ఢిల్లీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: మధ్యాహ్న భోజనం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయమై నాలుగు వారాల్లో సమగ్ర నివేదికను అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) గురువారం నోటీసులు జారీ చేసింది. తూర్పు ఢిల్లీలోని పత్పర్గంజ్ ప్రాంతంలో ఉన్న సర్వోదయ కన్యావిద్యాలయలో చదువుతున్న 7 -14 మధ్య వయస్సు ఉన్న 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదికను అందజేయాలని ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీచేసింది. అలాగే ఘటనపై తీసుకున్న చర్యలను గురించి నివేదిక అందజేయాలని డీసీపీ(తూర్పు)ను ఆదేశించింది. ఆ రోజు విద్యార్థినులకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక పడి ఉండటం అందరూ గమనించారు. పాఠశాలకు ఈ భోజనాన్ని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ దళిత్ ఉతన్ శిక్షా సమితి సరఫరా చేస్తోంది. దీనిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినా మళ్లీ అనుమతి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.