idhi naa Love Story
-
చాలా విరామం తరువాత వస్తున్నా..
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ‘నేను చాలా విరామం తరువాత మంచి కథతో తీసిన సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను’ అని యువ కథానాయకుడు తరుణ్ అన్నారు. పి.బి.సిద్ధార్థ కళాశాల విద్యార్థులతో బుధవారం సాయంత్రం ఆయన సందండి చేశాడు. ఇది నా లవ్ స్టోరీ చిత్రం ప్రమోషన్లో భాగంగా తరుణ్ విద్యార్థులతో ముచ్చటించారు. గతంలో నటించిన ‘నువ్వే నువ్వే’ చిత్రం మాదిరిగానే ఈ చిత్రంలో కూడా కామెడీ, డైలాగ్స్, ఎమోషన్స్ సన్నివేశాలు ఉంటాయని వివరించారు. ఇప్పటికే సినిమా పాటలు విడుదల అయ్యాయని, పాటలు విన్నారా అంటూ విద్యార్థులను అడిగారు. పాటల్లో ఏ పాట బాగా నచ్చిందో చెప్పాలంటూ అడగ్గా ఏ నిమిషంలో నిను చూశానో అనే పాట నచ్చిందంటూ విద్యార్థులు చెప్పారు. కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా చూడదగిన మంచి ప్రేమ కథా చిత్రమని తరుణ్ అన్నారు. డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తరుణ్‌ను కొత్తగా చూస్తారని, సినిమాను చూసే సమయంలో ప్రతి విద్యార్థి తనను తాను ఈ సినిమాలో చూసుకుంటారని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్‡ శ్రీనాథ్ విజయ్, కెమెరామెన్ కిస్టోఫర్, పీఆర్ఓ సతీష్ పాల్గొన్నారు. తరుణ్‌తో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరో
బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా తన మార్క్ చూపించిన నటుడు తరుణ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో ఆకట్టుకున్నా.. తరువాత ఆ ఫాంను కొనసాగించటంలో ఫెయిల్ అయ్యాడు తరుణ్. దీంతో సినిమాలు తగ్గించేసి వ్యాపారాల మీద దృష్టి పెట్టాడు. ఇది నా లవ్ స్టోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న తరుణ్, త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారట. తల్లి కోరిక మేరకు పెళ్లి అంగీకరించిన తరుణ్ ఈ ఏడాదిలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. రమేష్ గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఇది నా లవ్ స్టోరి సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాలో కోలీవుడ్ నటి ఓవియా తరుణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. -
ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం!
లవర్‌బోయ్ ఇమేజ్‌తో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ చాలా కాలం విరామం తర్వాత ఓ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేశ్-గోపి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’. ఎస్.వి.ప్రకాశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తరుణ్ మాట్లాడుతూ- ‘‘తక్కువ బడ్జెట్లో రూపొంది, భారీ వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. మంచి రొమాంటిక్ కామెడీ మూవీ ఇది’’ అని చెప్పారు. ‘‘ఒక అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామన్నది కాదు, ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం. అదే ఈ సినిమాలో చెబుతున్నాం’’ అని దర్శకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కథానాయిక ఓవియా, నిర్మాత ఎస్.వి.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.