తెలుగు రాష్ట్రాల్లోకి ఐసీఎల్ ఫిన్‌కార్ప్
- ఏడాది ఆఖరు నాటికి పాతిక శాఖలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ఐసీఎల్ ఫిన్‌కార్ప్ తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తొలి శాఖను హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్లు సంస్థ ఎండీ కె.జి. అనిల్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పాతిక శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు, వీటిలో 15 తెలంగాణలో.. పది ఆంధ్రప్రదేశ్‌లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం దాదాపు రూ. 100 కోట్లు వెచ్చించనున్నట్లు మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.
ప్రస్తుతం కేరళ, తమిళనాడులో కలిపి మొత్తం 42 శాఖలు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్యను 100కి.. వచ్చే మూడేళ్లలో 1,000కి పెంచుకోనున్నామని అనిల్ కుమార్ వివరించారు. ప్రస్తుతం తమ వ్యాపార పరిమాణం రూ. 100 కోట్లుగా ఉండగా.. కొత్త శాఖల ఊతంతో 2020 నాటికి ఇది రూ. 5,000కు చేరగలదని అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా పసిడి రుణాలపై దృష్టి పెడుతున్నామని, అత్యంత కనిష్టంగా సుమారు తొమ్మిది శాతం వడ్డీ రేటుకే రుణాలు అందజేస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్లలో దాదాపు రూ.100 కోట్ల మేర వ్యాపారం రాగలదని అంచనా వేస్తున్నట్లు అనిల్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక, ఒడిషా తదితర రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తున్నామని, మొత్తం వెయ్యి శాఖల ఏర్పాటు కోసం రూ. 2,500 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు.