అక్రమ రికవరీలపై రేపు నిరసన ర్యాలీ
గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా పోలీసులు బంగారు, వెండి వ్యాపారుల నుంచి అక్రమంగా రికవరీ చేస్తున్నందుకు నిరసనగా ఈనెల 7వ తేదీన జిల్లాలోని బంగారు, వెండి వర్తకులు నరసరావుపేటలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు ది గుంటూరు జిల్లా బంగారు, వెండి వర్తక సంఘం అధ్యక్షుడు కపల వాయి విజయకుమార్ చెప్పారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులతో అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. నాజ్ సెంటర్లోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన సంఘం జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7న నరసరావుపేటలోని సత్తెనపల్లిరోడ్డు, కోటా సెంటర్లలో ఉదయం వ్యాపారస్తులు ఊరేగింపు నిర్వహించి సదస్సుకు చేరుకుంటారని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా బంగారు, వెండి వ్యాపారులు షాపులను స్వచ్ఛందంగా మూసివేసి సదస్సుకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అదనపు కార్యదర్శి జుజ్జూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ పోలీసు వేధింపుల వల్ల వ్యాపారులు ఎంతో నష్టపోతున్నారని చెప్పారు. 1995 సంవత్సరంలో అప్పటి ఎస్పీ నండూరి సాంబశివరావు బంగారం రికవరీకి కొన్ని నిబంధనలు విధించారని, పోలీసులు వాటిని ఇటీవల పాటించకుండా వ్యాపారులపై నిందలు మోపి , జీపు ఎక్కించుకుని ఊరు చివరకు తీసుకెళ్లి బెదిరించి రికవరీలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలోని పోలీసుస్టేషన్లో, వ్యాపార సంఘ నాయకుల సమక్షంలోనే రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆతుకూరి నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, నగర అధ్యక్షుడు రాజేంద్రకుమార్ జైన్, ప్రధాన కార్యదర్శి ఆతుకూరి నరసింహారావు, జిల్లా కార్యదర్శి సాధు రామకృష్ణ, జిల్లా వ్యాప్తంగా పలు పట్టణాల నుంచి వ్యాపారులు పాల్గొన్నారు.