సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ వాసుల దాహార్తిని తీర్చే కృష్ణా మూడోదశ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. దీంతో భాగ్యనగరానికి అదనంగా నిత్యం 90 మిలియన్ గ్యాలన్ల నీరు అందే అవకాశముంది. ఇప్పటికే కృష్ణా మొదటి, రెండవ దశల ద్వారా రోజువారీగా మహానగరానికి 180 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్న విషయం విదితమే. కాగా, మూడోదశ పనుల్లో సింహభాగం పూర్తవడంతో భవిష్యత్‌లో శివారు జనం దాహార్తి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 108 కి.మీ పైప్‌లైన్ పనులకు సెప్టెంబరు 23 నాటికి 105.5 కి.మీ పనులు పూర్తవడం విశేషం.
మూడోదశ పనుల పురోగతి ఇలా..
ఏడాది క్రితం చేపట్టిన మూడోదశ ప్రాజెక్టును పది ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ఇందులో కృష్ణా జలాలను సిటీకి తరలించేందుకు భారీ పంప్ హౌస్‌లు, రిజర్వాయర్ల నిర్మాణం కూడా భాగ మే. ఇప్పటి వరకు పైప్‌లైన్ పనుల్లో కేవలం 2.5 కి.మీ పైప్‌లైన్ వేయాల్సి ఉంది. ఇక పంప్‌హౌస్ పనుల్లో 90 శాతం పూర్తయ్యాయి. రిజర్వాయర్ పనులు 85 శాతం మేర పూర్తయినట్లు జలమండలి ఈఎన్‌సీ సత్యనారాయణ, ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి డిసెంబరు నాటికి నగరానికి 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
రూ.1217.69 కోట్ల పనులు పూర్తి
మూడోదశ ప్రాజెక్టును రూ.1670 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఇందులో రూ.1500 కోట్లు హడ్కో సంస్థ నుంచి రుణంగా సేకరించారు. మరో రూ.170 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, ఇప్పటి వరకు రూ.1217.69 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వీటికి ఏజెన్సీలకు రూ.1197.27 కోట్లు బిల్లులు చెల్లించారు. మరో రూ.453 కోట్ల మేర పనులు పూర్తికావాల్సి ఉంది.
రింగ్ మెయిన్-1 పనుల్లో జాప్యం
మూడోదశ కింద నగరానికి తరలించే 90 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరం నలుమూలలా సరఫరా చేసేందుకు రింగ్‌మెయిన్-1, రింగ్ మెయిన్-2 పనులను చేపట్టారు. ఇందులో రింగ్ మెయిన్-1 పనుల్లో 35.8 కి.మీకి 16.600 కి.మీ పైప్‌లైన్ పనులే పూర్తయ్యాయి. రింగ్ మెయిన్-2లో 29.650 కి.మీకి గాను 28.150 కి.మీ పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి.
భాగ్యనగరికి ‘కృష్ణ’మ్మ పరవళ్లు
Published Sun, Oct 5 2014 12:15 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement