
ఐస్ బాక్సే కాపాడింది...
బోటు ప్రమాదంలో బయటపడ్డ నలుగురు జాలర్ల వెల్లడి
కళ్లెదుటే ఇద్దరు చనిపోయారని ఆవేదన
ప్రాణాలతో బయటపడతామనుకోలేదని కన్నీరుమున్నీరు
రెక్కాడితే గానీ డొక్కాడని జాలర్లు వారు. గంగమ్మ ఒడే వారి జీవనాధారం. సముద్ర జలాల్లో వేట సాగితేనే జానెడు పొట్ట నిండేది. పొట్ట నింపినా.. పస్తులు పెట్టినా.. అంతా గంగమ్మపైనే భారం. కానీ ఈసారి వేటకోసం వెళ్లిన ఇద్దరు జాలర్లు ప్రమాదానికి గురయ్యారు. గంగమ్మ ఒడిలోనే తుదిశ్వాస విడిచారు. మరో నలుగురు కొన ప్రాణాలతో బయటపడ్డారు.
మచిలీపట్నం/కోడూరు : సముద్ర జలాల్లో చేపల వేట కోసం వెళ్లిన జాలర్లు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. చిమ్మచీకట్లో ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో సోనా బోటు రూపంలో వచ్చిన ప్రమాదం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. మరో నలుగురిని చిమ్మచీకట్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడేలా చేసింది. బోటులో ఉన్న ఐస్‌బాక్స్ నీటిలో పడి తేలియాడటంతో దాని ఆధారంతో తాము బతికి బయటపడ్డామని సురక్షితంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సహచరుల్లో ఒకరు ఘటన జరిగిన వెంటనే చనిపోగా, మరొకరు తమతో పాటు ప్రాణాలతో పోరాడి అలసిపోయి మృతిచెందాడని వివరించారు. తాము కూడా బతికి బట్టకడతామని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విషాద ఛాయలు
ప్రమాద సమాచారం తెలుసుకున్న వీఆర్వో గరికిపాటి తిరుమలరావు, మెరైన్ కానిస్టేబుల్ అంకబాబు హుటాహుటిన గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. అధిక శాతం గ్రామస్తులు కోడూరు మండలం పాలకాయతిప్పలోని మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు తరలిపోవడంతో గ్రామమంతటా నిశ్శబ్ద విషాదం అలుముకుంది.
కోడూరులో కేసు నమోదు
పాలకాయతిప్ప మెరైన్ సీఐ సీహెచ్‌వీ మురళీకృష్ణ బాధితులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అవనిగడ్డ సీఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఎస్‌ఐ వై.సుధాకర్ బాధితుల వద్ద నుంచి వివరాలు సేకరించి, కొక్కిలిగడ్డ ఆదిశేషగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
దినదిన గండమే...
తీరప్రాంత మత్స్యకారుల జీవనం దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా మారింది. ఇదే గ్రామానికి చెందిన చేపల వేట నావ 2013 నవంబర్ 9న సముద్రంలో అలల ధాటికి తిరగబడి విరిగిపోయిన ఘటనలో ఐదుగురు గ్రామస్తులు తీవ్ర గాయలపాలై ప్రాణాలతో బయటపడ్డారు. ఇలాంటి వేట గండాలు నాగాయలంక మండల తీర గ్రామాల్లో తరచూ జరుగుతూ వారి జీవితాల్లో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. తుపానులు, అధిక వర్షాల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు.
8 గంటలు నరకయాతన
రాత్రి 12 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు వీరికి ఐస్ బాక్సే ప్రాణాలు కాపాడుకునేందుకు ఆధారమైంది. గిలకలదిండి హార్బర్ నుంచి వీరి సమీపంలో సోనా బోటు వెళుతున్న విషయాన్ని బాబూరావు, హరినారాయణ, వెంకటస్వామి, ఆదిశేషారావు గమనించారు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ బాబూరావు తన శరీ రంపై ఉన్న చొక్కాను తీసి చుట్టూ తిప్పుతూ తమను రక్షించాలని వేడుకున్నాడు. ప్రమాదాన్ని పసిగట్టిన గిలకలదిండికి చెందిన ఆర్‌ఎస్‌ఎన్ బోటులోనివారు వీరిని రక్షించారు. ప్రమాదంలో గాయపడినవారికి సపర్యలు చేసి భోజనం పెట్టారు. గిలకలదిండి మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు.
సంఘటన జరిగిందిలా...
సొర్లగొందికి చెందిన వాటపల్లి వీరనారాయణ (55), కొక్కిలిగడ్డ భిక్షం (45), విశ్వనాథపల్లి బాబూరావు, నాయుడు హరినారాయణ, మోకా వెంకటస్వామి, కొక్కిలిగడ్డ ఆదిశేషారావు శనివారం ఫైబర్ బోటులో వేటకు వెళ్లారు. సోమవారం రాత్రి సముద్రంలోకి వలలు వదిలి 11 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఈ ఘటన జరిగింది.
రక్షించాలని వేడుకున్నా పట్టించుకోలేదు
గిలకలదిండి మెరైన్ స్టేషన్‌కు వచ్చిన మత్స్యకారుల నుంచి మెరైన్ సీఐ కె.గోవిందరాజు వివరాలు సేకరించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తమ ఫైబర్ బోటును ఢీకొట్టిన సోనా బోటు చెన్నైకి చెందినదిగా భావిస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు. తమ బోటును ఢీకొట్టిన అనంతరం సోనా బోటు వెనక్కి వెళ్లిపోయిందని, ప్రమాదం జరిగిన వెంటనే సోనా బోటులోని లైట్లను ఆపివేశారని, తాము నీటిలో మునిగిపోతున్నామని, ప్రాణాలు కాపాడాలని వేడుకున్నా పట్టించుకోకుండా ఆ బోటు వెళ్లిపోయిందని మత్స్యకారులు చెప్పారు.
సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. సముద్రంలో మరణించిన ఇద్దరి మృతదేహాల ఆచూకీని కనుగొనేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినట్లు మెరైన్ పోలీసులు చెప్పారు. బోటు ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు మత్స్యకారులను మచిలీపట్నం మెరైన్ పోలీసులు సొర్లగొందికి తీసుకువెళ్లారు.