బోర్డు తిప్పేసిన 'ఐఐపీఎం'
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
హైదరాబాద్ : బీబీఏ, ఎంబీయే కోర్సులంటూ ఆర్భాటపు ప్రకటనలు ఇచ్చి విద్యార్థులను ఆకర్షించి వారి నుంచి లక్షలకొద్దీ ఫీజుల రూపేణా వసూలు చేసిన ఓ ప్రైవేటు విద్యా సంస్థ చివరికి బిచాణా ఎత్తేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన నగరంలోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌కు చెందిన ఐఐపీఎం అనే విద్యా సంస్థ బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలంటూ సుమారు 29 మంది విద్యార్థుల నుంచి రూ.79 లక్షల మేర వసూళ్లు చేసింది. ఏడాది నుంచి విద్యార్థుల దగ్గర డబ్బు వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేసింది. దీంతో మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు నిర్వాహకులు సాయినాథ్ యాదవ్, లోకేశ్రెడ్డిలను శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
ఫీజుల రూపేణా భారీగా డబ్బులు చెల్లించిన బాధిత విద్యార్థులు శనివారం సాయత్రం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఐఐపీఎం నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత షఫీయుద్దీన్, ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ మండె గోవర్ధన్‌రెడ్డి అనుచరులు శుక్రవారం అర్ధరాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చి హల్ చల్ సృష్టించినట్టు తెలిసింది.
(పంజాగుట్ట)