ice box
-
నాణ్యత డొల్లేనా!
సాక్షి, మహబూబ్‌నగర్ : భానుడు భగభగ మంటున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో గొంతెండిపోతోంది. ప్రజలు ఉక్కపోతకు తట్టుకోలేక ఉపశమనం కోసం పరుగులు తీస్తున్నారు. దాహార్తిని తీర్చుకునేందుకు చెరుకు, పండ్ల రసాలు, మజ్జిగ ఇతర పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ సెంటర్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ఇదే అదనుగా ఎక్కడపడితే జ్యూస్, చెరుకు రసం దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఈ సీజన్లో ఇది సహాజమే అయినా.. చాలా మంది చల్లదనం కోసం లేనిదే ఆ పానీయాలను ముట్టుకోరు. ఇంకొందరైతే అడిగి మరీ మరిన్ని ఐస్ గడ్డలు వేయించుకుంటారు. ఎలాంటి అనుమతులు లేకుండా, శుభ్రత పాటించకుండా ఈ కేంద్రాల్లో విక్రయాలు కొనసాగిస్తున్నారు. అపరిశుభ్రమైన నీటితో తయారు చేసే ఐస్‌తో లేనిపోని ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో పెరుగుతున్న రోగులు.. వేసవి వచ్చిందంటే పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెరుకు, పండ్ల రసాలు, లస్సీ, మజ్జిగ తదితర పానీయాలను విక్రయించే దుకాణాలు వెలుస్తాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఇలాంటి దుకాణాలు 200పైగా ఉంటాయి. ఎండ కాలంలో బయటకు వచ్చే పట్టణ వాసులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చే వారిలో కనీసం 20నుంచి 30శాతం మంది ఎక్కడో ఓ చోట కచ్చింతంగా చల్లని పానీయాన్ని పుచ్చుకుంటున్నారు. కొందరు వ్యాపారుల్లో అవగాహన లేక పానీయాల్లో చల్లదనం కోసం అపరిశుభ్ర వాతావరణంలో, కలుషిత నీటితో తయారు చేసిన ఐస్‌ను వినియోగిస్తున్నారు. అందుకే వేసవిలో ఆస్పత్రుల బాటపటే పట్టణ వాసుల సంఖ్య సుమారు 5శాతం పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఐస్‌తో ప్రమాదమే.. వాస్తవానికి పండ్ల రసాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఆయా పండ్ల రసాల్లో కలిపే ఐస్ అనారోగ్యానికి దారితీస్తోంది. జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు అపరిశుభ్రత నీటితో ఐస్ తయారీ చేసి విక్రయిస్తున్నారు. ఐస్‌లో అనేక రకాల బాక్టీరియా, క్రీముల ఉంటాయి. అవి పండ్ల రసాల్లో కలిసిపోయి జ్యూస్ ద్వారా శరీరంలోకి చేరి అనారోగ్యం కల్గిస్తాయి. రోజుల పాటు నిల్వ.. కొందరు వ్యాపారులు పండ్లను నిల్వ చేసి వాటితో జ్యూస్‌లను తయారుచేస్తున్నారు. వాటిలో వాడిపోయినవి, కుళ్లిపోయినవి ఉంటున్నాయి. వాస్తవానికి తాజా పండ్లతో అప్పటికప్పుడు రసం తయారు చేసి ఇవ్వాలి. అయితే చాలా మంది రెండు మూడు రోజులకు ఒకేసారి పెద్దమొత్తంలో రసాలు తయారుచేసి డ్రమ్ములలో నిల్వ ఉంచుతున్నారు. మరికొందరు వ్యాపారులు పండ్ల రసాల పేరుతో రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. ఐస్‌క్రీంలు, లస్సీల్లో వీటి వాడకం అధికం ఉంది. గుర్తించడం కష్టమే.. సాధారణంగా ఐస్‌ను చూడగానే ఇది మంచి నీటి తో తయారైందా లేదా అన్న విషయాన్ని మనమే కాదు.. నిపుణులు సైతం అప్పటికప్పుడు గుర్తించలేరు. ప్రస్తుతం మార్కెట్లో పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే ఐస్‌తో పాటు ఎడిబుల్ రకం అందుబాటులో ఉంది. మొదటి రకాన్ని చేప లు, మాంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు.. పండ్లు, ఇతర వస్తువులను ఎగుమతి చేసేందుకు.. ఆస్పత్రుల్లో శవాలను భద్రపరిచే మార్చురీల్లో వినియోగిస్తారు. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో పెద్ద క్యూబ్ రూ.30నుంచి రూ. 50 వరకు లభిస్తుంది. ఈ రకం ఐస్ తయారీ మం చి నీటితో, పరిశుభ్ర వాతావరణంలోనే చేయాలనే నిబంధనలు ఏమీ లేవు. ఇక ఎడిబుల్ విషయానికొస్తే ఖచ్చితంగా నియామాలను పాటించాలి. మం చి నీటినే వినియోగించాలి. కాకపోతే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో క్యూబ్ రూ. 100 నుంచి 150వరకు లభిస్తుంది. శీతల పానీయాల్లో ఎడిబుల్ ఐస్‌ను వినియోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలా మంది చిరు వ్యాపారులు ఖర్చు తగ్గించుకునేందుకు మొదటి రకం ఐస్‌ను వినియోగించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఎన్నో.. నాణ్యత లేని ఐస్‌ను వాడటంతో గొంతు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ వైరల్ జ్వరాలు తదితర ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రోటా, అడినో, హెపటైటీస్–బి వంటి వైరస్‌లతో ఊపిరితిత్తుల్లో సమస్యలు, పచ్చకామెర్లు సంభవిస్తాయి. గొంతు నొప్పి, జలుబు, దగ్గు బారిన పడతారు. రోగనిరోధక శక్తి తగ్గిపోయి నీరసంగా తయారవుతారు. చిన్నపిల్లలకు గవద బిళ్లల వ్యాధి వస్తుంది. – డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వైద్య నిపుణుడు -
ఐస్ బాక్సే కాపాడింది...
బోటు ప్రమాదంలో బయటపడ్డ నలుగురు జాలర్ల వెల్లడి కళ్లెదుటే ఇద్దరు చనిపోయారని ఆవేదన ప్రాణాలతో బయటపడతామనుకోలేదని కన్నీరుమున్నీరు రెక్కాడితే గానీ డొక్కాడని జాలర్లు వారు. గంగమ్మ ఒడే వారి జీవనాధారం. సముద్ర జలాల్లో వేట సాగితేనే జానెడు పొట్ట నిండేది. పొట్ట నింపినా.. పస్తులు పెట్టినా.. అంతా గంగమ్మపైనే భారం. కానీ ఈసారి వేటకోసం వెళ్లిన ఇద్దరు జాలర్లు ప్రమాదానికి గురయ్యారు. గంగమ్మ ఒడిలోనే తుదిశ్వాస విడిచారు. మరో నలుగురు కొన ప్రాణాలతో బయటపడ్డారు. మచిలీపట్నం/కోడూరు : సముద్ర జలాల్లో చేపల వేట కోసం వెళ్లిన జాలర్లు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. చిమ్మచీకట్లో ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో సోనా బోటు రూపంలో వచ్చిన ప్రమాదం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. మరో నలుగురిని చిమ్మచీకట్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడేలా చేసింది. బోటులో ఉన్న ఐస్‌బాక్స్ నీటిలో పడి తేలియాడటంతో దాని ఆధారంతో తాము బతికి బయటపడ్డామని సురక్షితంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సహచరుల్లో ఒకరు ఘటన జరిగిన వెంటనే చనిపోగా, మరొకరు తమతో పాటు ప్రాణాలతో పోరాడి అలసిపోయి మృతిచెందాడని వివరించారు. తాము కూడా బతికి బట్టకడతామని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషాద ఛాయలు ప్రమాద సమాచారం తెలుసుకున్న వీఆర్వో గరికిపాటి తిరుమలరావు, మెరైన్ కానిస్టేబుల్ అంకబాబు హుటాహుటిన గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. అధిక శాతం గ్రామస్తులు కోడూరు మండలం పాలకాయతిప్పలోని మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు తరలిపోవడంతో గ్రామమంతటా నిశ్శబ్ద విషాదం అలుముకుంది. కోడూరులో కేసు నమోదు పాలకాయతిప్ప మెరైన్ సీఐ సీహెచ్‌వీ మురళీకృష్ణ బాధితులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అవనిగడ్డ సీఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఎస్ఐ వై.సుధాకర్ బాధితుల వద్ద నుంచి వివరాలు సేకరించి, కొక్కిలిగడ్డ ఆదిశేషగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దినదిన గండమే... తీరప్రాంత మత్స్యకారుల జీవనం దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా మారింది. ఇదే గ్రామానికి చెందిన చేపల వేట నావ 2013 నవంబర్ 9న సముద్రంలో అలల ధాటికి తిరగబడి విరిగిపోయిన ఘటనలో ఐదుగురు గ్రామస్తులు తీవ్ర గాయలపాలై ప్రాణాలతో బయటపడ్డారు. ఇలాంటి వేట గండాలు నాగాయలంక మండల తీర గ్రామాల్లో తరచూ జరుగుతూ వారి జీవితాల్లో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. తుపానులు, అధిక వర్షాల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు. 8 గంటలు నరకయాతన రాత్రి 12 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు వీరికి ఐస్ బాక్సే ప్రాణాలు కాపాడుకునేందుకు ఆధారమైంది. గిలకలదిండి హార్బర్ నుంచి వీరి సమీపంలో సోనా బోటు వెళుతున్న విషయాన్ని బాబూరావు, హరినారాయణ, వెంకటస్వామి, ఆదిశేషారావు గమనించారు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ బాబూరావు తన శరీ రంపై ఉన్న చొక్కాను తీసి చుట్టూ తిప్పుతూ తమను రక్షించాలని వేడుకున్నాడు. ప్రమాదాన్ని పసిగట్టిన గిలకలదిండికి చెందిన ఆర్ఎస్ఎన్ బోటులోనివారు వీరిని రక్షించారు. ప్రమాదంలో గాయపడినవారికి సపర్యలు చేసి భోజనం పెట్టారు. గిలకలదిండి మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సంఘటన జరిగిందిలా... సొర్లగొందికి చెందిన వాటపల్లి వీరనారాయణ (55), కొక్కిలిగడ్డ భిక్షం (45), విశ్వనాథపల్లి బాబూరావు, నాయుడు హరినారాయణ, మోకా వెంకటస్వామి, కొక్కిలిగడ్డ ఆదిశేషారావు శనివారం ఫైబర్ బోటులో వేటకు వెళ్లారు. సోమవారం రాత్రి సముద్రంలోకి వలలు వదిలి 11 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఈ ఘటన జరిగింది. రక్షించాలని వేడుకున్నా పట్టించుకోలేదు గిలకలదిండి మెరైన్ స్టేషన్‌కు వచ్చిన మత్స్యకారుల నుంచి మెరైన్ సీఐ కె.గోవిందరాజు వివరాలు సేకరించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తమ ఫైబర్ బోటును ఢీకొట్టిన సోనా బోటు చెన్నైకి చెందినదిగా భావిస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు. తమ బోటును ఢీకొట్టిన అనంతరం సోనా బోటు వెనక్కి వెళ్లిపోయిందని, ప్రమాదం జరిగిన వెంటనే సోనా బోటులోని లైట్లను ఆపివేశారని, తాము నీటిలో మునిగిపోతున్నామని, ప్రాణాలు కాపాడాలని వేడుకున్నా పట్టించుకోకుండా ఆ బోటు వెళ్లిపోయిందని మత్స్యకారులు చెప్పారు. సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. సముద్రంలో మరణించిన ఇద్దరి మృతదేహాల ఆచూకీని కనుగొనేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినట్లు మెరైన్ పోలీసులు చెప్పారు. బోటు ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు మత్స్యకారులను మచిలీపట్నం మెరైన్ పోలీసులు సొర్లగొందికి తీసుకువెళ్లారు.