన్నాయని పలువురి చెప్పగా విని వాటిని కూడా తెప్పించింది. భర్తతో వాటిని వేయించే విషయమై కూడా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మంగతాయారు రెండు మార్లు ఇంటి నుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు భర్తతో తాగుడు మాన్పించేందుకు తెచ్చిన టాబ్లెట్లను పెద్ద మొత్తంలో మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారకస్థితికి వెళ్ళి ప్రాణాలతో బయటపడింది. ఇంతజరిగినా భీమేశ్వరరావులో మార్పురాలేదు. మంగళవారం రాత్రి ఇంట్లో బంధువులు ఉండగానే ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన మంగతాయారు రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అర్ధరాత్రి సమయంలో ఫతేనగర్ నుంచి సనత్‌నగర్ వైపు ఫ్లైఓవర్ దిగే ప్రాంతంలోని రెయిలింగ్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున స్థానికులు ఫ్లైఓవర్ రెయిలింగ్‌కు యువతి మృతదేహం వేలాడుతున్న విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించి ఆమె గురించి వాకబు చేయగా మంగతాయారుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త కూడా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అతనిని విచారించారు. -
అత్తింటి వేధింపులు తాళలేక గర్భిణి ఆత్మహత్య
కాగజ్‌నగర్(సిర్పూర్): అత్తింటి వేధింపులు తాళలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాగజ్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. గర్భంలో ఉన్న పాప లోకం చూడకముందే పరలో కాలకు వెళ్లగా..ఏడాదిన్నర చిన్నారి ఈశ్వరిప్రియ గోరుముద్దలు తినిపించి లోకాన్ని పరిచయం చేసే తల్లిని కోల్పోయింది. కాగజ్‌నగర్ పట్టణంలోని గుంటూర్‌కాలనీకు చెందిన పునమల్లి తేజశ్రీ (25) బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ సీఐ వెంకటేశ్వర్, కుటుంబీకులు తెలి పిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరుకు చెందిన తేజశ్రీతో ఆగస్టు 2016లో కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన తిలక్‌కుమార్‌తో వివాహమైంది. దంపతులకు ఏడాదిన్నర కుతూరు ఈశ్వరిప్రియ ఉంది. అంతే కాకుండా ఆమె ఇప్పుడు నాలుగు నెలల గర్భవతి. భర్త తిలక్‌కుమార్ స్థానికంగా మెకానిక్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే తేజశ్రీకు తల్లిదండ్రులు ఎవరు లేకపోవడంతో మేనమామలు, చిన్నాన్నాలు ఆమె వివాహం జరిపించారు. కొంతకాలం కాపురం సాఫీగానే సాగినా అత్త రామక్రిష్ణమ్మ, భర్త తిలక్‌కుమార్, మామ బాలచందర్ వేధింపులు మొదలయ్యాయి. దిక్కు మొక్కులేని దానివని, చిన్నచిన్న విషయాలకు తగాదాలు పడుతూ వేధించేవారు. బుధవారం రాత్రి కూడా ఇలాగే వేధించడంతో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య పరిశీలించారు. మేనత్త నందేటి సుధా ఫిర్యాదు మేరకు భర్త తిలక్‌కుమార్, మామ బాలచందర్, అత్త రామక్రిష్ణమ్మపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ తెలిపారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. తేజశ్రీ ఆత్మహత్యతో కాలనీలో విషాధచాయలు అలుముకున్నాయి. తేజశ్రీ ఇక లేదని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
వివాహమైన నెలరోజులకే...
ఆలేరు, నల్గొండ : పెళ్లయి నెల రోజులైంది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నం డబ్బు తేవాలని భర్తతోపాటు అత్తామామ వేధించసాగారు. సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన ఆ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. కొల్లూరుకు చెందిన బుసిగంపల నర్సయ్య, శోభ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతను వృత్తిరీత్యా గీతకార్మికుడు. ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. చిన్న కూతురైన మానస(22)ను రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం, గుల్కాపూర్‌కు చెందిన నోముల జ్ఞానేశ్వర్, జ్యోతిల కుమారుడు నోముల విక్రం అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. డిసెంబర్ 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద లక్ష రూపాయలు ఇచ్చారు. మరికొంత తర్వాత ఇస్తామని ఒప్పుకున్నారు. పెళ్లి అయిన ఐదు రోజులకే విక్రం తన భార్య మానసను దుర్భాషలాడి చేయి చేసుకున్నాడు. మిగతా కట్నం కోసం మానసను అత్తామామలు వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టిల్లు కొల్లూరుకు చేరుకుంది. నెల రోజులుగా తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. మానసను తీసుకెళ్లేందుకు అత్తామామ, భర్త విక్రం మంగళవారం కొల్లూరుకు చేరుకున్నారు. మానసను సూటిపోటీ మాటలు అనడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మానస ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు మానసను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ మేరకు మానస తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అత్తామామలు, భర్త, ఆడపడుచులు వేధించడం వల్లే తన కుమార్తె ఉరేసుకొని చనిపోయిందని మానస తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ తెలిపారు. -
అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య
జూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని కుమ్మరికుంటకు అనుబంధ గ్రామమైన గొల్లపల్లికి చెందిన తమ్మడవేని లక్ష్మి(32) భర్త,అత్త,మామ, బావల వేధింపులతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పాలకుర్తి మండలం పూట్నురుకు చెందిన లక్ష్మికి 16ఏళ్ల క్రితం గొల్లపల్లికి చెందిన రాజుతో వివాహమైంది. వీరికి 12ఏళ్ల కొడుకు, 11 ఏళ్ల కూతురు ఉంది. లక్ష్మి మాజీ ఉపసర్పంచ్. ఇంటిపని విషయమై లక్ష్మిని ఆమె కుటుంబసభ్యులు తరుచూ వేధించేవారు. అనేకసార్లు గొడవలతో పంచాయితీలు జరిగాయి. ఇదే విషయమై ఈ నెల 7న లక్ష్మిని భర్త రాజు కొట్టాడు. ఇంట్లో నుంచి పోయిన లక్ష్మి ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారంఉదయం గాలించగా మృతదేహం లభ్యమైంది. భర్త రాజు, బావ కొంరయ్య, అత్త గట్టమ్మ, మామ పోచాలుల వేధింపులతోనే లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని మేనమామ కాల్వ మల్లయ్య చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
నిర్మల్‌టౌన్: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ జాన్‌దివాకర్ తెలిపిన వివరాల ప్రకారం..జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్‌కు చెందిన కుంట మోహన్‌రెడ్డి– భారతి దంపతుల కుమారై సోనికారెడ్డి(31)కి మూడేళ్ల క్రితం భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్‌కిరణ్‌రెడ్డితో వివాహం జరిగింది. పెళ్లయ్యాక దంపతులు కొంత కాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత భర్త ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో కుంగిపోయిన సోనిక ఇటీవలే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. కాగా బుధవారం శాస్త్రినగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో తెలిసిన బంధువులను కలిసివస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన సోనిక ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్మెంట్ ఐదో అంతస్తు పైకి ఎక్కి చెప్పులు, చేతిసంచి, చున్నీని అక్కడే వదిలేసి దూకి బలవన్మరణానికి పాల్పడింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాగా భవనంపైన కూల్‌డ్రింక్ సీసా ఉండడంతో ఏదైనా రసాయనం కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ప్రాంతియ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
ఖా'కీచకుడు '
కర్ణాటక, కృష్ణరాజపురం : భర్త వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయిస్తే సీఐ కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దిక్కు తోచని బాధితురాలు రాష్ట్ర మహిళ కమిషన్‌ను ఆశ్రయించింది. వివరాలు..హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా బ్యాడగి గ్రామానికి చెందిన సేకవ్వను కొద్ది కాలంగా భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక కొద్ది రోజుల క్రితం సేకవ్వ బ్యాడగి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. సీఐ చిదానంద బాధితురాలి పరిస్థితిని ఆసరాగా తీసుకొని లైంగికంగా వేధించసాగాడు. గురువారం కూడా సేకవ్వను స్టేషన్‌కు పిలిపించుకొని వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. సీఐ ప్రవర్తనతో విసిగిపోయిన సేకవ్వ విషయాన్ని బంధువులకు తెలియజేయగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ చిదానంద తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నట్లు తెలుకొని అక్కడికి వెళ్లారు. సీఐతో ఘర్షణ పడడంతో యూనిఫాం కొద్దిగా చిరిగింది. అనంతరం భర్తతో పాటు సీఐ చిదానందపై కూడా బ్యాడగి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు.. శుక్రవారం బెంగళూరులోని మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకొని ఇరువురిపై ఫిర్యాదు చేశారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
చిత్తూరు, తిరుపతి క్రైం: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం తిరుపతి నగరం కొర్లగుంటలో జరిగింది. ఈస్ట్ సీఐ చంద్రబాబునాయుడు కథనం మేరకు.. కొర్లగుంటలో నివాసముంటున్న ప్రకాష్, కమల దంపతుల కుమార్తె లావణ్య(20)ను చిత్తూరు సమీపంలోని బొడేవారిపల్లెకు చెందిన నిర్మల, ఆంజనేయులు దంపతుల కుమారుడు ఈశ్వర్(25) మైనర్లుగా ఉన్నప్పుడే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు దూరంగా కొర్లగుంటలోని ప్రశాంత్ స్కూల్ సమీపంలో కాపురం పెట్టారు. వీరికి భవ్య(3) కుమార్తె ఉంది. ఈశ్వర్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతను కొంతమంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్టు భార్య గుర్తించింది. దీనిపై భర్తను నిలదీసేది. దీంతో ఈశ్వర్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. శనివారం రాత్రి కూడా భార్య, భర్త గొడవపడ్డారు. అనంతరం ఏమి జరిగిందేమోగానీ ఉదయం లేచి చూసే సరికి లావణ్య ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఉండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ, ఎస్ఐ అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకురాలు శ్రీదేవి, ఐద్వా లక్ష్మీ సంఘటన స్థలానికి చేరుకుని లావణ్యను భర్త ఈశ్వర్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వేధింపులకే ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
మూడు నెలల క్రితమే ప్రేమపెళ్లి..
జైనథ్(ఆదిలాబాద్): కట్నం వేధింపులు తాళలేక జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన ఆవుల అంకిత(25) పెన్‌గంగలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దీపాయిగూడలోని లోక రవీందర్ రెడ్డి, అనురాధల కుమార్తె అంకిత, అదే గ్రామానికి చెందిన సాయి నాలుగు నెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. ఆదిలాబాద్‌లో కాపురం పెట్టారు. కాగా సాయి తనకు రూ.3లక్షల కట్నం ఇవ్వాలని తరుచూ భార్య అంకితను వేధించేవాడు. అంకిత కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి, కట్నం ఇస్తేనే కూతురితో కాపురం చేస్తానని, లేదంటే తీసుకెళ్లాలని బెదిరించాడు. ఈ క్రమంలో గురువారం ఇద్దరు కలిసి ఆదిలాబాద్ నుంచి భోరజ్ గ్రామానికి వచ్చారు. అక్కడి నుంచి సాయి దీపాయిగూడకు వెళ్లగా, అంకిత మహారాష్ట్రలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి పిప్పల్‌కోటికి బయలు దేరింది. మార్గమధ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు బ్రిడ్జిపై నుంచి పెన్‌గంగ నదిలో దూకింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకుండాపోయింది. శనివారం ఉదయం మండలంలోని ఆనంద్‌పూర్ సమీపంలో బ్రిడ్జికి కూతవేటు దూరంలో మృతదేహం కనిపించగా జాలర్లు ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎస్సై తోట తిరుపతి శవాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ఆపధర్మ మంత్రి జోగు రామన్న, డీఎస్పీ నర్సింహా రెడ్డి, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్ మార్చురీ వద్ద మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబీకులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. దీపాయిగూడలో అంత్యక్రియలు నిర్వహించగా మంత్రి జోగు రామన్న పాల్గొని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిండు జీవితాలు బలి వాస్తవంగా అంకిత, సాయి ఇద్దరిదీ రెండో వివాహమే. నాలుగు సంవత్సరాల క్రితం అంకితను జైనథ్ మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు. ఆవుల సాయికి అదే గ్రామానికి చెందిన యువతిని ఇచ్చి పెళ్లి చేశారు. వీరి ఇద్దరు కూడా పెళ్లి జీవితాల్లో ఇమడలేకపోయారు. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఇద్దరికి వేర్వేరుగా పెళ్లిళ్లు అయినా వీరి మధ్య సంబంధం కొనసాగడంతో పాత జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చేశారు. అనంతరం పెద్దలను ఎదిరించి ఇద్దరు ప్రేమవివాహం చేసుకున్నారు. కాగా వీరి పెళ్లి జీవితం ఎంతో కాలం నిలవలేదు. కట్నం కోసం సాయి, అంకితను వేధించడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. మొదటి పెళ్లి కాదని, పెద్దలను ఎదిరించి రెండో వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాలకు దూరమయ్యారు. భర్త వేధింపులు అధికమవడంతో అంకిత తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా మృతురాలి తండ్రి రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సాయిపై 498(ఏ), 304(బి) సెక్షన్ల కింద వరకట్నం వేధింపులు, గృహహింస కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
విదేశీ మహిళపై భర్త వేధింపులు
పుట్టపర్తి టౌన్ : అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడంటూ విదేశీ మహిళ ఫిర్యాదు చేయడంతో పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. జపాన్ దేశానికి చెందిన సత్యసాయి భక్తురాలు 37 ఏళ్ల నిమిషాహీ మదా తరచూ పుట్టపర్తికి వస్తుండేది. ఈక్రమంలో పుట్టపర్తిలో గణేష్ గేట్‌కు సమీపంలో పాదరక్షల దుకాణం నిర్వహిస్తోన్న జాకీర్‌హుస్సేన్‌తో ఐదేళ్లుగా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరిరువురూ రెండేళ్ల క్రితం కదిరిలో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఆరు నెలలుగా వారి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఇటీవల ఆమె కలెక్టరేట్‌కు వెళ్లి భర్త నిత్యం వేధిస్తున్నాడని, సుమారు రూ.60 లక్షల పైబడి డబ్బు తీసుకున్నాడని, ఇంకా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమెకు న్యాయపరమైన సహాయం అందించాలని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగంను ఆదేశించారు. ఐసీడీఎస్ అధికారులు జిల్లా ఎస్పీ దష్టికి తీసుకుని పోయి ఆయన ఆదేశాల మేరకు స్థానిక పుట్టపర్తి పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి వారిని సోమవారం రాత్రి విచారణ చేశారు. అనంతరం నిందితుడు జాకీర్‌హుస్సేన్‌పై వేధింపుల కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.