క్యాబేజీ కర్రీ విత్ స్నేక్
ఇండోర్: మొన్న తెలంగాణాలో పొరపాటున పాముతో పాటు టమాటా పచ్చడి నూరిన ఘటన లాంటిదే మరో ఉదంతం మధ్యప్రదేశ్లో ఓ తల్లీ కూతుళ్ల ప్రాణాల మీదకు తెచ్చింది. అయితే ఈసారి క్యాబేజీ కూర తోపాటు పొరపాటున పాము పిల్లకూడా ఉడికింది. దీంతో ఈ కూరను తిన్న తల్లీకూతుళ్లు తీవ్ర అస్వస్తతకు లోనయ్యారు. ఇండోర్లో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
అఫ్జాన్ ఇమామ్ (36) , ఆమె కుమార్తె ఆమ్నా (15) క్యాబేజీ కూర చేసుకుని తిన్నారు. అకస్మాత్తుగా చేదుగా అనిపించడంతోపాటు వెంటనే వాంతులు మొదలయ్యాయి. దీంతో అనుమానం వచ్చిన అఫ్జాన్ వండిన కూరను పరిశీలించింది. ఇంకేముంది ఆ కూరలో పాము ముక్కలు కనిపించడంతో ఇద్దరూ బేలెత్తిపోయారు. వెంటనే వారిని బంధువులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.
పాము విషం మనిషి రక్తంలో సమ్మిళితమై, బాడీ అంతా పాకినపుడు ప్రమాదకరంగా మారుతుందనీ, రెండు రోజుల పాటు రోగుల పరిస్థితిని తాము పర్యవేక్షిస్తామని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ధర్మేంద్ర జన్వర్ చెప్పారు. దీని మూలంగా వారి శరీర కణజాలాలకు ఎటువంటి హాని కలిగిందో తెలుసుకోవడానికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు.