Ideal farmer
-
పండించారు... వడ్డించారు!
రైతుకు కొత్త నిర్వచనం కావాలి. వ్యవసాయానికి కొత్త అర్థం చెప్పాలి. మహిళ సాగు చేస్తే నేల పులకిస్తుంది. గాజుల చేతిలో గరిటే కాదు... నాగలి కూడా గర్వంగా చాలుదీరుతుంది. అనంతపురంలో మహిళలు ‘ఆదర్శసాగు’ చేస్తున్నారు. ఆరోగ్యం కోసం ఏం తినాలో ఎలా తినాలో నేర్పిస్తున్నారు. దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు. వినడానికి బావుంటుంది. దేశానికి కంచంలో అన్నంగా మారేది గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలే... కాబట్టి గ్రామానికి, రైతుకి అంతటి గుర్తింపు వచ్చింది. మరి అదే పొలం రైతుకి సమాధి అవుతుంటే వ్యవసాయం బతికి బట్టకట్టేదెలా? నాగలి కర్రు రైతు గుండెను చీలుస్తుంటే భూమిలో బంగారం పండేదెప్పుడు? రైతు వాణిజ్య పంటల మాయలో పడి అప్పుల పాలైతే ఆ రైతుని, ఎరువులతో కలుషితమైన ఆ భూమిని కాపాడేదెవరు? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే కసితో రైతు మహిళలు ఆ పనిని చేపట్టారు. భర్తను మింగేసిన పంటపొలాల్లోనే భవితను వెతుక్కుంటున్నారు. సంఘటితంగా వ్యవసాయం చేస్తూ దిగుబడితో లాభాలు కళ్ల చూస్తున్నారు. ఇది అనంతపురంలోని మహిళలు సాధించిన విజయం. వాళ్లకు దారి చూపిన భానుజ సంకల్పం. అనంతపురం జిల్లా, రూరల్ మండలం, కురుగుంట్ల గ్రామం. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలను చూసిన గ్రామం. ఇప్పుడు ఆ రైతు కుటుంబాల మహిళలు నిర్వహిస్తున్న రెస్టారెంట్‌ను చూస్తోంది. ఆ రెస్టారెంట్లో వంటకు అవసరమైన ధాన్యాలను పండిస్తున్న వ్యవసాయ క్షేత్రాలను చూస్తున్నారు. ఈ విజయాన్ని ‘చెరువు భానుజ’... సాక్షితో పంచుకున్నారు. ‘ఒంటరి’ పోరాటం! ‘‘భర్త వాణిజ్య పంటలతో నష్టాల ఊబిలో కూరుకుపోయి, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే... అగమ్యగోచరంగా, అచేతనంగా మిగిలిన వాళ్లకు అండగా నిలిచాను. సింగిల్ పేరెంట్‌గా పిల్లల పోషణ బాధ్యతను మోస్తున్న మహిళలే వీరంతా. భర్తను కోల్పోయిన వాళ్లకు తక్షణ సహాయం చేస్తూ, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం కోసం కార్యాలయాలకు వెళ్లి పని చేయించడం వరకు తోడుగా ఉంటున్నాను. అంతటితో ఆ కుటుంబం గట్టెక్కదు. ఉపాధి కావాలి, వాళ్లకు వచ్చిన పని వ్యవసాయమే. అయితే పొలం లేదు. దాంతో కలెక్టివ్ ఫార్మింగ్ కోసం పొలం లీజుకు తీసుకున్నాం. వ్యవసాయ క్షేత్రాలకు ‘పుడమి తల్లి, మన భూమి’ అని పేర్లు పెట్టుకుని సేద్యం మొదలు పెట్టాం. తక్కువ ఖర్చుతో పంట చేతికి రావడానికి మిల్లెట్స్ సాగు, ఏడాది పొడవుగా రాబడి కోసం కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నాం. మా ప్రయాణంలో అసలైన టర్నింగ్ పాయింట్ ఇక్కడే. పంటతో ఆపేయకుండా వంట కూడా మొదలుపెట్టాం. మార్కెట్ పుట్టింది! హరిత విప్లవంతో మనదైన సాగు కనుమరుగైంది. మిల్లెట్స్ సాగు మర్చిపోయాం, విత్తనాలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఇక ఈ వంటల గురించి ఈ తరానికి తెలియనే తెలియదు. ప్రభుత్వ సంస్థల సహకారంతో విత్తనాలు సేకరించాను. సేద్యం తెలిసిన మహిళలు కావడంతో సాగులో పెద్దగా ఇబ్బందులు రాలేదు. కానీ వీటిని ఎలా వండాలో నేర్పించడానికి మాస్టర్ షెఫ్‌లతో శిక్షణ ఇప్పించి మరీ కురుకుంట్లలో రెస్టారెంట్ పెట్టాం. రెస్టారెంట్ పెట్టడానికి ముందు ఆ ఊరిని డయాబెటిక్ ఫ్రీ విలేజ్‌గా మార్చాలనే సంకల్పంతో ఉచితంగా వండిపెట్టాం. డైటీషియన్లు సూచించినట్లు చిరుధాన్యాల వంటలను మూడుపూటలా తినాల్సిన మెనూను వండి వడ్డించాం. నాలుగవ వారానికి షుగర్ లెవెల్స్ అదుపులోకి రావడాన్ని స్వయంగా తెలుసుకున్నారు పేషెంట్లు. మిల్లెట్స్ పట్ల గ్రామస్థుల్లో అవగాహన కోసం చేసిన ప్రయత్నం అది. అయితే ఆ భోజనం తిన్న వాళ్లు, తెలిసిన వాళ్లు రెస్టారెంట్ పెట్టమని సూచించారు. మా మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకొచ్చారు. అలా రెండు నెలల కిందట ‘పుడమి తల్లి మిల్లెట్ హోటల్’ ప్రారంభమైంది. ‘ఆర్థిక భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత’ మా ట్యాగ్‌లైన్. ఊహించనంత గొప స్పందన వచ్చింది. ఆఫీసర్లు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. హోటల్ అనేక ప్రదేశాల్లో శాఖలు తెరవమని అడుగుతున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే హోటల్ మరో శాఖ ప్రారంభం కావాలంటే అందుకు తగిన వ్యవసాయ క్షేత్రాన్ని విస్తరించాలి. ఇప్పుడు మేము సాగు చేస్తున్న పొలంలో సహజమైన సేంద్రియ పద్ధతుల్లో పండినవే మా రెస్టారెంట్లో వండుతున్నాం. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నాలుగు శాఖల్లో మొత్తం 1800 మంది రైతుమహిళలు మాతో సంఘటితమై ఉన్నారు. వారందరికీ ఉపాధిమార్గాల అన్వేషణ కోసం విస్తృతంగా పని చేయాల్సి ఉంది. వెలుగు పుట్టింది! ‘సూర్యోదయం అవుతున్నప్పుడు పుట్టింది, ఇంటికి వెలుగు తెస్తుంద’ని... మా నాన్న నాకు భానుజ అని పేరు పెట్టారు. మాది అనంతపురం జిల్లా, నల్లమాడ మండలం, బడవాండ్ల పల్లి. నాన్న చదువుకున్నది తక్కువే, కానీ కమ్యూనిస్ట్ నేపథ్యంలో చాలా నేర్చుకున్నారాయన. పాటలు రాసి పాడేవారు. చిన్నప్పుడు నాన్నతో సమావేశాలకు వెళ్లేదాన్ని. ఆ జ్ఞానమే నన్ను ఇలా తీర్చిదిద్దింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు, సందర్శనకు వచ్చన అధికారులకు మా హాస్టల్లో వసతులలేమిని చెప్పే ధైర్యం ఉండేది. టెన్త్ చదువుతూనే యంగ్ ఇండియా సంస్థలో వాలంటీర్‌గా పని చేశాను. అమ్మ పట్టుపట్టి ఇంటర్లో చదువాపించి మరీ పెళ్లి చేసింది. కానీ నేను గృహిణిగా ఇంటికే పరిమితం కాకుండా సామాజిక కార్యకర్తనయ్యాను. మహిళలు, పిల్లలు, దళితుల ఉన్నతి కోసం పని చేయాలనే ఉద్దేశంతో 1996లో రెడ్స్ స్థాపించాను. ట్రాఫికింగ్‌కి గురైన మహిళలను కాపాడడం నుంచి, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, ఉమ్మడి అటవీ సంరక్షణ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పని చేశాను. మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన ఏజెంట్లు కదిరిలో నా ఇంటిని కాల్చేశారు. దాంతో నా నివాసం అనంతపూర్ పట్టణానికి మారింది’’ అని తన సమాజ సేవాయాత్రను వివరించారు భానుజ. – వాకా మంజులారెడ్డి -
10% నీటితోనే వరి, చెరకు సాగు!
వరి, చెరకు, అరటి.. అత్యధికంగా సాగు నీరు అవసరమయ్యే పంటలివి. అయితే, సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కేవలం 10% నీరు, 10 శాతం విద్యుత్తు, 5% (దేశీ వరి) విత్తనంతోనే సాగు చేస్తూ కరువు కాలంలోనూ సజావుగా దిగుబడి తీస్తున్న విలక్షణ రైతు విజయరామ్. వికారాబాద్ సమీపంలో రెండేళ్లుగా కరువుతో అల్లాడుతున్న తన వ్యవసాయ క్షేత్రంలో అతి తక్కువ నీరు, విద్యుత్తు, విత్తనంతో అనేక రకాల దేశీ వరి వంగడాలు, చెరకు, అరటితోపాటు కందిని ఆయన సాగు చేస్తున్నారు. ఈ క్షేత్రాన్ని ఇటీవల పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు సూచనలిచ్చారు.ఆ ప్రాంతంలో రెండేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అతి తక్కువ నీటితో వరి, చెరకు, అరటి, కంది తదితర పంటలు సాగు చేస్తుండటం విశేషం. మిఠాయిల వ్యాపారి అయిన విజయరామ్ ఎనిమిదేళ్ల క్రితం రాజమండ్రిలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పాఠాలు విని పొందిన స్ఫూర్తితో ఆవులు, పొలం కొని ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరులో సౌభాగ్య గోసదన్‌ను ఏర్పాటు చేసి 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. పాలేకర్ చేత 6 వేల మంది రైతులకు శిక్షణ ఇప్పించిన ఆయన 200 రకాల దేశీ వరి వంగడాలను సేకరించి, కొన్ని ఎంపిక చేసిన రకాలను సాగు చేస్తున్నారు. గత ఏడాది వికారాబాద్ మండలం ధారూర్ మండలం బూరుగడ్డ గ్రామంలో 43 ఎకరాల నల్లరేగడి వ్యవసాయ భూమిని గత ఏడాది కొనుగోలు చేశారు. 35 ఏళ్లు రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఈ నేలలో ఘనజీవామృతం, జీవామృతం, ఆచ్ఛాదన తదితర పద్ధతులను పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఇటీవల సుభాష్ పాలేకర్ ఈ క్షేత్రాన్ని సందర్శించి, వాతావరణ మార్పులను తట్టుకొనేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతే శరణ్యమనడానికి 10% నీరు, 10% విద్యుత్తుతోనే వరి, చెరకు, అరటి పంటలను విజయరామ్ సాగు చేస్తుండటమే నిదర్శనమని ప్రశంసించారు. రైతులు తలా ఒక ఎకరంలో ఈ పద్ధతిలో సాగు చేసి ఫలితాలు స్వయంగా సరిచూసుకోవచ్చన్నారు. ఆరు తడి దేశీ వరిలో అంతర పంటలు ప్రత్యేకతలు, పంటకాలం, దిగుబడి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రత్నచోడి, తులసిబాసో, బహురూపి, మాపిలైసాంబ, చెకో, మైసూర్ మల్లిగా, నారాయణ కామిని, నవారా, కర్పుకొని వంటి దేశీ వరి రకాలను కొన్ని మడుల్లో విజయరామ్ ఈ ఖరీఫ్‌లో సాగు చేశారు. కొన్ని వరి రకాల్లో అంతర పంటలు వేశారు. అంతర పంటలు వేయని వరి రకాల్లో సాళ్లకు, మొక్కలకు మధ్య అడుగున్నర దూరం పెట్టారు. అంతర పంటలు వేసిన వరి పొలంలో వరుసల మధ్య 3 అడుగుల దూరం పెట్టారు. బురద పొలంలో ఎకరానికి 100–200 కిలోల ఘన జీవామృతం వేస్తారు. అవకాశం ఉన్న రైతులు ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం వేస్తే మరీ మంచిది. భూమిలో తేమను పట్టి ఉంచడానికి, పంట త్వరగా బెట్టకు రాకుండా ఉండటానికి ఘనజీవామృతం చాలా ఉపయోగపడుతుందని, సకల పోషకాలూ అందుతాయని విజయరామ్ వివరించారు. 14–15 రోజులు పెంచిన నారును కుదురుకు ఒకే మొక్కను నాటుతారు. వరికి 20 రోజులకో తడి రత్నచోడి వరిలో నాటిన పొలంలోనే తోటకూర జాతికి చెందిన అమరంతస్ ధాన్యపు పంటను అంతర పంటగా వేశారు. నెల క్రితమే రత్నచోడి కోతలు పూర్తవగా ఇప్పుడు అమరంతస్ కోతకు సిద్ధమవుతోంది. కర్పుకౌని దేశీ వరిలో సాళ్లు/మొక్కల మధ్య 2 అడుగుల దూరం పెట్టారు. గతంలో వేరు శనగను అంతరపంటగా వేశారు. అయితే, అక్టోబర్‌లో శనగను అంతర పంటగా వేసి ఉంటే నత్రజని బాగా అందేదని పాలేకర్ సూచించారు. మాపిళ్లైసాంబ రకం ఆరు తడి వరిలో దుబ్బుకు 40–60 పిలకలు వచ్చాయి. ఆరు తడి పంటకు 20 రోజులకు ఒకసారి నీటి తడి ఇచ్చామని విజయరామ్ తెలిపారు. పాలేకర్ సూచించిన విధంగా వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అక్టోబర్‌లో శనగను వరిలో అంతర పంటగా వేస్తామన్నారు. ఆరుతడిగా సాగు చేయడం వల్ల వరిలోనూ ఎద్దులతో 2,3 సార్లు గుంటక తోలటం ద్వారా కలుపు ఖర్చును తగ్గించుకోవడం సాధ్యమైందని అన్నారు. గన్నీ బాగ్స్‌ను కూడా ఆచ్ఛాదనగా వాడొచ్చు 6 అడుగుల దూరంలో కర్పూర అరటి, చెక్కర కేళిలను 20 రోజులకోసారి తడి ఇస్తూ సాగు చేస్తున్నారు. గడ్డీ గాదాన్ని సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేశారు. మొక్కల మొదళ్లలో తేమ ఆరినా.. ఆచ్ఛాదన అడుగున తేమ బాగా ఉంటున్నదని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉన్న ఏ సేంద్రియ పదార్థాన్నయినా ఆచ్ఛాదనగా వేయొచ్చునని పాలేకర్ అన్నారు. కందికి ఒకసారే జీవామృతం మచ్చల కంది సహా ఆదిలాబాద్‌కు చెందిన నాటు రకాల కందులను 7 అడుగుల దూరంలో సాళ్లుగా, అర అడుగుకు ఒక విత్తనం పడేలా నాగళ్లతో ఎకరంన్నర నల్లరేగడి భూమిలో విత్తారు. విత్తనానికి ముందు ఎకరానికి 200 కిలోల వరకు ఘనజీవామృతం వేశారు. ద్రవజీవామృతం ఒకేసారి అందించగలిగామని, అయినా కంది విరగ కాసిందని, చెట్టుకు అరకేజీ వరకు దిగుబడి రావచ్చని విజయరామ్ తెలిపారు. 4.5 నెలల్లో చెరకుకు ఒకే తడి ఎకరం భూమిలో విజయరామ్ అతి తక్కువ నీటితో చెరకును సాగు చేస్తున్నారు. నాలుగున్నర నెలల క్రితం సాళ్ల మధ్య 8 అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరంలో చెరకు ముచ్చెలు నాటారు. అంతర పంటలుగా కాకర, లంక దోస నాటారు. దీంతో తోటలో ఎక్కడా నేల కనపడకుండా కాకర తీగలు అల్లుకుపోయాయి. ఇప్పటికి కేవలం 2 సార్లు జీవమృతం ఇచ్చారు. గత నెలలో ఒకే సారి నీటి తడి ఇచ్చినప్పటికీ తోట బెట్టకు రాకపోవడం విశేషం. అయితే, చెరకు సాళ్ల మధ్య అలసంద కూడా వేయటం అవసరమని, నత్రజని లోపం రాకుండా ఉంటుందని పాలేకర్ సూచించారు. ఇప్పటికైనా అలసంద గింజలు వేయమని సూచించారు. ఆచ్ఛాదనకు కాదేదీ అనర్హం ప్రకృతి వ్యవసాయంలో జీవామృతంతోపాటు అంతరపంటలు, ఆచ్ఛాదన కూడా రైతులు పాటించాల్సిన చాలా ముఖ్య అంశమని పాలేకర్ అన్నారు. చెరకు పిప్పి, కొబ్బరి