‘శక్తిమిల్స్’కీచకులకు ఉరి
వీరికి ఉరే సరైన శిక్ష అన్న కోర్టు
కొత్తగా ప్రవేశపెట్టిన ఐపీసీ సెక్షన్ 376 (ఈ) తొలిసారి అమలు
అత్యాచార నేరానికి మళ్లీమళ్లీ పాల్పడితే మరణశిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తున్న కొత్త సెక్షన్
ముగ్గురికి మరణశిక్ష, నాలుగో దోషికి యావజ్జీవం
ముంబై: ముంబైలోని పాడుబడిన శక్తి మిల్స్‌లో జరిగిన రెండు సామూహిక అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసుల్లో దోషులుగా నిర్ధారించిన ముగ్గురికి స్థానిక సెషన్స్ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. మళ్లీ మళ్లీ అత్యాచార నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేందుకు వీలు కల్పిస్తూ సవరించిన ఐపీసీ సెక్షన్ 376(ఈ)ను దేశంలోనే తొలిసారిగా న్యాయమూర్తి ఈ సందర్భంగా అమలు చేశారు. అత్యాచార కేసుల్లో బాధితులు చనిపోనప్పటికీ దోషులకు గరిష్టస్థాయిలో మరణశిక్ష విధించేందుకు ఈ సెక్షన్ అవకాశం కల్పిస్తోంది.
ఢిల్లీలో 2012 డిసెంబర్లో జరిగిన ఘోర అత్యాచార ఘటనానంతరం సవరించిన ఈ చట్టం అమల్లోకి వచ్చింది. గత ఏడాది జూలైలో శక్తి మిల్స్ ప్రాంగణంలో 18 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. అదే ఆవరణలో ఆ ఏడాది ఆగస్టు 22న 22 ఏళ్ల ఫొటో జర్నలిస్టుపై కూడా సామూహిక అత్యాచారం జరిగింది. తొలి కేసులో దోషులుగా నిర్ధారించిన ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అరుుతే రెండో కేసులో కూడా ఈ ముగ్గురు దోషులని తేలడంతో సెషన్స్ కోర్టు వారికి మరణశిక్ష విధించింది.
ఈ కేసులో కాని పక్షంలో మరే కేసులో మరణశిక్ష విధించాలని ప్రశ్నించిన జడ్జి షాలినీ ఫన్సాల్కర్ జోషి .. దోషులు కాసిమ్ బెంగాలి (21), విజయ్ జాదవ్ (19), మహమ్మద్ సలీమ్ అన్సారీ (28)లకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వారు చనిపోయేంత వరకు మెడకు ఉరి వేయూలని అన్నారు. లైంగిక నేరగాళ్లు సమాజానికి చీడపురుగుల్లా మారారని, వీరిని ఎలాంటి దయూదాక్షిణ్యాలు లేకుండా శిక్షించాల్సిన అవసరం ఉందని, కేసులో అవసరమైనప్పుడు న్యాయం అనే కత్తిని ఉపయోగించేందుకు న్యాయమూర్తి సందేహించరాదని జడ్జి షాలిని వ్యాఖ్యానించారు.
కాగా ఒకే అత్యాచారంలో నిందితుడైన సిరాజ్ రెహమాన్‌కు జడ్జి జీవితఖైదు విధించారు. అసహజ లైంగిక చర్య, దాడి, సాక్ష్యాల విధ్వంసం తదితర నేరాలకు గాను జడ్జి నలుగురు నిందితులకు ఐపీసీతో పాటు ఐటీ చట్టం కింద జైలు శిక్షలు, జరిమానాలు విధించారు. క్షణిక కామోద్రేకంతో కాకుండా ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే నిందితులు నేరానికి పాల్పడ్డారని న్యాయమూర్తి చెప్పారు. తాజా కేసులో దోషులు బాధితురాలి పట్ల కనికరం లేకుండా వ్యవహరించారని అన్నారు.
బాధితురాలి హక్కులన్నిటినీ కాలరాశారు..
బాధితురాలి హక్కులన్నింటినీ కాలరాసిన ఈ నిందితులకు అత్యంత కఠిన శిక్ష వేయాల్సిందేనని, లేనిపక్షంలో సామాన్యుడికి వ్యవస్థపై నమ్మకం పోతుందని చెప్పారు. తనను వెళ్లనివ్వమని ఆర్థించిన బాధితురాలిని చూసి నిందితులు నవ్వారన్నారు. కేవలం లైంగిక దాడినే కాకుండా బాధితురాలి నిస్సహాయ పరిస్థితిని కూడా వారు ఆస్వాదించారని చెప్పారు. బాధితురాలు ధైర్యంగా ముందుకువచ్చి ఫిర్యాదు దాఖలు చేయడంతో దారుణ కృత్యం వెలుగుచూసిందన్నారు. బాధితురాలు అనుభవించిన మానసిక క్షోభ, నొప్పిని కోర్టు గమనించిందన్నారు. ఇది కేవలం బాధితురాలి ప్రాథమిక, రాజ్యాంగపరమైన హక్కులను ఉల్లంఘించడమే కాకుండా ఆమె స్వేచ్ఛను హరించడమేనని జడ్జి అభిప్రాయపడ్డారు.
ఇది కేవలం బాధితురాలికి వ్యతిరేకంగా జరిగిన నేరమే కాకుండా యూవత్ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన నేరమని జడ్జి షాలిని పేర్కొన్నారు. నిందితులు యుక్త వయస్సులో ఉండటమనేది వారిపై దయూదాక్షిణ్యాలు చూపడానికి ప్రాతిపదిక కాబోదని స్పష్టం చేశారు. కాగా, పగతో తాము దోషులకు మరణశిక్ష కోరడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ అంతకుముందు కోర్టుకు స్పష్టం చేశారు. నేరాన్నే కాకుండా నిందితులు నేరానికి పాల్పడిన తీరును కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని నివేదించారు.
‘సూర్యనెల్లి’ కేసులో దోషులకు శిక్షలు
కొచ్చి: పద్దెనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన సూర్యనెల్లి సామూహిక అత్యాచార కేసులో దోషులకు కేరళ హైకోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. ప్రధాన దోషి ధర్మరాజన్‌కు జీవితకాల కారాగారవాసం విధించిన కోర్టు.. మరో 23 మందికి శిక్షలు వేసింది. దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను విచారించిన జస్టిస్ కేటీ శంకరన్, జస్టిస్ ఎంఎల్ జోసెఫ్ ఫ్రాన్సిస్‌లతో కూడిన ధర్మాసనం ఆ తీర్పును ప్రకటించింది. అత్యాచార సమయంలో మైనరైన బాధితురాలిని 40 మంది కలసి 40 రోజుల పాటు కేరళ, తమిళనాడు ప్రాంతంలో మూడు వేల కిలోమీటర్లకుపైగా తిప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడ్డ వారిలో 36 మంది దోషులుగా తేలగా సుదీర్ఘ విచారణ సమయంలో ఐదుగురు చనిపోయారు.