క్రమం...అక్రమం! | Greater range of Rs one lakh to the illegal Nalla | Sakshi
Sakshi News home page

క్రమం...అక్రమం!

Published Sun, Aug 30 2015 1:16 AM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM

క్రమం...అక్రమం! - Sakshi

క్రమం...అక్రమం!

- గ్రేటర్ పరిధిలో లక్షకు పైగా అక్రమ నల్లాలు
- నత్త నడకన క్రమబద్ధీకరణ
- సిబ్బంది నిర్వాకంతో అడ్డంకులు
సాక్షి, సిటీబ్యూరో:
గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. జలమండలి  క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్వాకమే దీనికి కారణంగా తెలుస్తోంది. మహా నగర పరిధిలో లక్షకు పైగా అక్రమనల్లాలు ఉన్నట్టు బోర్డు అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. అయినా ఏడాది కాలంలో కేవలం 15 వేల నల్లాలను మాత్రమే క్రమబద్ధీకరించడం గమనార్హం. వినియోగదారుల నుంచి నామమాత్రంగా డిక్లరేషన్ తీసుకొని కనెక్షన్ చార్జీ వసూలు చేసి... క్రమబద్ధీకరించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

క్షేత్ర స్థాయి అధికారులు మాత్రం సవాలక్ష కొర్రీలతో వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. సంబంధిత భవంతికి మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ ధ్రువీకరణ, విద్యుత్ కనెక్షన్లు ఉన్నప్పటికీ ఆక్యుపెన్సీ, లింక్ డాక్యుమెంట్లు, అఫిడవిట్లు సమర్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పలువురు క్రమబద్ధీకరణకు వెనుకంజ వేస్తున్నారు. బోర్డు ఆదాయానికి నెలకు రూ.పది కోట్ల మేర గండి పడుతున్నట్లు అంచనా. గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని కాలనీలు, బస్తీలు, పంచాయతీల్లో ప్రస్తుతం ఇదే దుస్థితి నెలకొంది.
 
బోర్డు ఖజానాకు భారీగా గండి
గ్రేటర్ పరిధిలోని 16 నిర్వహణ డివిజన్లలో జలమండలికి 8.64 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నీటి బిల్లులు, ట్యాంకర్లతో నీటి సరఫరా, మురుగు శిస్తు కలిపి జలమండలికి నెలకు రూ.91 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. కానీ వ్యయం రూ.93 కోట్లుగా ఉంది. అంటే నెలకు రూ.2 కోట్ల లోటుబడ్జెట్‌తో నెట్టుకొస్తోందన్నమాట. ఈ నేపథ్యంలో నగరంలో మరో లక్ష అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తే ఆదాయం నెలకు రూ.100 కోట్లకు మించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లు, డీజీఎంలు, జీఎంల నిర్వాకంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది.
 
189 మంది అక్రమార్కుల గుర్తింపు
గ్రేటర్ పరిధిలో గత ఎనిమిది నెలలుగా అక్రమ కనెక్షన్లు, బహుళ అంతస్తుల భవంతులకు గృహ వినియోగ కనెక్షన్లు ఉండడం, ఎక్కువ మొత్తంలో నీటిని వాడుకుంటూ... నల్లా పరిమాణాన్ని తక్కువ చూపుతున్న కేసులను 189 వరకు బోర్డు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో అక్రమ కనెక్షన్లు ఉన్న పది మంది వినియోగదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. పక్కాగా సమాచారం అందితేనే విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement