ఏఏఈవోల సర్వీస్ రూల్స్ ఖరారు | Rules dictate AAEO Service | Sakshi
Sakshi News home page

ఏఏఈవోల సర్వీస్ రూల్స్ ఖరారు

Published Sat, Dec 6 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

Rules dictate AAEO Service

  • వేతనం రూ. 16,400గా నిర్ణయించిన వ్యవసాయ శాఖ
  • సర్కార్ ఆమోదించాక భర్తీకి నోటిఫికేషన్
  • సాక్షి, హైదరాబాద్: త్వరలో నియమించనున్న సహాయ వ్యవసాయ విస్తరణాధికారు (ఏఏఈవో)ల సర్వీస్‌రూల్స్‌ను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. వారికి వేతనస్కేల్ రూ. 16,400 ఉండాలని నిర్ణయించింది. ఆదర్శరైతు వ్యవస్థ స్థానే ఏఏఈవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వ్యవసాయశాఖ ఈ సర్వీస్‌రూల్స్ తయారు చేసింది. ఈ పోస్టులకు శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని కూడా నిర్ణయించింది. సర్వీస్‌రూల్స్‌పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నాక సాధ్యమైనంత త్వరలో నోటిఫికేషన్ జారీచేస్తామని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
     
    జూనియర్ అసిస్టెంట్ కేడర్‌తో నియామకం

    రాష్ట్రంలో మొత్తం 4,442 సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులను భర్తీచేస్తారు. అందులో 90 శాతం వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా పూర్తిచేసిన వారికి, 10 శాతం అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసిన వారికి కేటాయించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అలాగే ఆ మొత్తం పోస్టుల్లో 10 శాతం ప్రత్యేకంగా ఉద్యానశాఖకు కేటాయించనున్నారు. ఈ నియామకాలన్నీ జూనియర్ అసిస్టెంట్ కేడర్‌స్థాయి స్కేల్‌తో నియమించాలని సర్వీస్‌రూల్స్‌లో ప్రతిపాదించారు.
     
    దీంతో ఏఏఈవోలకు రూ. 16,400 పేస్కేల్ ఉంటుందని తేలింది. జిల్లాస్థాయి ఎంపిక కమిటీని ఏర్పాటు చేసి కలెక్టర్, జిల్లా వ్యవసాయశాఖాధికారి ఆధ్వర్యంలో మెరిట్‌ప్రాతిపదికన నియమిస్తారు. రిజర్వేషన్లు పాటిస్తారు. ప్రొబేషన్‌కాలం, శిక్షణ, బదిలీలు, పదోన్నతి, పెన్షన్‌రూల్స్ ఎలా ఉండాలో కూడా నిర్ణయించారు. పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా సర్వీస్‌రూల్స్‌కు ప్రభుత్వం సవరణలు చేసే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement