Illegal nallau
-
అక్రమ నల్లాలపై కదులుతున్న డొంక!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాల తీగ లాగితే డొంక కదులుతోంది .నగర పరిధిలో వేలాదిగా ఉన్న ఆక్రమ నల్లాల భరతం పట్టేందుకు జలమండలి చేపట్టిన ఇంటింటి సర్వే సత్ఫలితాన్నిస్తోంది. ఇప్పటి వరకు 6 నిర్వహణ డివిజన్ల పరిధిలో చేపట్టిన సర్వేలో 1600 అక్రమ నల్లాల భాగోతం బయటపడింది. మరో ఆరువేల నల్లా కనెక్షన్ల కేటగిరి మార్పుతో జలమండలికి అదనపు ఆదాయం సమకూరింది. అక్రమ నల్లాలను వీడీఎస్ పథకం కింద క్రమబద్ధీకరించడం, జరిమానాలు, నల్లా కనెక్షన్ ఛార్జీల రూపంలో బోర్డుకు రూ.11.66 కోట్ల ఆదాయం లభించింది. నెలవారీగా మరో రూ.33.30 లక్షల అదనపు ఆదాయం నల్లా బిల్లుల ద్వారా సమకూరుతోంది. ఇంటింటి సర్వే ప్రక్రియను మరో 14 నిర్వహణ డివిజన్ల పరిధిలో కొనసాగించడం ద్వారా జలమండలి రెవెన్యూ ఆదాయాన్ని గణనీయం గా పెంచాలని బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం విశేషం. ఈ సర్వే ద్వారా మహా నగరం పరిధిలో ఉ న్న సుమారు 50 వేల అక్రమ నల్లాల బండారం బయటపడుతుందని బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటి లెక్క తేలితే జలమండలికి ఆర్థిక కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. ఇంటింటి సర్వే ఫలితాలు ఇలా.. జలమండలి రెవెన్యూ సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సిబ్బంది ఇంటింటికి వెళ్లి..ప్రస్తుతం ఆయా భవనాలకున్న నల్లా కనెక్షన్ వివరాలు, బోర్డు రికార్డులో ఉన్న వివరాలతో సరి పోలుతున్నాయో లేదో చెక్ చేస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల ఇంటి నిర్మాణ వైశాల్యం, అంతస్తులు, నెలవారీగా వారు చెల్లిస్తున్న నీటి బిల్లు...నీటి పరిమాణం..తదితర వివరాలను సేకరిస్తున్నారు. ఈ సిబ్బంది సేకరించిన వివరాలను..బోర్డు విజిలెన్స్ సిబ్బంది తిరిగి తనిఖీ చేస్తున్నారు. కనెక్షన్ కేటగిరిలో మార్పులు గుర్తిస్తే..వెంటనే మార్పులు చేర్పులు చేస్తున్నారు. అక్రమ నల్లాలను గుర్తిస్తే..వీడీఎస్ పథకం కింద క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తున్నారు. నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం... రూకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న జలమండలిని గట్టెక్కించేందుకు, రెవెన్యూ ఆదాయం పెంపుపై బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం నెలకు లభిస్తున్న రూ.120 కోట్ల ఆదాయంలో సింహభాగం..సుమారు రూ.75 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లిస్తోంది. మిగతా మొత్తం నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల జీతభత్యాలకు అరకొరగా సరిపోతోంది. ప్రస్తుతం నెలకు సుమారు రూ.30 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో చేపట్టిన ఇంటింటి సర్వేతో ఇప్పటి వరకు రూ.11.66 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. నెలవారీగా నల్లా బిల్లుల రూపేణా అదనంగా రూ.33.30 లక్షల ఆదాయం లభిస్తోంది. -
క్రమం...అక్రమం!
- గ్రేటర్ పరిధిలో లక్షకు పైగా అక్రమ నల్లాలు - నత్త నడకన క్రమబద్ధీకరణ - సిబ్బంది నిర్వాకంతో అడ్డంకులు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. జలమండలి క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్వాకమే దీనికి కారణంగా తెలుస్తోంది. మహా నగర పరిధిలో లక్షకు పైగా అక్రమనల్లాలు ఉన్నట్టు బోర్డు అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. అయినా ఏడాది కాలంలో కేవలం 15 వేల నల్లాలను మాత్రమే క్రమబద్ధీకరించడం గమనార్హం. వినియోగదారుల నుంచి నామమాత్రంగా డిక్లరేషన్ తీసుకొని కనెక్షన్ చార్జీ వసూలు చేసి... క్రమబద్ధీకరించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయి అధికారులు మాత్రం సవాలక్ష కొర్రీలతో వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. సంబంధిత భవంతికి మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ ధ్రువీకరణ, విద్యుత్ కనెక్షన్లు ఉన్నప్పటికీ ఆక్యుపెన్సీ, లింక్ డాక్యుమెంట్లు, అఫిడవిట్లు సమర్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పలువురు క్రమబద్ధీకరణకు వెనుకంజ వేస్తున్నారు. బోర్డు ఆదాయానికి నెలకు రూ.పది కోట్ల మేర గండి పడుతున్నట్లు అంచనా. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని కాలనీలు, బస్తీలు, పంచాయతీల్లో ప్రస్తుతం ఇదే దుస్థితి నెలకొంది. బోర్డు ఖజానాకు భారీగా గండి గ్రేటర్ పరిధిలోని 16 నిర్వహణ డివిజన్లలో జలమండలికి 8.64 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నీటి బిల్లులు, ట్యాంకర్లతో నీటి సరఫరా, మురుగు శిస్తు కలిపి జలమండలికి నెలకు రూ.91 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. కానీ వ్యయం రూ.93 కోట్లుగా ఉంది. అంటే నెలకు రూ.2 కోట్ల లోటుబడ్జెట్తో నెట్టుకొస్తోందన్నమాట. ఈ నేపథ్యంలో నగరంలో మరో లక్ష అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తే ఆదాయం నెలకు రూ.100 కోట్లకు మించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లు, డీజీఎంలు, జీఎంల నిర్వాకంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. 189 మంది అక్రమార్కుల గుర్తింపు గ్రేటర్ పరిధిలో గత ఎనిమిది నెలలుగా అక్రమ కనెక్షన్లు, బహుళ అంతస్తుల భవంతులకు గృహ వినియోగ కనెక్షన్లు ఉండడం, ఎక్కువ మొత్తంలో నీటిని వాడుకుంటూ... నల్లా పరిమాణాన్ని తక్కువ చూపుతున్న కేసులను 189 వరకు బోర్డు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో అక్రమ కనెక్షన్లు ఉన్న పది మంది వినియోగదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. పక్కాగా సమాచారం అందితేనే విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.