Ice Cream -2
-
అందుకే అలా నటించాను
కథ డిమాండ్ మేరకు గ్లామర్‌గా నటించాల్సి వచ్చిందని అంటున్నారు నటి మృదుల భాస్కర్. రాంగోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన టాలీవుడ్ చిత్రం ఐస్ క్రీం-2లో నటించిన ఈ బెంగళూరు బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌పై దృష్టి సారించారు. ఇప్పటికే వల్లినం, తిలగర్ చిత్రాల్లో నటించిన మృదుల కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. త్వరలో మరుమునై చిత్రంతో తెరపైకి రానున్నారు. కోలీవుడ్‌లో చాలా అవకాశాలు వస్తున్నాయని, అన్నీ ఒకే రకం పాత్రలు కావడంతో అంగీకరించడం లేదని అంటున్నారు. ఒక్క పాత్ర చేసినా ప్రజలకు దగ్గర కావాలనే భావిస్తానని, దానికనుగుణంగా పాత్రలు ఎంపిక చేసుకుంటున్నానని చెబుతున్నారు. ఐస్ క్రీం-2 చిత్రంలో గ్లామర్‌గా నటించడాన్ని ప్రశంసిస్తున్నారని, ఆ చిత్ర కథ డిమాండ్ మేరకు ఆ విధంగా నటించాల్సి వచ్చిందని వివరించారు. ఇకపై అంత గ్లామర్‌గా నటించే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరులో న్యాయశాస్త్రం నాలుగో సంవత్సరం చదువుతున్నానని, నృత్యంపై ఆసక్తి కారణంగా డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నానని తెలిపారు. స్కూల్‌కు సమయం కేటాయించడం వల్ల నటనకు గ్యాప్ వస్తోందని, ఇకపై అలా కాకుండా చూసుకుంటానని పేర్కొంది. -
మరో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాం
‘‘టెక్నాలజీని వినియోగించి, తక్కువ ఖర్చుతో సినిమా తీయడం రామ్‌గోపాల్‌వర్మ శైలి. ‘ఐస్‌క్రీమ్’ చిత్రం ద్వారా ఫ్లోకామ్ టెక్నాలజీని పరిచయం చేశారు. ఇప్పుడు ‘ఐస్‌క్రీమ్-2’ ద్వారా మరో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దాని గురించి త్వరలో చెబుతాం’’ అని చిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. జేడీ చక్రవర్తి, నందు, భూపాల్, నవీనా, గాయత్రి నటించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడారు ‘‘18 రోజుల్లో ఈ చిత్రాన్ని తీశాం. కానీ, వర్మగారికి సంతృప్తి అనిపించకపోవడంతో రీషూట్ చేశాం. దానివల్ల ఖర్చు పెరిగినప్పటికీ, మేం పెట్టిన పెట్టుబడి వస్తుందనే నమ్మకం ఉంది’’ ఆయన అన్నారు. పెద్ద చిత్రాలను తప్ప ఇతర చిత్రాలు ఎవరూ కొనడం లేదనీ, అందుకే యూత్‌ఫుల్ చిత్రాలైతే సేఫ్ అని ఇలాంటివి చేస్తున్నాననీ తుమ్మలపల్లి చెప్పారు. -
‘ఐస్‌క్రీమ్-2’ ఆడియో ఆవిష్కరణ
మంగళగిరి రూరల్ : రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మితమైన ఐస్‌క్రీమ్-2 చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం రాత్రి గుంటూరు జిల్లాలో వేడుకగా జరిగింది. మంగళగిరి మండలం చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ వినియోగించుకుని సినీరంగంలో రాణించాలని యువతకు సూచించారు. విజయవాడ వీధుల్లో తిరుగుతూ సినిమారంగంపై ఆసక్తి పెంచుకున్న తాను పట్టుదలతో ఇంతటి స్థాయికి ఎదిగానని చెప్పారు. తాను దేవుడిని నమ్మనని, ఎవరినీ లెక్క చేయనని తెలిపారు. మనస్సుకు నచ్చిన పనిని ఇష్టంగా చేసుకుంటూ పోతానన్నారు. తనను ఆదర్శంగా తీసుకుని యువకులు దర్శకులుగా రాణించాలని కోరారు. కార్యక్రమంలో సినీ నిర్మాత రామసత్యనారాయణ, అంబికా కృష్ణ, హీరో జేడీ చక్రవర్తి, హీరోయిన్ నవీనా, క్యారెక్టర్ ఆరిస్టులు ధనరాజ్, భూపాల్, షాలిని, డాక్టర్ సూర్యారావు, కృష్ణార్జునరావు, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, హాయ్‌ల్యాండ్ ఎండీ వెంకటేశ్వరరావు, జీఎం కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్, పాటలను ప్రదర్శించారు. -
వేలం పాటకు రెడీ
‘‘ఈ సినిమా మొత్తం అవుడ్డోర్‌లోనే తీశాం. రెండు గ్రూప్‌లు ఒక చోటకు వెళ్లినపుడు అక్కడేం జరిగింది? వాళ్లనెవరు చంపారన్నది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ‘అనుక్షణం’ తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా వేలం పాట పద్ధతిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. ఆయన దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఐస్‌క్రీమ్-2’ చిత్రం ప్రచార చిత్రాన్ని, పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘పేరుకే ఇది ఐస్‌క్రీమ్. కానీ చాలా వేడివేడిగా ఉంటుంది. వర్మతో వెంట వెంటనే రెండు సినిమాలు నిర్మించే అవకాశం రావడం నా అదృష్టం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు జేడీ చక్రవర్తి, దర్శ కులు వీరశంకర్, మారుతి, కథానాయిక నవీన తదితరులు మాట్లాడారు. -
కిస్ మి ఎవ్రీవేర్...
ఫ్లోకామ్ టెక్నాలజీతో వెండితెరపై ఓ కొత్త ఒరవడి సృష్టించిన సినిమా ‘ఐస్‌క్రీమ్’. దాని సిరీస్‌లో వస్తున్న ‘ఐస్‌క్రీమ్-2’కి ఫ్లోకామ్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడాం. సాంకేతికంగా ఈ చిత్రం ఓ విప్లవం అవుతుంది’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. జె.డి.చక్రవర్తి, నందు, నవీనా, భూపాల్, సిద్దు, శాలినీ, గాయత్రి ప్రధాన పాత్రధారులుగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘ఐస్‌క్రీమ్-2’. ‘కిస్ మి ఎవ్రీవేర్’ అనే పల్లవితో ఆద్యంతం ఆంగ్లంలో సాగే ఈ చిత్రంలోని ఏకైక గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ -‘‘అందాన్ని చూపించాలంటే ముందు చూడగలిగే హృదయం కావాలి. నాకు ఆ హృదయం ఉంది కాబట్టే ఈ పాట ఇంతబాగా వచ్చింది. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. వర్మ దర్శకత్వంలో మరిన్ని సినిమాలు తీసి, ఒకే దర్శకునితో అత్యధిక చిత్రాలు తీసిన నిర్మాతగా గిన్నిస్‌బుక్‌కి ఎక్కాలని ఉందని తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆకాంక్షించారు. ‘‘ ‘కిస్ మి ఎవ్రీవేర్’ పాట చిత్రీకరించే సమయంలో నేనున్నాను. బాగా వస్తుందనుకున్నాను కానీ, ఇంత అద్భుతంగా వస్తుందని మాత్రం అనుకోలేదు. తెరపై పాట చూసి తీయని షాక్‌కి లోనయ్యాను’’ అని జె.డి.చక్రవర్తి అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.