పునమల్లి తేజశ్రీ, (ఫైల్)
కాగజ్‌నగర్(సిర్పూర్): అత్తింటి వేధింపులు తాళలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాగజ్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. గర్భంలో ఉన్న పాప లోకం చూడకముందే పరలో కాలకు వెళ్లగా..ఏడాదిన్నర చిన్నారి ఈశ్వరిప్రియ గోరుముద్దలు తినిపించి లోకాన్ని పరిచయం చేసే తల్లిని కోల్పోయింది. కాగజ్‌నగర్ పట్టణంలోని గుంటూర్‌కాలనీకు చెందిన పునమల్లి తేజశ్రీ (25) బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ సీఐ వెంకటేశ్వర్, కుటుంబీకులు తెలి పిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరుకు చెందిన తేజశ్రీతో ఆగస్టు 2016లో కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన తిలక్‌కుమార్‌తో వివాహమైంది. దంపతులకు ఏడాదిన్నర కుతూరు ఈశ్వరిప్రియ ఉంది.
అంతే కాకుండా ఆమె ఇప్పుడు నాలుగు నెలల గర్భవతి. భర్త తిలక్‌కుమార్ స్థానికంగా మెకానిక్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే తేజశ్రీకు తల్లిదండ్రులు ఎవరు లేకపోవడంతో మేనమామలు, చిన్నాన్నాలు ఆమె వివాహం జరిపించారు. కొంతకాలం కాపురం సాఫీగానే సాగినా అత్త రామక్రిష్ణమ్మ, భర్త తిలక్‌కుమార్, మామ బాలచందర్ వేధింపులు మొదలయ్యాయి. దిక్కు మొక్కులేని దానివని, చిన్నచిన్న విషయాలకు తగాదాలు పడుతూ వేధించేవారు.
బుధవారం రాత్రి కూడా ఇలాగే వేధించడంతో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య పరిశీలించారు. మేనత్త నందేటి సుధా ఫిర్యాదు మేరకు భర్త తిలక్‌కుమార్, మామ బాలచందర్, అత్త రామక్రిష్ణమ్మపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ తెలిపారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. తేజశ్రీ ఆత్మహత్యతో కాలనీలో విషాధచాయలు అలుముకున్నాయి. తేజశ్రీ ఇక లేదని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment