
భర్త ఇంటిముందుఆందోళన హేమలత–వేణు (పెళ్లి ఫోటో)
భీమారం: భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని వివాహిత ఆందోళనకు దిగింది. ఈమేరకు భర్త ఇంటికి ముందు ధర్నా చేపట్టింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ కిరోసిన్ పోసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... నగరంలోని ఒకటో డివిజన్‌కు చెందిన నరేడ్ల వేణుకు అదే ప్రాంతానికి చెందిన చొప్పరి సరస్వతి, రవీందర్ దంపతుల కూతురు హేమలతతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.13లక్షలు నగదు, 10తులాల బంగారంతో పాటు ఇతర ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. ప్రస్తుతం వేణు (సీఐఎ‹స్‌ఎఫ్, చెన్నై) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వివాహ అనంతరం భార్యను చెన్నైకి తీసుకెళ్లాడు. కొంతకాలం వారి కాపురం సవ్యంగానే సాగినా తర్వాత కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయి. అదనపు కట్నం (రూ.10లక్షలు) తీసుకురమ్మని వేణు వేధింపులకు గురి చేస్తున్నాడని హేమలత ఆరోపించింది.
ఇదిలా ఉండగా వేణు వేధింపులు భరించలేక హేమలత తన భర్త విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ప్రవర్తన మార్చుకోవాలని వేణును హెచ్చరించారు. దీంతో వేణు భార్యతో కొంతకాలం బాగానే ఉన్నాడు. తదనంతరం భార్య హేమలతను పైడిపల్లికి తీసుకొచ్చాడు. నాలుగేళ్ల నుంచి హేమలత తల్లిగారింటి వద్దే ఉంటుంది. తనను భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని హేమలత హసన్çపర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్యభర్తల కేసు కావడంతో వారు మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అయితే తనకు అక్కడ కూడా న్యాయం జరగలేదని, చివరికి న్యాయం కోసం ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు.
ఆత్మహత్యాయత్నం...
తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన హేమలత అసహనానికి గురై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడి ఉన్న పోలీసులు ఆమెను నివారించి, హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.