IIT-Delhi
-
సంకల్ప బలమే సబల విజయం
కోపం వస్తే కొందరు ఏంచేస్తారు? దగ్గర్లో ఉన్న వస్తువును నేలకేసి బాదుతారు. మరింత ముందుకు వెళ్లి తమకు తాము హాని చేసుకుంటారు. ప్రతికూలత ప్రతిధ్వనించే కోపాన్ని శక్తిగా మలుచుకుంటే అద్భుతాలు సాధించలేమా! ‘అప్నా క్లబ్’ కో–ఫౌండర్, సీయీవో శ్రుతి విజయగాథ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది... శ్రుతికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అయితే అది అకారణ కోపం మాత్రం కాదు. ‘నీకు ముగ్గురూ ఆడపిల్లలేనా. అయ్యో!’ అని తన తండ్రి దగ్గర ఎవరో వాగినప్పుడు... ‘ఈ అమ్మాయిలకు మ్యాథ్స్ బొత్తిగా రాదు’ ‘కాలేజీలో సైన్స్ జోలికి వెళ్లవద్దు. ఏదైనా తేలికపాటి సబ్జెక్ట్ తీసుకోండి’ అని క్లాసు టీచర్ ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు... ‘అలా గట్టిగా నవ్వుతావేమిటీ? ఆడపిల్లను అనే విషయం మరిచావా’ అని బంధువు ఒకరు అన్నప్పుడు... ఆమెకు కట్టలు తెచ్చుకునేంత కోపం వచ్చేది. అయితే ఆ కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తనకు తెలుసు. ‘ఆడపిల్లలకు మ్యాథ్స్ రాదు’ అని వెక్కిరింపు శ్రుతిలో పట్టుదలను పెంచి ఐఐటీ–దిల్లీ వరకు తీసుకెళ్లింది. అయితే అక్కడ కూడా లింగవివక్ష రకరకాల రూపాల్లో వెక్కిరించేది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు ‘ఇక్కడ ఆడవాళ్లకు ఏం పని?’ ‘స్కోర్ జీరో బ్యాచ్’ ఇలా ఎన్నో వెక్కిరింపులు వినిపించేవి. తన స్నేహితులతో కలిసి ఎన్నో కప్పులు గెలుచుకొని ఆ వెక్కిరింపులకు గట్టి సమాధానం చెప్పింది శ్రుతి. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగప్రస్థానం మొదలైంది. అయితే అక్కడ కూడా ఏదో రకమైన వివక్షత కనిపించేది. ఆ తరువాత కాలంలో... ఉద్యోగం వద్దనుకొని ఒక స్వచ్ఛంద సంస్థలో చేరింది శ్రుతి. అక్కడ మనసు ప్రశాంతంగా అనిపించింది. తన గురించి తాను తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం వచ్చింది. ‘ప్రయాణించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. సాధించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి’ అనే ఎరుక ఆమెలో కలిగింది. ‘నువ్వు ఎంబీఏ చేస్తే రాణించగలవు’ అని అక్కడ ఒకరు సలహా ఇచ్చారు. అలా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్‌బీఎస్)లో చేరింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో టూర్ అండ్ ట్రావెల్ స్టార్టప్‌ను ఆరంభించింది. ఈ స్టార్టప్ నష్టాలు మిగల్చడంతో పాటు విలువైన పాఠాలు నేర్పింది. ఆ పాఠాల వెలుగులో మరో ప్రయాణం మొదలుపెట్టింది శ్రుతి. చిన్న పట్టణాలలో ప్రజలు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్ట్స్ కొనడానికి ఆసక్తిగా ఉన్నారనే విషయం అర్థమైన తరువాత మనీష్ కుమార్‌తో కలిసి ‘అప్నాక్లబ్’ అనే ఎఫ్ఎంసీజీ ప్లాట్‌ఫామ్‌ను బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ఒక రేంజ్లో సక్సెస్ అయింది. శ్రుతిలో ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ప్రపంచానికి తెలిసాయి. ‘అప్నాక్లబ్’ బ్యాకర్స్ జాబితాలో టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, వైట్‌బోర్డ్ క్యాపిటల్... మొదలైన సంస్థలు ఉన్నాయి. ‘శ్రుతి గొప్ప సంకల్పబలం ఉన్న వ్యక్తి’ అని ప్రశంసిస్తున్నారు వైట్‌బోర్డ్ క్యాపిటల్ పార్ట్నర్ అన్షు ప్రషర్. నిజమే కదా... ‘ఆడపిల్లలకు లెక్కలు రావు’ అనే వెక్కిరింపును సవాలుగా తీసుకొని సంకల్పబలంతో గణితంలో ప్రతిభ ప్రదర్శించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకునే రోజుల్లో అదృశ్య వివక్షను ఖాతరు చేయకుండా ముందడుగు వేయడానికి ఆ సంకల్పబలమే ఉపయోగపడింది. స్టార్టప్ యాత్రలో కూడా కామెంట్స్ రూపంలో లింగవివక్షత కనిపించినా, ధైర్యం కోల్పోకుండా ఉండడానికి ఆ సంకల్ప బలమే ఉపయోగపడింది. ఎక్కడో మొదలైన సంకల్పబలం ‘అప్నా క్లబ్’ వరకు తనతోనే ఉంది. చీకటి కమ్ముతున్నప్పుడు వెలుగును ఆయుధంగా ఇచ్చింది. ఓటమి వెక్కిరించినప్పుడు గెలుపును ఆయుధంగా ఇచ్చింది. ‘కోపం ఉన్న ఆడవాళ్లను జనాలు అసౌకర్యంగా చూస్తారు. మగవాళ్ల విషయానికి వస్తే యాంగ్రీ యంగ్‌మెన్ అని మురిసిపోతారు’ అంటూ నవ్వుతుంది శ్రుతి. తనను ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడం కంటే ‘ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడానికే శ్రుతి ఇష్టపడుతుంది. చిన్నప్పుడు తండ్రి ఒకరోజు అడిగాడు... ‘మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు స్కోర్ చేయాలో తెలుసా?’ ‘నన్ను నమ్మండి’ అన్నది శ్రుతి. అప్పటినుండి తనపై తనకు ఉన్న నమ్మకాన్ని, ఇతరులకు తనపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు శ్రుతి. -
దేశంలో మీ కోసం అపారమైన అవకాశాలు ఉన్నాయి: మోదీ
-
'కరోనా తర్వాత ప్రపంచం భిన్నంగా'
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచంలో టెక్నాలజీ, ఆవిష్కరణలు ప్రధానపాత్ర పోషిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 51వ కాన్వొకేషన్ వేడుకకు మోదీ ముఖ్య అతిధిగా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 'కోవిడ్ తర్వాత ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. సాంకేతికత అందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మహమ్మారి రోజూవారీ జీవన విధానంలో ఎన్నో మార్పులు తెచ్చింది. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇప్పుడు వర్కింగ్ రియాలిటీగా మారుతున్నాయి. గ్లోబలైజేషన్ ముఖ్యం అయితే, స్వావలంబన కూడా అంతే ముఖ్యం. (ట్రంప్‌ని కూడా ఇలానే పంపాల్సి వస్తుందేమో..) ఆత్మనిర్భర్ భారత్ దేశ యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మీ ఆలోచనలు, ఆవిష్కరణల ద్వారా పేదల జీవితాలు సులువుగా జీవించేలా ఉపయోగపడాలి. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాల కోసం కృషి చేయాలని మోడీ ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు. సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకతపై భారతీయులకు అపారమైన నమ్మకం ఉంది. దేశంలో మీ కోసం అపారమైన అవకాశాలు ఉన్నాయి. దేశం ఎదుర్కొంటున్న అపారమైన సవాళ్లు కూడా మీ ముందు ఉన్నాయి. వీటికి మీరు పరిష్కారాలు చూపాలి. (జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు) విపత్తు నిర్వహణ, భూగర్భజలాలను నిర్వహించడం, సౌర విద్యుత్ ఉత్పత్తి, టెలిమెడిసిన్ మరియు బిగ్‌డేటా విశ్లేషణ వంటి రంగాలలో అనేక అవకాశాలు ఉన్నాయి. దేశ అవసరాలకు అనేక ఇతర ఉదాహరణలను నేను మీ ముందు ఉంచగలను అని మోదీ అన్నారు. సవాళ్లను ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, ప్రయత్నాలతో పరిష్కరించవచ్చు అని మోడీ అన్నారు. అందుకే దేశ అవసరాలను గుర్తించి ఆత్మనిర్భర్ భారత్‌తో మిమ్మల్ని అనుబంధించాలన్నది నా అభ్యర్థన' అంటూ మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
రాజీనామా బాటలో ఢిల్లీ ఐఐటీ డీన్లు!
న్యూఢిల్లీ: అకడమిక్ వ్యవహారాలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (హెచ్చార్డీ) జోక్యం చేసుకోవడంపై ఢిల్లీ ఐఐటీ సెనేట్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నది. హెచ్చార్డీ తీరు మారకపోతే రాజీనామా చేస్తామని ఢిల్లీ ఐఐటీకి చెందిన ముగ్గురు డీన్లు హెచ్చరించారు. ఒక పార్ట్ టైం పీహెచ్డీ విద్యార్థిని అడ్మిషన్ ను రద్దుచేయడంపై పునరాలోచన చేయాలని ఢిల్లీ ఐఐటీ సెనేట్ ను హెచ్చార్డీ కోరింది. అలీషా తంగ్రీ అనే విద్యార్థిని తన ఉద్యోగ అనుభవం గురించి వాస్తవాలు దాచిపెట్టడంతో ఆమె అడ్మిషన్ ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తరఫున తండ్రి అలీషా తంగ్రీ పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ పై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం.. ఈ అంశాన్ని హెచ్చార్డీకి నివేదిస్తూ.. సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో ఈ పిటిషన్‌ను పరిష్కరించాల్సిందిగా కోరుతూ హెచ్చార్డీ .. ఢిల్లీ ఐఐటీ సెనేట్ కు పంపింది. దీనిని సెనేట్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఆ విద్యార్థిని పిటిషన్‌ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి లేదా ఐఐటీ డైరెక్టర్ కు నివేదించాల్సి ఉండాలని, అకడమిక్ ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత వారిపైనే ఉందని సెనేట్ భావిస్తున్నది. ఈ విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జోక్యాన్ని నిరసిస్తూ సెనేట్ లోని ఆరుగురు డీన్లలో ముగ్గురు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. దీంతో హెచ్చార్డీ, ఢిల్లీ ఐఐటీ మధ్య మరోసారి వివాదం తలెత్తే పరిస్థితి కనిపిస్తున్నది.