ibrahim khalil
-
అమెరికా క్రికెట్ కెప్టెన్‌గా ఇబ్రహీం ఖలీల్
వాషింగ్టన్: ఐసీసీ వరల్డ్ టి20 క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టుకు హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం ఖలీల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నెల 19 నుంచి నార్త్ కరోలినాలో జరిగే ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల యూఎస్ఏ జట్టును సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ వెస్టిండీస్ క్రికెటర్ రికార్డో పావెల్ ప్రకటించారు. హైదరాబాద్ తరఫున సుదీర్ఘ కాలం రంజీ ఆడిన అనంతరం యూఎస్ఏ వలస వెళ్లిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఖలీల్ ... గత ఏడాది నుంచి జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇంతకుముందు కూడా జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను, మరోసారి సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. టోర్నీలో భాగంగా కెనడా, పనామా, హోండురస్ జట్లతో అమెరికా తలపడుతుంది. ఇబ్రహీం ఖలీల్ ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో క్రిస్ గేల్ కెప్టెన్‌గా ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
కెప్టెన్ అమెరికా.. మేడిన్ హైదరాబాద్
►యూఎస్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ►రాణిస్తున్న హైదరాబాదీ ►ఇబ్రహీం ఖలీల్ నాయకత్వంలో వన్డే సిరీస్ విజయం ►అందివచ్చిన అవకాశంతో ముందుకు ఇంజినీరింగ్, ఐటీ, మెడిసిన్... ఒక్కటేమిటి, ప్రతీ రంగంలో అమెరికాలో భారతీయులు, అందులో హైదరాబాదీలు తమ ముద్ర ప్రదర్శించడం కొత్త కాదు. యూఎస్‌కు వెళ్లి తమ అపార ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నవారు మనకు చాలా మంది కనిపిస్తారు. ఇప్పుడు క్రికెట్లో కూడా అలాంటి ఘనతను ఒక హైదరాబాదీ సాధించాడు. నగరానికి చెందిన ఇబ్రహీం ఖలీల్ అమెరికా జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. అంతే కాదు... నాయకుడిగా తన తొలి సిరీస్‌లోనే టీమ్‌ను విజయ పథంలో నడిపించి సత్తా చాటాడు. హైదరాబాద్ తరఫున దాదాపు 12 ఏళ్ల పాటు రంజీ ట్రోఫీ ఆడిన ఖలీల్... ఇప్పుడు యూఎస్ అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్న సమయంలో మరో కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం. సాక్షి, హైదరాబాద్ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వికెట్ కీపర్‌గా ఇబ్రహీం ఖలీల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీల్లో కూడా బరిలోకి దిగిన ఖలీల్ మొత్తం 57 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 3 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు సహా 2,158 పరుగులు చేసిన అతను... 186 క్యాచ్‌లు పట్టాడు. 2011లో గువాహటిలో అస్సాంతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అతను 14 మందిని (11 క్యాచ్‌లు, 3 స్టంపింగ్‌లు) అవుట్ చేయడంలో భాగమై ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. అప్పట్లో సంచలనంలా వచ్చి, తర్వాత రద్దయిన ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ఆడిన వారిలో అతను కూడా ఒకడు. ఇప్పుడు ఖలీల్ అమెరికా తరఫున ఆడటమే కాకుండా, తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అనుభవంతో జట్టు కెప్టెన్‌గా కూడా ప్రత్యేకత ప్రదర్శించాడు. అమెరికా అవకాశం... తన కుటుంబ స్నేహితురాలు, అమెరికా పౌరసత్వం ఉన్న అమ్మాయితో 2013లో ఖలీల్‌కు వివాహమైంది. షికాగో సమీపంలోని బెలోయిట్లో ఆమె డాక్టర్‌గా పని చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా రెండేళ్ల పాటు రంజీ సీజన్ సమయంలో హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఖలీల్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే 2015 జనవరిలో తన ఆఖరి