లాభాల్లో టెలికాంషేర్లు: ఐడియా 10శాతం జంప్
ముంబై: దేశీయ టెలికాం కంపెనీల ప్రతిపాదనలకు ఇంటర్మినిస్టీరియల్ గ్రూప్ (ఐఎంజీ) ఆమోదం తెలపనుందనే అంచనాల నేపథ్యంలో టెలికాం షేర్లు వెలుగులోకి వచ్చాయి. టెలికాం సంస్థల సూచనలకు సంబంధించిన డ్రాప్ట్ను ఐఎంజీ సిద్ధం చేసిందన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. దీంతో బుల్ మార్కెట్లో ఇతర షేర్లతోపాటు టెలికాం కంపెనీ లషేర్లు కూడా భారీగా ర్యాలీ అవుతున్నాయి.
మూడు ప్రధాన ఆపరేటర్లు ఐడియా, భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.ముఖ్యంగా యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీని (యూఎస్వోఎఫ్) భారీగా తగ్గింపు లేదా రద్దు చేయనుంది. అలాగే టెలికాం ఆపరేటర్లు ప్రతిపాదించినట్టుగా లైసెన్స్ ఫీజును 8 శాతంనుంచి 6 శాతానికి తగ్గించనుందని సమాచారం. ఈ అంచనాల నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద సంస్థ ఐడియా సెల్యులార్ ఏకంగా 10 శాతంలాభపడగా, మార్కెట్ లీడర్ భారతి ఎయిర్ టెల్ 3శాతం, టాటా టెలీ 5 శాతం, ఆర్కాం 5శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.
కాగా జీఎస్టీ పన్ను 18 శాతానికి బదులుగా, ప్రస్తుతం ఉన్న 5 శాతాన్ని కొనసాగించాలని వోడాఫోన్ కోరింది. ఈ వాదనను ఐడియా కూడా సమర్ధించింది. తద్వారా లైసెన్సింగ్ ఫీజు తగ్గుతుందని పేర్కొంది. అలాగే లైసెన్స్ ఫీజును 3 శాతానికి తగ్గించాలని ఎయిర్ టెల్ ఐఎంజీ కి సూచించిన సంగతి తెలిసిందే.