IB warn
-
తమిళనాడులో ‘లష్కరే’ జాడ
సాక్షి, చెన్నై: తమిళనాడులోకి సముద్రమార్గం గుండా లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావటంతో పోలీసులు శుక్రవారం గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఒక పాకిస్తానీతో పాటు శ్రీలంకకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు కోయంబత్తూరులో తిష్ట వేసినట్టు తెలియడంతో వారి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో చెన్నై, మధురై, కోయంబత్తూరు ఉన్నట్టుగా కేంద్ర నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశాయి. ఇటీవల ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో సాగిన వరుసబాంబు పేలుళ్ల అనంతరం ఎన్ఐఏ తమిళనాడుపై దృష్టి పెట్టింది. ఐసిస్ మద్దతుదారులకు విదేశాల్లో శిక్షణనిచ్చి ఇక్కడ చొప్పించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్ఐఏ వర్గాలు అరెస్టు చేసి విచారణ కూడా జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డీజీపీ త్రిపాఠి, అదనపు డీజీపీ జయంతి మురళి పర్యవేక్షణలో ఐజీలు, డీఐజీలు, ఎస్పీల స్థాయి నుంచి కింది స్థాయి పోలీసు వరకు రంగంలోకి దిగారు. నుదుట తిలకం పెట్టుకుని... కోయంబత్తూరులో చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు నుదుట తిలకం పెట్టుకుని ఉన్నారని, బాంబు పేలుళ్లే లక్ష్యంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతల్ని సైతం గురిపెట్టారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సాయుధ బలగాలనూ రంగంలోకి దింపారు. చెన్నైలో ఐదువేల మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు సాగుతున్నాయి. శ్రీలంకకు అతి సమీపంలో ఉన్న రామేశ్వరం, పాంబన్, వేదారణ్యం, ముత్తుపేట, నాగపట్నం తీర ప్రాంతాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. -
కర్ణాటకలో హైఅలర్ట్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ప్రధాన పట్టణాల్లో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. బెంగళూరుతో పాటు కలబురిగి, రాయచూర్, చిత్రదుర్గ, మంగళూరు, ఉడిపి, మైసూరు, తుమకూరు సహా ముఖ్యమైన పట్టణాల్లో భారీగా పోలీసులను మోహరించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్‌మాల్స్, మార్కెట్లు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఉగ్రవాదులు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా జనసమ్మర్ధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులుచేసే అవకాశముందని చెప్పాయి’ అని అన్నారు. కల్బుర్గీ హత్య కేసులో చార్జిషీట్ హేతువాదులు కల్బుర్గీ, గౌరీ లంకేశ్‌ల హత్య కేసులో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ శనివారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. షూటర్ గణేశ్ మిస్కిన్, అమోల్ కాలే, ప్రవీణ్‌ప్రకాశ్, వసుదేవ్ భగవాన్, శరద్ కలస్కర్, అమిత్ రామచంద్ర వీరి హత్యలకు కుట్రపన్నారని సిట్ తెలిపింది. హిందూ అతివాద గ్రూపు ‘సనాతన సంస్థ’ ప్రచురించిన ‘క్షేత్ర ధర్మ సాధన’ అనే పుస్తకంతో వీరంతా స్ఫూర్తి పొందారంది. 2014, జూన్ 9న మూఢనమ్మకాలపై కల్బుర్గీ ఇచ్చిన ప్రసంగంతో ఆయన్ను చంపాలని ఈ బృందం నిర్ణయించుకుందని పేర్కొంది. అనుకున్నట్లుగానే ఓ తుపాకీని సేకరించి తర్ఫీదు పొందారనీ, దాడికోసం బైక్‌ను దొంగిలించారని సిట్ చెప్పింది. కల్బుర్గిని ఇంట్లోనే మిస్కిన్ కాల్చిచంపాడని తెలిపింది. -
‘పుల్వామా కంటే పెద్ద ఉగ్రదాడి జరగొచ్చు’
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని మరువక ముందే అందుకు బాధ్యత వహించిన... జైషే మహ్మద్ సంస్థ మరిన్ని ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తమకు సమాచారం అందిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రెండు రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా బలగాల వాహనాలపై దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి. చౌకీబాల్ నుంచి తంగ్ధార్ వెళ్లే మార్గాల్లో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇందుకోసం తాంజీమ్ అనే ఇస్లామీ సంస్థ ఐఈడీతో నిండిన ఓ గ్రీన్ స్కార్పియోను సిద్ధం చేసిందని వెల్లడించాయి. కశ్మీరీ యువకులతో నిరసనలు చేయిస్తూ.. వారి సహకారంతో వాస్తవాధీన రేఖ దాటాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే 5 నుంచి 6 మంది ఉగ్రవాదులు కశ్మీర్లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి.(లొంగిపోవడం కంటే కూడా చావడానికి సిద్ధం..) 500 కిలోల బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి.. జైషే మహ్మద్‌కు చెందిన ఓ సోషల్ మీడియా గ్రూపు మెసేజ్‌లను ఇంటెలిజిన్స్ వర్గాలు డీకోడ్ చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.... ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత వారం కేవలం 200 కిలోల ఐఈడీ మాత్రమే ఉపయోగించాం. 500 కిలోల భారీ బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి. కశ్మీరీలపై సైన్యం ఎటువంటి చర్యలకు పాల్పడ్డా.. భద్రతా బలగాలపై మరిన్ని దాడులు జరుగుతాయి. ఇది కేవలం మనకు.. సైన్యానికి జరుగుతున్న యుద్ధం. రండి యుద్ధానికి సిద్ధంగా ఉండండి’ అని జైషే.. భారత ఆర్మీని హెచ్చరించింది. ఇక భద్రతా వైఫల్యం కారణంగానే పుల్వామా దాడి జరిగిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సైనికులు ప్రయాణిస్తున్న సమయంలో పౌరుల వాహనాలను అనుమతించడంతో పుల్వామా దాడి సాధ్యమైందని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరో దాడికి జైషే సిద్ధమవుతోందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.(‘లొంగిపోండి.. లేదంటే అంతం చేస్తాం’) కాగా పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కమాండర్ ఆదిల్... సీఆర్పీఎఫ్ బలగాల వాహన శ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం.. కశ్మీర్లో తిరిగే ప్రతీ ఉగ్రవాదిని అంతం చేస్తామని ఆర్మీ అధికారులు మీడియా ముఖంగా హెచ్చరించారు. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న కశ్మీరీ యువత లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.(పుల్వామా ఉగ్రదాడి; మాస్టర్ మైండ్ హతం!) -
ఢిల్లీలో దాడికి ఉగ్రవాదుల కుట్ర?
-
ఢిల్లీలో దాడికి ఉగ్రవాదుల కుట్ర?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటలిజెన్స్ బ్యూరో మరోసారి హెచ్చరించింది. 15 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, ఇద్దరు ఢిల్లీలోకి ప్రవేశించినట్టు భద్రత బలగాలకు సమాచారం అందించింది. ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రముఖులు నివసించే ప్రాంతంలో మరింత భద్రతను పెంచారు. ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశముందని వారం క్రితం కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. తనిఖీల అనంతరం రైళ్లు ఆలస్యంగా బయల్దేరాయి.