అక్రమ నిల్వలు.. అదుపుతప్పిన ధరలు!
దసరా వేళ కొనుగోళ్లు ఎలా?
గ్రేటర్లో భారీగా నిత్యావసరాల అక్రమ నిల్వలు
వినియోగదారుల బెంబేలు
పట్టించుకోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ
నగరంలో నిత్యావసరాల అక్రమ నిల్వలు పేరుకుపోతున్నాయి. పప్పుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కందిపప్పును పెద్దమొత్తంలో గోదాముల్లో దాచేశారన్న విషయాన్ని అధికారులు పెడచెవిన పెడుతుండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పం డుగ దినాల్లో కందిపప్పు ధర ఇంతలా పెరగడానికి అక్రమ నిల్వలే కారణమన్నది బహిరంగ రహస్యమే. అయితే... అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపి పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన వ్యాపారులకు మాత్రమే సరుకు నిల్వ చేసుకొనే అవకాశం ఉంది. నగరంలో లెసైన్స్ పొందినవ్యాపారులు 2300 మందికి మించి లేరని స్వయంగా పౌరసరఫరాల శాఖ అధికారులే చెబుతున్నారు. ఎంతోమంది లెసైన్స్ లేకుండానే వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నా అటువైపు కన్నెత్తి చూసే నాథుడే లేదు. నెలవారీ మామూళ్ల మాటున అక్రమ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లుగా సాగుతున్నాయి.
ఫలితం లేని దాడులు
అప్పుడప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దాడుల్లో అక్రమ నిల్వల వ్యవహారం వెలుగు చూస్తున్నా... వాటివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరట్లేదు. ఆకస్మిక దాడుల్లో అధికారులు సీజ్ చేసిన సరుకును చౌకధరల దుకాణాలకు మళ్లించడమో, లేక బహిరంగ మార్కెట్లో వేలం వేసి విక్రయిస్తే కొంతమేర ఫలితం ఉంటుంది. కానీ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో నామ మాత్రపు జరిమానా విధించి వదిలేస్తుండటంతో వ్యాపారుల్లో భయం అనేది లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు దాడులకు వస్తున్న విషయాన్ని కిందిస్థాయి సిబ్బంది ముందే సంబంధిత వ్యాపారులకు చేరవేస్తుండటంతో సరుకును గోదాము నుంచి దాటించేస్తున్నారు. దీంతో అక్రమాల వ్యవహారం బయటపడట్లేదు.
పొంతనలేని ధరలు
ప్రభుత్వం నిర్ణయించి నిత్యావసర వస్తువుల ధరలకు ... మార్కెట్లో వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదు. బహిరంగ మార్కెట్లో కంది పప్పు కేజీ రూ.200లు ధర పలుకుతుంటే... ప్రభుత్వ జాబితాలో మాత్రం కందిపప్పు ధర రూ.160గా చూపుతుండటం మరీ విడ్డూరంగా ఉంది. మిగతా ధరల విషయంలో కూడా అసలు పొంతన కుదరడం లేదన్నది బహిరంగ రహస్యమే.
రేషన్ షాపుల్లో నో స్టాక్
గ్రేటర్ హైదరాబాద్‌లోని రేషన్ షాపుల్లో కంది పప్పు ‘నో స్టాక్’గా మారింది. బహిరంగ మార్కెట్లో కంది పప్పు ధర ఒకే సారి కిలో రూ. 200 లకు పెరగడంతో డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో లబ్ధిదారులకు రూ.50 లకు కిలో చొప్పున పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీంతో డీలర్లు లబ్ధిదారులకు కంది పప్పు పంపిణీ చేయకుండా సరుకు సరఫరా కాలేదని తప్పించుకుంటున్నారు. వాస్తవంగా మహా నగరంలో అక్టోబర్ నెలకు సంబంధించిన కందిపప్పు కోటా కేటాయింపు, విడుదల తోపాటు అందులో 75 శాతం చౌకధరల దుకాణాలకు సరఫరా అయింది. హైదరాబాద్ పౌరసరఫరా విభాగం పరిధిలోని తొమ్మిది సర్కిల్స్‌లో అక్టోబర్ మాసానికి మొదటి విడత కింద 7,80,950 కిలోల కంది పప్పు కేటాయింపు జరుగగా, అందులో ఇప్పటికే 6,13,064 కిలోల కంది పప్పు వరకు చౌకధరల దుకాణాలకు సరఫరా అయినట్లు పౌరసరఫరాల శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతాలలో సైతం 75 శాతం కోటా కేటాయింపు జరిగి చౌకధరల దుకాణాలకు సరఫరా అయింది. క్షేత్ర స్థాయిలో మాత్రం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు కంది పప్పు అందని దాక్షగా మారింది.
రైతు బజార్లలో మూతపడిన కేంద్రాలు
ఇక రైతుబజార్లలో ఏర్పాటు చేసిని కందిపప్పు విక్రయ కేంద్రాలు మూతపడ్డాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్ పరిధిలో రెండు, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేసి కిలో కంది పప్పు రూ.100లు, రెండో రకం రూ. 90ల చొప్పున విక్రయించారు. ప్రస్తుతం కంది పప్పు ధరలు ఒకే సారి పెరగడంతో తిరిగి కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
పరిమితికి మించి నిల్వలు
నిబంధనల ప్రకారం వివిధ రకాల పప్పులు హోల్‌సేల్ వ్యాపారి వద్ద 250 క్వింటాళ్లు, అదే రిటైలర్ వద్ద 50 క్వింటాళ్లు కంటే మించకూడదు. గోధుమలు హోల్‌సేల్ వ్యాపారి వద్ద 250 క్వింటాళ్లు, రిటైలర్ వద్ద 20 క్వింటాళ్లు, బియ్యం హోల్‌సేల్ వ్యాపారి వద్ద 1000 క్వింటాళ్లు, రిటైలర్ వద్ద 100 క్వింటాళ్లకంటే మించకూడదు. ట్రేడింగ్ మిల్లర్ల వద్ద బియ్యం 4 వేల క్వింటాళ్లు, నాన్ ట్రేడింగ్ మిల్లర్ల వద్ద 2 వేల క్వింటాళ్ల కంటే ఎక్కువ నిల్వలు ఉండకూడదు. జంటనగరాల్లో ఈ నిబంధనలు పాటిస్తున్న మిల్లర్లు, వ్యాపారులు ఎంతమంది అంటే...? అది జవాబు లేని ప్రశ్నే. అధికారులు సైతం నీళ్లు నమలాల్సిన పరిస్థితి. అడపదడపా దాడుల్లో ఈ విషయం బహిర్గతమవుతూనే ఉంది. కఠినంగా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతుండటం అక్రమార్కులకు కలిసొస్తుంది.