IBM India
-
డిజి భారత్: ‘డిజిటల్’ వాడకం జిగేల్!
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటలీకరణ వేగవంతం అవుతోందనడానికి నిదర్శనంగా.. వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా వ్యాపార సంస్థలతో యూజర్లు నిర్వహించే వ్యాపార లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, అదే సమయంలో గోప్యత, భద్రతపైనా యూజర్లలో ఆందోళన ఉంటోంది. టెక్ దిగ్గజం ఐబీఎం నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చి 12–26 మధ్య నిర్వహించిన ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని వయస్సుల వారు ఎంతో కొంత డిజిటల్ మాధ్యమం ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుండగా .. 35 సంవత్సరాలకు పైబడిన వర్గాల్లో ఇది గణనీయంగా పెరిగింది. ‘కోవిడ్ నేపథ్యంలో వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా దేశీ యూజర్లు అన్ని రకాల వ్యాపారాలు, సంస్థలతో లావాదేవీలు నిర్వహించారు. ముఖ్యంగా బ్యాంకింగ్ (65 శాతం), షాపింగ్/రిటైల్ (54 శాతం) విభాగాల్లో ఈ ధోరణి అత్యధికంగా కనిపించింది‘ అని ఐబీఎం పేర్కొంది. ‘పలువురు యూజర్లు యాప్‌లను వాడటానికి ఇష్టపడకపోవడానికి ప్రధాన కారణాలు గోప్యత, భద్రతపై సందేహాలే. అయినప్పటికీ చాలా మంది ఇలాంటి ఏదో ఒక మాధ్యమాన్ని ఎంచుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో నలుగురు.. షాపింగ్ చేసేందుకు లేదా ఆర్డరు చేసేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాంను వాడటానికి ఇష్టపడటం లేదు. యాప్ లేదా వెబ్సైట్లో గోప్యతపై (40 శాతం), భద్రతపై (38 శాతం) సందేహాలు ఇందుకు కారణం‘ అని నివేదిక తెలిపింది. అయితే, మహమ్మారి వ్యాప్తి సమయంలో డిజిటల్ లావాదేవీలందించే సౌకర్యానికి చాలా మంది వినియోగదారులు కాస్త అలవాటు పడినట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోందని ఐబీఎం టెక్నాలజీ సేల్స్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సేల్స్ లీడర్ ప్రశాంత్ భత్కల్ తెలిపారు. కరోనా పూర్వ స్థాయికి పరిస్థితులు తిరిగి వచ్చినా ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయని వివరించారు. భారత్ సహా 22 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 22,000 మంది (ఒక్కో దేశంలో 1,000 మంది) పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు.. మహమ్మారి వ్యాప్తి సమయంలో దేశీ యూజర్లు వివిధ కేటగిరీల్లో సుమారు 19 కొత్త ఆన్లైన్ ఖాతాలు తెరిచారు. సోషల్ మీడియా, వినోదం కోసం సగటున 3 కొత్త ఖాతాలు తీసుకున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు వివిధ కేటగిరీల్లో దాదాపు 27 కొత్త ఆన్లైన్ ఖాతాలు తెరిచారు. ఒక్కో కేటగిరీలో మిగతా వయస్సుల వారికన్నా ఎక్కువ అకౌంట్లు తెరిచారు. దాదాపు సగం మంది (47 శాతం) భారతీయ యూజర్లు చాలా సందర్భాల్లో ఇతర అకౌంట్లకు కూడా ఒకే రకం లాగిన్ వివరాలను ఉపయోగిస్తున్నారు. ఇక 17 శాతం మంది కొత్త, పాత వివరాలు కలిపి ఉపయోగిస్తున్నారు. 35-49 ఏళ్ల మధ్య వారిలో దాదాపు సగం మంది యూజర్లు ఇతర అకౌంట్లకు ఉపయోగించిన క్రెడెన్షియల్స్‌నే మళ్లీ మళ్లీ వాడుతున్నారు. వెబ్సైట్ లేదా యాప్ భద్రతపై సందేహాలు ఉన్నప్పటికీ జనరేషన్ జెడ్ తరం (1990ల తర్వాత, 2000 తొలినాళ్లలో పుట్టిన వారు) మినహా 57 శాతం మంది యూజర్లు.. భౌతికంగా స్టోర్‌కి వెళ్లడం లేదా ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ చేయడం కన్నా డిజిటల్‌గా ఆర్డరు, చెల్లింపులు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము సందర్శించే యాప్‌లు, వెబ్సైట్లను ఇతర యాప్‌లు ట్రాక్ చేసేందుకు యూజర్లు ఇష్టపడటం లేదు. ట్రాకింగ్‌కు సంబంధించి పలు యాప్‌లకు అనుమతులు నిరాకరించినట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పైగా వెల్లడించారు. తమ వ్యక్తిగత డేటా భద్రంగా ఉంచుతాయని యూజర్లు అత్యధికంగా నమ్ముతున్న కేటగిరీల సంస్థల్లో హెల్త్‌కేర్ (51 శాతం), బ్యాంకింగ్/ఆర్థిక సంస్థలు (56%) ఉన్నాయి. సోషల్ మీడియాపై యూజర్లు అత్యంత అపనమ్మకంతో ఉన్నారు. -
ఐటీ చరిత్రలో సంచలన కలయిక
ముంబై: ఐటీ చరిత్రలో సంచలన కలయికకు దిగ్గజ కంపెనీలు వేదికయ్యాయి. తొలిసారిగా ఐటీ కంపెనీలు టీసీఎస్, ఐబీఎం కలిసి పనిచేయనున్నాయి. తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు అత్యాధునిక టెక్నాలజీని అందించేందుకు ఐబీఎమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. అత్యుత్తమ సాంకేతికతతో ఐబీఎమ్ క్లౌడ్ యూనిట్‌ను టీసీఎస్ ప్రారంభించనుంది. ఇందులో రెండు కంపెనీలు(టీసీఎస్, ఐబీఎమ్)లకు చెందిన అత్యుత్త సాంకేతిక నిపుణులు సేవలందిస్తారు. అయితే డేటా ఎస్టేట్ , వివిధ రకాల అప్లికేషన్స్ తదితర అంశాలను బదిలీ చేయనున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి. ఇరు కంపెనీలు వృద్ధి చెందేందుకు మెరుగైన అంశాలు బదిలీ చేయనున్నట్లు కంపెనీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇదివరకు డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా భవిష్యత్తులో డిజిటల్ రంగం సృష్టించబోయే నూతన అప్లికేషన్స్ ఆధునీకరణ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర అంశాలలో ముందుంటామని టీసీఎస్ ఉన్నతాధికారి వెంకట్రామన్ తెలిపారు. వెంకట్రామన్ స్పందస్తూ.. భవిష్యత్తులో క్లయింట్లు, వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు టీసీఎస్, ఐబీఎం ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కాగా క్లౌడ్ టెక్నాలజీ బదిలీ వల్ల క్లయింట్లకు వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవకాశముంటుందని ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బోబ్ లార్డ్ పేర్కొన్నారు. టీసీఎస్, ఐబీఎమ్ ఒప్పందంతో ఐటీ వేగంగా వృద్ధి చెందుతుందని లార్డ్ అభిప్రాయపడ్డారు. క్లయింట్లకు, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు టీసీఎస్, ఐబీఎమ్ కలయిక ఉపయోగపడుతుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: నిరుద్యోగుల కోసం టీసీఎస్ శిక్షణ) -
నిరుద్యోగులకు ఐబీఎమ్ గుడ్‌న్యూస్
బెంగుళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను టెక్ దిగ్గజం ఐబీఎమ్ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐబీఎమ్ వెబ్సైట్ లింకిడ్ ఇన్ పేజీలో 500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఐబీఎమ్‌లో 3,50,00మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, అందులో మూడో వంతు భారత్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఐబీఎమ్ తన మాతృదేశమైన (అమెరికా)లో 400 ఉద్యోగులను నియమించునున్నట్లు తెలిపింది. ఐబీఎమ్ కంపెనీ ఇండియాలో కంటే తక్కువ నియామకాలు చేపట్టడం పట్ల అమెరికాకు చెందిన నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐబీఎమ్‌లో మేనేజర్లు, మిడిల్‌వేర్ అడ్మినిస్టేటర్లు(పరిపాలన విభాగం), డేటా సైంటిస్ట్‌లు, నెట్వర్క్ , క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు తదితర కేటగిరీలలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ఐబీఎమ్ ప్రకటించింది. ఈక్విటీ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి బోర్‌గియస్ స్పందిస్తూ.. ఐబీఎమ్ లాంటి దిగ్గజ కంపెనీలు భారత్‌లోని ఐటీ నిపుణులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, యూఎస్, యూరప్‌లో వారికి ఐటీ నిపుణుల కొరత వేదిస్తుందని తెలిపారు. మరోవైపు కంపెనీలు ఖర్చులు తగ్గించడానికి దేశీయ ఐటీ నిపుణులు వైపు ఆలోచిస్తున్నట్లు బోర్‌గియస్ పేర్కొన్నారు. (చదవండి: ఐబీఎం పోటీలో భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగుల సత్తా) -
సీనియర్ లెవల్ పదోన్నతులకు టెకీల ఆసక్తి..
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత వారం నుంచి సీనియర్ లెవల్ ఐటీ(టెకీలు) ఉద్యోగులు పదోన్నత్తుల కోసం కంపెనీలకు రెజ్యూమ్స్ పంపిస్తున్నట్లు సాంకేతిక విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఎక్కువగా నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీని నేర్చుకోలేని వారికి ఉద్వాసన తప్పదని ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం డిజిటల్ నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని.. వాటిలో నైపుణ్యం పెంచుకోవడానికి ఉద్యోగులు కృషి చేయాలని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా తెలిపారు. ఉద్యోగుల డిజిటల్ నైపుణ్యాలకు కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తాయని గుప్తా అభిప్రాయపడ్డారు. దాదాపు 40 శాతం మంది సీనియర్ ఐటీ ఉద్యోగులు కంపెనీలకు రిజ్యూమ్స్ పంపిస్తున్నట్లు ఫీనో అనే కన్సెల్టెంట్ సంస్థ తెలిపింది. కరోనా ప్రభావం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చని ఫీనో సహ వ్యవస్థాపకుడు కమల్ కరన్త్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐటీ దిగ్గజ కంపెనీలు ఐబీఎమ్, కాగ్నిజెంట్ తదితర సంస్థలు ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. -
గొంతెత్తి ప్రశ్నించండి : మహిళలకు 'ఉష' పాఠం
ఒక్క ప్రశ్న.. ఎన్నో సమాధానాలకు మూల కారణం అంటారు. ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడే ఏదైనా సాధించగలం అంటారు. కొందరు ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటే.. నువ్వేమన్నా క్వశ్చన్ బ్యాంకు మింగావా.. అంటూ హేళన చేస్తుంటారు. కానీ ఆ హేళనలు, ఆ ప్రశ్నలే భవిష్యత్తుకు బంగారు బాటలు అవుతుంటాయి. ఇది నేను, నువ్వు కాదు చెప్పింది కాదు. విజయపథంలో దూసుకుపోయిన ఎందరో మహానుభావులు చెప్పిన నగ్నసత్యం. ''నిన్ను నీవు అడుగు, నీ సహచరులను అడుగు. నీ పై అధికారులను అడుగు.. ఇలా నీ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడానికి అడుగుతూనే ఉండండి. ఎప్పుడైతే నీవు ప్రశ్నిస్తావో అప్పుడే నీకో సమాధానం దొరుకుతుంది. అదే నీవు చేరుకోవాల్సిన లక్ష్యాలకు చేరుస్తుంది...ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన ఐబీఎంలో టాప్ అధికారిగా పనిచేసిన ఉష శ్రీ అద్దేపల్లి నేర్చుకున్న జీవిత పాఠం. దాదాపు ఒకే కంపెనీలో 20 ఏళ్లపాటు నిరాటంకంగా పనిచేస్తూ... పలు విభాగాల్లో తనదైన సత్తా చాటుతూ వస్తున్న ఉష శ్రీ లక్షల మంది యువతను ఆకట్టుకున్నారు. ఒక మల్టినేషనల్ టెక్ దిగ్గజంలో ఒక మహిళ ఇన్నేళ్ల పాటు పలు కీలక హోదాల్లో విజయవంతంగా పనిచేస్తూ ఉండటం ఈ తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. 1997లో ఐఐఎం-బెంగళూరు క్యాంపస్ ప్లేస్మెంట్లు.. ఆ రోజు ఇంకా నాకు గుర్తుంది. నేను నాకెంతో ఇష్టమైన బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగంలో స్థిరపడాలని ఎంతో కృతనిశ్చయంతో ఉన్నా. ఆ సమయంలో ఐటీ కంటే కూడా బ్యాంకింగ్ ఉద్యోగమే ఎంతో గ్లామరస్. కానీ ఐబీఎం కంపెనీ ఇచ్చిన ప్రజెంటేషన్, నాలో భిన్న దృక్కోణాన్ని మేలుకొల్పింది. నాకున్న జ్ఞానాన్ని, విస్తృత పరుచుకోవడానికి ఇదో మంచి అవకాశంగా ఐటీ రంగంపై నాలో సానుకూల దృక్పథం నెలకొల్పింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనే డ్రీమ్‌ను వదులుకోకుండానే.. మల్టినేషనల్ ఐటీ దిగ్గజం ఐబీఎంలో అడుగుపెట్టేశా. అదే నాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఒక యంగ్ వర్కింగ్ ప్రొఫిషనల్‌గా తొలిరోజే ట్రెజరీ బాధ్యతలు నాకు అప్పగించారు. అది ఒక దిగ్గజ ఐటీ కంపెనీకి ప్రధాన బ్యాంకింగ్ సేవలు. ఇప్పటికీ ఆ రోజులను మర్చిపోలేనని ఉషా శ్రీ గుర్తుచేసుకున్నారు. ఫైనాన్స్ నిపుణురాలిగా మరచిపోలేని అనుభూతి ఐబీఎం ఇండియాలో 20 ఏళ్లుగా కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న ఉష శ్రీ అద్దేపల్లి ఆర్థిక నిపుణురాలిగా మరచిపోలేని అనుభూతే ఉంది. వివిధ నాయకత్వ బాధ్యతలను ఆమె తన సొంతం చేసుకున్నారు. ఐబీఎంలో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్, భారత్ దక్షిణాసియా సీఎఫ్ఓగా, భారత్, దక్షిణాసియా ప్రైసింగ్ అధినేతగా, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ నుంచి వైస్ ప్రెసిడెంట్, కంట్రోలర్ వరకు ఆమె పలు హోదాల్లో కొనసాగారు. ప్రస్తుతం ఆమె భారత్, దక్షిణాసియా డొమెస్టిక్ బిజినెస్ డైరెక్టర్, ఫైనాన్స్, సీఎఫ్ఓగా ఉన్నారు. ప్రతీ బాధ్యతలోనూ ఉష నేర్చుకునే అలవాటును మాత్రం మానుకోలేదు. ఏదో ఒక కొత్త విషయాన్ని ఆమె అభ్యసిస్తూనే ఉన్నారు. ఎంతో క్లిష్టమైన సవాళ్లను కూడా దీటుగా ఎదుర్కొనే శక్తిని సంపాదించుకున్నారు. అయితే భారత్, దక్షిణాసియాకు ప్రైసింగ్ అధినేతగా బాధ్యతలు నిర్వహించడం ఎంతో ప్రత్యేకమైన అనుభవమని, ఆ మూడున్నర ఏళ్లలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినప్పటికీ తన కరియర్లో ఈ సమయం చాలా కీలకమైందన్నారు. ఆర్థిక నిపుణురాలిగా మరచిపోలేని అనుభూతిగా మారడానికి ప్రధాన కారణం తాను వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం ఐబీఎంపై నేరుగా ప్రభావం చూపేవని,అంతటి విశిష్టమైన స్థానాన్ని తాను సొంతం చేసుకున్నానని ఉష ఎంతో గర్వంగా చెప్పారు. ఒకే కంపెనీలో 20 ఏళ్లు బోర్ రాలేదా? ఒకే కంపెనీలు 20 ఏళ్లు అంటే, చాలా తక్కువ మందే చేస్తారు. బోర్ వస్తుందని కంపెనీ మారడమో, లేదా వేతనం కోసమో లేదా మరేదైనా మంచి అవకాశం రావడమో చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీలను మారుస్తూ ఉంటారు. ఇదే విషయంపై ఉషకు ఇటీవల జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఐబీఎంలో 20 ఏళ్లుగా ఉంటున్నారు. ఎప్పుడు బోర్ రాలేదా? అని. ''ఐబీఎం అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీల కలయిక. వివిధ వ్యాపారాల్లో, అదే విధంగా వివిధ ప్రాంతాల్లో పనిచేసే అవకాశాన్ని ఐబీఎం తన ఉద్యోగులకు కల్పిస్తుంది. ఈ విధంగా ఐబీఎం తరహాలో ఆఫర్చేసేవి చాలా తక్కువగా ఉండొచ్చు కానీ ఐబీఎం కంపెనీ తన ఉద్యోగులకు పలు అవకాశాలకు ప్రోత్సహం అందిస్తుంది. ఒక మహిళగా ఇంటి బాధ్యతలు, పిల్లలని చూసుకోవడం, ఇటు ఆఫీసుల్లో కీలక బాధ్యతలు పోషించడం సవాలే. డెలివరీ సమయంలో, ఆ అనంతరం కంపెనీ అందించిన సహకారంతో... ఇంటి నుంచే కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా పెద్ద పెద్ద బాధ్యతలు నాకు అప్పగించడంలో ఎలాంటి వెనుకంజ వేయలేదు కంపెనీ. నాపై చూపిన నమ్మకం, విశ్వాసంపై నేడు నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి'' అని ఉష తెలిపారు. నేను నా భర్తతో కంటే ఐబీఎంతో గడిపిన రోజులే ఎక్కువని సరదాగా జోక్ చేస్తారామె. ఒక వ్యక్తి సామర్థ్యాన్ని జడ్జ్ చేయడానికి లింగ బేధాలను ప్రమాణీకరంగా తీసుకోకూడదని ఉష నిరూపించారు. ఇదే కారణంతో ఉష 20 ఏళ్లుగా ఐబీఎంలో సక్సస్‌ఫుల్‌గా తన జర్నీని కొనసాగిస్తున్నారు. ఒక మహిళను, ఇలా కాదు అలా ఉండాలి అనే భావన నాకెన్నడూ రాలేదు. నువ్వు ఏం చేస్తున్నావో అదే కరెక్ట్ అనే నమ్మకాన్ని ఐబీఎం నాలో కల్పించిందన్నారు ఉష. జీవితంలో ప్రతి దశలోనూ ప్రాధాన్యతలు పలు రకాలుగా ఉంటాయి. వాటిని రీబ్యాలెన్సింగ్ చేసుకోవాల్సినవసరం ఎంతో అవసరం. కానీ ఒక్కోసారి మహిళలు ఏదో ఒక దగ్గర కన్ఫ్యూజన్కి గురవుతారు. ఈ కన్ఫ్యూజనే తమలో ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఆ కన్ఫ్యూజన్ గుర్తించి, దానికి పరిష్కారం కనుగొనాలి. ఈ పరిష్కారమే మహిళలకు ఎంతో శక్తివంతమైనదిగా మారుతోంది. ఒకవేళ అలా కానీ పక్షంలో మన ముందున్న ఎంతో మంచి అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది. - కొటేరు శ్రావణి -
ఉద్యోగాల కోతను ఖండించిన టెక్ దిగ్గజం
-
ఉద్యోగాల కోతను ఖండించిన టెక్ దిగ్గజం
ముంబై : ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్యోగాల కోత ఆందోళనతో కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నా.. పలుకుకపోయినా.. టెకీలకు దడపుట్టిస్తూ రిపోర్టులు వస్తున్నాయి. వచ్చే క్వార్టర్లో మరో మల్టినేషనల్ ఐటీ దిగ్గజం ఐబీఎం కూడా 5000 మంది ఉద్యోగులపై వేటు వేయనుందని ఇండస్ట్రీలో రిపోర్టులు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ రిపోర్టులన్నీ అవాస్తవమంటూ ఆ టెక్ దిగ్గజం స్పష్టంచేసింది '' ఈ రిపోర్టులు వాస్తవానికి తప్పు. రూమర్లు, ఊహాగానాలపై మరింత మాట్లాలనుకోవడం లేదు'' అని ఐబీఎం ఇండియా అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే త్రైమాసికంలో ఐబీఎం దాదాపు 5000 మంది భారత ఉద్యోగులను ఇంటికి పంపించేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పినట్టు రిపోర్టులు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు, ఆటోమేషనల్ ప్రభావంతో ఉద్యోగులపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్ లు కంపెనీలు కూడా ఉద్యోగాల కోతపై వార్నింగ్ ఇచ్చేశాయి. వీటి జాబితాలోనే ఐబీఎం కూడా ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు తెలిపాయి. ఇప్పటికే ఐబీఎంలో ఉద్యోగాల కోత ప్రక్రియ ప్రారంభమైందని, తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించాలని మేనేజర్లు ఆదేశించినట్టు పేరు వెల్లడించని కంపెనీకి చెందిన ఓ అధికారి చెప్పినట్టు రిపోర్టులు వచ్చాయి.. వ్యాపార వాతావరణాలపై మరింత క్లారిటీ వచ్చేంతవరకు ఐబీఎం కొత్త నియామకాల ప్లాన్ ను కూడా అమలుచేయాలనుకోవడం లేదని మరో అధికారి పేర్కొన్నట్టు కూడా తెలిపాయి. అయితే ఎంతమంది ఉద్యోగులపై వేటు వేస్తుందో ఈ టెక్ దిగ్గజం క్లారిటీ ఇవ్వన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారుల క్లౌడ్ టెక్నాలజీ ప్రయోజనాలను పెంపొందించడానికి రీస్కిల్లింగ్, రీ బ్యాలెన్సింగ్ చేపట్టే ప్రక్రియ ప్రారంభించామని ఐబీఎం తెలిపినట్టు పేర్కొన్నాయి. అయితే ఉద్యోగాల కోత అవాస్తవమని ఐబీఎం తేల్చేసింది. మొత్తం ఐబీఎంకు ఇండియాలో 1,50,000 మంది ఉద్యోగులున్నారు.