బొండం డొక్కలు, కొబ్బరి మట్టలు, గడ్డీ గాదంతోపాటు వ్యాపారుల వద్ద తక్కువ ధరకు లభించే వాడేసిన గన్నీ బ్యాగులు, పాత నూలు వస్త్రాలు సైతం ఆచ్ఛాదనగా వేయొచ్చని అన్నారు. తీవ్ర కరువులోనూ రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేసిన పంటలు ఎండిపోతుంటే.. ప్రకృతి వ్యవసాయదారుల పంటలు కళకళలాడుతుండటం రైతులంతా గుర్తించాలన్నారు. దేశీ వరి వంగడాలను దిగుబడి దృష్ట్యా కాకుండా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా సాగు చేస్తూ పరిరక్షించుకోవడం అవసరమని అంటున్న విజయరామ్ను 040–27635867, 99491 90769 నంబర్లలో సంప్రదించవచ్చు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ 7 అడుగులు పెరిగిన కంది చేనులో విజయరామ్, చెరకు తోటలో దట్టంగా అల్లుకున్న కాకర తీగలు, అరటి తోటలో పాలేకర్ -
ఏఏఈవోల సర్వీస్ రూల్స్ ఖరారు
వేతనం రూ. 16,400గా నిర్ణయించిన వ్యవసాయ శాఖ సర్కార్ ఆమోదించాక భర్తీకి నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: త్వరలో నియమించనున్న సహాయ వ్యవసాయ విస్తరణాధికారు (ఏఏఈవో)ల సర్వీస్‌రూల్స్‌ను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. వారికి వేతనస్కేల్ రూ. 16,400 ఉండాలని నిర్ణయించింది. ఆదర్శరైతు వ్యవస్థ స్థానే ఏఏఈవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వ్యవసాయశాఖ ఈ సర్వీస్‌రూల్స్ తయారు చేసింది. ఈ పోస్టులకు శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని కూడా నిర్ణయించింది. సర్వీస్‌రూల్స్‌పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నాక సాధ్యమైనంత త్వరలో నోటిఫికేషన్ జారీచేస్తామని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జూనియర్ అసిస్టెంట్ కేడర్‌తో నియామకం రాష్ట్రంలో మొత్తం 4,442 సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులను భర్తీచేస్తారు. అందులో 90 శాతం వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా పూర్తిచేసిన వారికి, 10 శాతం అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసిన వారికి కేటాయించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అలాగే ఆ మొత్తం పోస్టుల్లో 10 శాతం ప్రత్యేకంగా ఉద్యానశాఖకు కేటాయించనున్నారు. ఈ నియామకాలన్నీ జూనియర్ అసిస్టెంట్ కేడర్‌స్థాయి స్కేల్‌తో నియమించాలని సర్వీస్‌రూల్స్‌లో ప్రతిపాదించారు. దీంతో ఏఏఈవోలకు రూ. 16,400 పేస్కేల్ ఉంటుందని తేలింది. జిల్లాస్థాయి ఎంపిక కమిటీని ఏర్పాటు చేసి కలెక్టర్, జిల్లా వ్యవసాయశాఖాధికారి ఆధ్వర్యంలో మెరిట్‌ప్రాతిపదికన నియమిస్తారు. రిజర్వేషన్లు పాటిస్తారు. ప్రొబేషన్కాలం, శిక్షణ, బదిలీలు, పదోన్నతి, పెన్షన్రూల్స్ ఎలా ఉండాలో కూడా నిర్ణయించారు. పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా సర్వీస్‌రూల్స్‌కు ప్రభుత్వం సవరణలు చేసే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు.