జియో ఎఫెక్ట్ : ఐడియా సూపర్ ఆఫర్
రిలయన్స్ జియో దెబ్బకు కుదేలైన కంపెనీలన్నీ పోటీపడి మరీ ఆఫర్లు ప్రకటిస్తూ ఎదురుదాడిని తీవ్రతరం చేశాయి. ఇటీవలే వొడాఫోన్ స్పెషల్ రంజాన్ ప్యాక్ లు ప్రకటించగా.. మూడో టెలికాం దిగ్గజంగా పేరున్న ఐడియా సెల్యులార్ సైతం ప్రీపెయిడ్ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 396 రూపాయల రీఛార్జ్ ప్యాక్ పై ఎంపిక చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లు 70జీబీ డేటాను వరకు అందించనున్నట్టు తెలిపింది. దీంతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్ 70 రోజుల వరకు వాలిడిటీలో ఉంటుంది. దీనికింద రోజుకు 1జీబీ డేటాను అందిస్తోంది. అంతేకాక 3జీ స్పీడు ఈ డేటాను అందించనుంది. ఈ డేటా ప్యాక్ రిలయన్స్ జియో రూ.309 కు పోటీగా ఉందని తెలుస్తోంది.
ఈ కొత్త రీఛార్జ్ ప్యాక్ పై పొందే అపరిమిత కాలింగ్ సౌకర్యాలు కేవలం ఐడియా టూ ఐడియా కస్టమర్లకు మాత్రమే. ఇతర నెట్ వర్క్ లకు 3000 నిమిషాల ఎస్టీడీ, లోకల్ కాల్స్ ను అందిస్తోంది. అంటే రోజుకు 300 నిమిషాలను మాత్రమే వాడుకోవడానికి వీలుంది. ఒకవేళ ఈ పరిమితిని మించితే నిమిషానికి 30 పైసలు వసూలు చేయనున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. టెలికాం మార్కెట్లో పెరుగుతున్న పోటీతో కొత్త ఆపరేటర్ జియోకు కౌంటర్ గా ఆపరేటర్లు డేటా టారిఫ్ లను ప్రకటిస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. ఇటీవలే రిలయన్స్ జియో రికార్డు సృష్టిస్తూ డేటా స్పీడులో ఆల్ స్పీడు హైలో నిలిచింది. అయితే ఐడియా ఈ ప్యాక్ పై ఎలాంటి ప్రమోషన్ చేయడం లేదు. ఒకవేళ ఈ ఆఫర్ తమ నెంబర్ కు అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడం కోసం యూజర్లు కస్టమర్ కేర్ కు కాల్ చేయాల్సిందేనట.