మానస (ఫైల్)
ఆలేరు, నల్గొండ : పెళ్లయి నెల రోజులైంది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నం డబ్బు తేవాలని భర్తతోపాటు అత్తామామ వేధించసాగారు. సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన ఆ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. కొల్లూరుకు చెందిన బుసిగంపల నర్సయ్య, శోభ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతను వృత్తిరీత్యా గీతకార్మికుడు. ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. చిన్న కూతురైన మానస(22)ను రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం, గుల్కాపూర్‌కు చెందిన నోముల జ్ఞానేశ్వర్, జ్యోతిల కుమారుడు నోముల విక్రం అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు.
డిసెంబర్ 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద లక్ష రూపాయలు ఇచ్చారు. మరికొంత తర్వాత ఇస్తామని ఒప్పుకున్నారు. పెళ్లి అయిన ఐదు రోజులకే విక్రం తన భార్య మానసను దుర్భాషలాడి చేయి చేసుకున్నాడు. మిగతా కట్నం కోసం మానసను అత్తామామలు వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టిల్లు కొల్లూరుకు చేరుకుంది. నెల రోజులుగా తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. మానసను తీసుకెళ్లేందుకు అత్తామామ, భర్త విక్రం మంగళవారం కొల్లూరుకు చేరుకున్నారు.
మానసను సూటిపోటీ మాటలు అనడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మానస ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు మానసను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ మేరకు మానస తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అత్తామామలు, భర్త, ఆడపడుచులు వేధించడం వల్లే తన కుమార్తె ఉరేసుకొని చనిపోయిందని మానస తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment