భూసేకరణ బిల్లుతో రైతులకు అన్యాయం
ఏఐకేఎస్ జాతీయ నాయకులు ఇజ్జు కృష్ణన్
ఖమ్మం మయూరిసెంటర్ : భూసేకరణ బిల్లుతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి ఇజ్జు కృష్ణన్ విమర్శించారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంచికంటీ భవనంలో ‘వ్యవసాయ రంగం - మోదీ ప్రభుత్వ విధానాలపై’ జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అన్యాయం జరిగేలా, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా భూసేకరణ బిల్లులో సవరణలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర వ్యవసాయ మంత్రి రైతులు ప్రేమ విఫలం, ఇతర కారణాల వల్లనే చనిపోతున్నారని విమర్శలు చేయడం బాధాకరమరన్నారు. కిసాన్ చానల్లో అమితాబ్‌బచ్చన్ యాడ్స్‌లో నటించినందుకు ప్రభుత్వం రూ.6 కోట్ల పారితోషికం ఇచ్చిందని, కానీ వ్యవసాయ రంగాభివృద్ధికి కేటాయింపులు లేవన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం మోడీ చేశారన్నారు. ఈజీఎస్ అమలులో దేశానికే త్రిపుర ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. యూపీఏ విధానాన్నే ప్రస్తుత ఎన్డీఏ అనుసరిస్తోందన్నారు.
ఢిల్లీ, ముంబై కారిడార్‌లో 5లక్షల 56వేల చదరపు పంట భూములను రైతులనుంచి లాక్కుందన్నారు. దేశంలో 100 స్మార్ట్‌సిటీల పేరుతో అభివృద్ధి చేస్తే 7లక్షల చదరపు కిలోమీటర్ల వ్యవసాయ భూమి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలకు నిరసనగా ఆగస్టు 10, 11 తేదీల్లో ఆక్రోష్ర్యాలీని ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 16 నుంచి 31 వరకు ఆహారభద్రత, ఎరువుల సబ్సిడీ, భూసేకరణ బిల్లుల సవరణలను నిరసిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సెమినార్‌కు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ అధ్యక్షతన వహించగా, కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి తాతా భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.