మ్యాచ్ ఆడిన అనంతరం ఖలీల్... రంజీ ట్రోఫీకి గుడ్‌బై చెప్పేశాడు. మళ్లీ క్రికెట్ వైపు చూడకుండా యూఎస్ వచ్చి ఉద్యోగంలో స్థిరపడిపోవాలని అతను నిర్ణయించుకున్నాడు. అయితే క్రికెట్‌కు దూరం కాలేని ఖలీల్ షికాగోలో జరిగే లీగ్ మ్యాచ్‌లలో రెగ్యులర్‌గా ఆడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో యూఎస్ క్రికెట్ అసోసియేషన్ అధికారుల్లో కొందరి దృష్టి అతనిపై పడింది. అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి అమెరికా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న జట్టు. ఐసీసీ డివిజన్ త్రీలో ఉన్న ఈ టీమ్ రెండేళ్ల క్రితం 2015 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఆడింది. తమ జట్టును మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న యూఎస్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ బాగా ప్రాచుర్యంలో ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే 34 ఏళ్ల ఖలీల్‌కు చక్కటి అవకాశం దక్కింది. తన భార్య కారణంగా అప్పటికే గ్రీన్‌కార్డ్ కలిగి ఉన్న ఖలీల్ 2016లో జరిగిన సెలక్షన్స్‌లో పాల్గొన్నాడు. అమెరికాకు ప్రాతినిధ్యం వహించేందుకు కావాల్సిన అర్హతలు పూర్తి చేసేందుకు క్రికెట్ అసోసియేషన్ సహకరించింది. ఫాస్ట్‌ట్రాక్‌లో అతని పౌరసత్వ దరఖాస్తును ముందుకు జరిపి చివరకు జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. ఆటగాడిగా, కెప్టెన్‌గా... ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ (డివిజన్ 3)లో భాగంగా గత మే నెలలో అమెరికా జట్టు ఉగాండాలో ఆరు జట్ల వన్డే టోర్నీ ఆడింది. యూఎస్ విజేతగా నిలవకున్నా... ఇందులో ఖలీల్ అటు బ్యాటింగ్‌లో నిలకడగా రాణించి అమెరికా టాప్ స్కోరర్‌గా నిలవడమే కాకుండా, వికెట్ కీపర్‌గా కూడా తన సత్తాను ప్రదర్శించాడు. ఇది అతనికి మరింత గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ నెలలో టొరంటో సమీపంలోని కింగ్ సిటీలో అమెరికా, కెనడా మధ్య మూడు వన్డేల సిరీస్ ‘ఆటీ కప్’ జరిగింది. 1844లో ప్రారంభమైన ఈ సిరీస్‌కు ప్రపంచ క్రికెట్లో అతి పురాతన క్రికెట్ టోర్నీగా గుర్తింపు ఉంది. అమెరికా జట్టు చేసిన కీలక మార్పుల్లో భాగంగా ఈసారి ఖలీల్‌ను కెప్టెన్సీ వరించింది. ఇందులో అమెరికా 2–1తో సిరీస్‌ను గెలుచుకుంది. 1991లో ఆఖరిసారిగా దీనిని గెలుచుకున్న యూఎస్... 26 ఏళ్ల తర్వాత మళ్లీ సాధించడం విశేషం. బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్‌లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడల మధ్య అమెరికాలో ఇప్పుడిప్పుడే క్రికెట్ సంస్కృతి కూడా పెరుగుతోంది. దానికి అనుగుణంగా మున్ముందు ఆ జట్టు తరచుగా టోర్నీలు ఆడే విధంగా షెడ్యూల్‌ను రూపొందిస్తోంది. రాబోయే కాలంలో కూడా జట్టు మరిన్ని విజయాలు సాధించేందుకు, ప్రధాన జట్టుగా ఎదిగేందుకు కృషి చేస్తానని ఖలీల్ చెబుతున్నాడు. ఒక క్రికెటర్‌గా ఎప్పటికైనా దేశం తరఫున ఆడాలనేది నా కల. అయితే రంజీ ట్రోఫీ వరకే నా కెరీర్ పరిమితమైంది. భారత్‌కు ఆడే చాన్స్ లేనప్పుడు రంజీల్లో కొనసాగడంలో అర్థం లేదనిపించి తప్పుకున్నాను. ఇప్పుడు మరో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా అదృష్టం. క్రికెట్ పరంగా అమెరికా పెద్ద జట్టు కాకపోవచ్చు. కానీ అమెరికా అంటే అమెరికాయే! యూఎస్ క్రికెట్ అసోసియేషన్‌తో పాటు నా భార్య సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ‘ఆటీ కప్’లో కెప్టెన్‌గా జట్టును గెలిపించడం నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. భారత్‌లాంటి దేశంలో రంజీ ట్రోఫీ ప్రమాణాలు కూడా చాలా బాగుంటాయి. ఆ అనుభవమే నాకు ఇక్కడ ఉపయోగపడింది. హైదరాబాద్ క్రికెటర్‌గా నాకున్న గుర్తింపు యూఎస్‌లో కూడా మంచి పేరు తెచ్చి పెట్టడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా అమెరికా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టగలిగాను. ఐసీసీ డివిజన్ లీగ్‌లో మరింత ముందుకెళ్లి మా జట్టు పెద్ద జట్లతో పోటీ పడేలా చేయడమే నా లక్ష్యం. – ‘సాక్షి’తో ఇబ్రహీం ఖలీల్ -
అమెరికా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ
హైదరాబాద్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇబ్రహీమ్ ఖలీల్ అమెరికా జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మంగళవారం ప్రారంభమైన ఆటీ కప్ వన్డే టోర్నమెంట్‌తో అతను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. హైదరాబాద్ తరఫున 57 రంజీ మ్యాచ్‌లు ఆడిన ఖలీల్, యూఎస్ఏ తరఫున ఐదు వన్డేలు ఆడగా... జట్టులో జరిగిన భారీ మార్పుల్లో భాగంగా అతనికి ఇప్పుడు కెప్టెన్సీ దక్కింది. ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో 14 మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డు ఖలీల్ పేరిట ఉంది. -
ఖలీల్ అజేయ శతకం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రంజీ జట్టు మాజీ వికెట్ కీపర్ ఇబ్రహీం ఖలీల్ (281 బంతుల్లో 152 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో ఎన్స్‌కాన్స్ భారీ స్కోరు చేసింది. ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో దక్షిణమధ్య రైల్వే జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు ఆటలో ఎన్స్‌కాన్స్ 440/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రేయాన్ అమూరి 43 పరుగులు చేయగా, బాషా 4 వికెట్లు తీశాడు. అనంతరం రైల్వే జట్టు ఆటముగిసే సమయానికి 2 వికెట్లకు 45 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో ఎస్బీహెచ్ బౌలర్లు రవికిరణ్ (5/90), అశ్విన్ యాదవ్ (4/100) విజృంభించడంతో ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ నిఖిల్ యాదవ్ (149 బంతుల్లో 120 నాటౌట్, 19 ఫోర్లు) సెంచరీ సాధించాడు. తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఆకాశ్ భండారి (75), సుమంత్ (64) అర్ధసెంచరీలు చేశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 423/5 డిక్లేర్డ్ (రవితేజ 193, నవీన్ రెడ్డి 152 నాటౌట్; పర్వేజ్ ఖాన్ 4/81), కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 175 (అజ్మత్‌ఖాన్ 38, తనయ్ త్యాగరాజన్ 32; ఖాదర్ 4/36, కనిష్క్నాయుడు 3/43), రెండో ఇన్నింగ్స్: 1/0. కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 394 (శాండిల్య 159, చైతన్యకృష్ణ 96, ఆరోన్ పాల్ 37; శివశంకర్ 4/77) బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 82/2. డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 359 (అక్షత్ రెడ్డి 119, షాదాబ్ తుంబి 72, హబీబ్ అహ్మద్ 50, ప్రణీత్ 40; మోహిత్ మన్ 4/39, దివేశ్ పథానియా 4/112), ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 81/1. శ్రీదరహాస్కు 5 వికెట్లు శ్రీదరహాస్ (5/38) నిప్పులు చెరగడంతో ఆర్.దయానంద్ జట్టు తక్కువ స్కోరుతోనే తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మొదట దయానంద్ తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. తర్వాత ఫలక్‌నుమా జట్టు 161 పరుగులకే కుప్పకూలింది. ఇంద్రశేఖర్ రెడ్డి 3 వికెట్లు తీశాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో దయానంద్ జట్టు 3 వికెట్లకు 27 పరుగులు చేసింది. చెలరేగిన అన్వర్ హైదరాబాద్ బాట్లింగ్ బౌలర్ అన్వర్ అహ్మద్‌ఖాన్ (5/37) చెలరేగడంతో ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బాట్లింగ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. వంశీవర్ధన్ రెడ్డి (144 బంతుల్లో 77 బ్యాటింగ్, 10 ఫోర్లు), షేక్ మహమ్మద్ (128 బంతుల్లో 53, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు.