illegal registrations
-
అక్రమ రిజిస్ట్రేషన్లు.. సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ అరెస్టు
చిత్తూరు అర్బన్/చిత్తూరు కార్పొరేషన్: ఓ స్థలానికి సంబంధించి యజమాని ఒకరైతే.. వాళ్లకే తెలియకుండా మరొకరి పేరిట రూ.కోట్లు విలువ చేసే భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాను గత నెలలో చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన తహసీల్దార్ ఐ.సుబ్రహ్మణ్యం, సబ్ రిజిస్ట్రార్ జె.శ్రీధర్ గుప్తా, వీఆర్వోలు ధనుంజయ, ఎం.శివనారాయణ, కె.బాబును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. చిత్తూరు నగరంలో దాదాపు రూ.50 కోట్లకుపైగా విలువ చేసే భూములు, ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల సాయంతో సురేంద్రబాబు తదితరులు ఓ ముఠాగా ఏర్పడి వేరేవారికి కట్టబెట్టారు. దీంతో సురేంద్రబాబుతో పాటు మొత్తం ఏడుగురిని సెప్టెంబర్ 30న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని అక్రమాలు జరిగినట్లు ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన లోతుగా దర్యాప్తు చేయించారు. అక్రమాలు బయటపడింది ఇలా.. చిత్తూరుకు చెందిన బాలగురునాథంకు చెందిన ఐదెకరాల స్థలాన్ని సురేంద్రబాబు ముఠా.. యాదమరి మండలం మాధవరం పంచాయతీకి చెందిన ఎబినైజర్, పూపతమ్మ, మురళి, శివకుమార్, చిట్టిబాబు, చిత్తూరుకు చెందిన నితీష్‌కు రూ.75 లక్షలకు అమ్మేశారు. తాము మోసపోయామని, ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకుండా విలువైన స్థలాలను తమకు రిజిస్ట్రేషన్ చేసి ఏమార్చారని ఎబినైజర్ గత నెల 25న యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన పోలీసులు ఎబినైజర్ కొన్న స్థలం బాలగురునాథంకు చెందిందిగా గుర్తించారు. ఈ భూమిని గ్రామకంఠం భూమిగా పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో రెండేళ్ల క్రితం చిత్తూరు తహసీల్దార్‌గా పనిచేసి, ప్రస్తుతం పుత్తూరు తహసీల్దార్‌గా ఉన్న ఐ.సుబ్రహ్మణ్యం, చిత్తూరు వీఆర్వోలు ధనంజయ, కె.బాబు, శివనారాయణ కీలకపాత్ర పోషించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో ఈకేవైసీ చేయడం, ఉద్యోగుల లాగిన్, పాస్‌వర్డ్‌తోపాటు ప్రభుత్వ సమాచారాన్ని దళారులకు ఇవ్వడంలో ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది హస్తం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ప్రభుత్వ అధికారులు నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పెద్ద మొత్తంలో నగదు రూపేణా లబ్ధి పొందినట్టు ఆధారాలు సేకరించారు. ఈ అరెస్టులు ఇంతటితో ఆగవని, మరికొంతమంది హస్తం ఉందని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.. చిత్తూరు అర్బన్ జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ గిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పందించిన ఆయన జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావును విచారణ అధికారిగా నియమించారు. విచారణలో శ్రీధర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు చిత్తూరు దాటివెళ్లవద్దని ఆదేశించారు. -
చనిపోయిన వ్యక్తి లేచొచ్చాడా?
నగరంలోని సర్వే నెం.173లో మూడు ఎకరాలపైనే ఉన్న భూమిని 143 గజాల భూమిగా చూపి రిజిస్ట్రేషన్ చేశారు. గమ్మత్తైన విషయమేమంటే ఆధార్ కార్డులో తండ్రి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. సాక్షి, నిజామాబాద్: జిల్లాలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లకు పై ఉదంతాలే నిదర్శనం. ముగ్గురు రాజకీయ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, ఆధార్ సెంటర్ నిర్వాహకులు, ఉద్యోగ సంఘం నాయకుడు కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌తో కలిసి పేదల భూములకు ఎసరు పెట్టారు. అలాగే, సర్కారు ఆదాయానికి గండి కొట్టారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ అధికారే మాఫియా అవతారం ఎత్తి అక్రమాలకు లైసెన్స్ ఇవ్వడం గమనార్హం. సస్పెండైన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అక్రమ సంపాదనకు దండిగా అలవాటు పడిన ఆ అధికారి ఏడాది వ్యవధిలోనే రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 50 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయడం, లేని వారసులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి భూములు ఇతరులకు కట్టుబెట్టిన భారీగా దండుకున్నట్లు తెలిసింది. నగరంలోని కంఠేశ్వర్ ఏరియాలో గల సర్వే నెం.268లో 2.11 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం స్థలాన్ని కేవలం 110 గజాలుగా చూపి ఇటీవల వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. విచిత్రమేమిమంటే ఈ భూమి యజమాని బంటు ఎర్రన్న 1973లో చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు 2004లోనే డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. అయితే కొంత మంది అక్రమార్కులు కలిసి 2.11 ఎకరాల భూమిని కాజేయాలని ప్లాన్ చేశారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై బంటు ఎర్రన్న తన భూమిని ఇతరులకు విక్రయించినట్లు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అయితే, 50 ఏళ్ల క్రితం చనిపోయిన ఎర్రన్న గత సెప్టెంబర్ 3న తన భూమిని ఇతరుల పేరిట ఎలా రిజిస్ట్రేషన్ చేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. విచారణలో నిగ్గుతేలేనా..? సస్పెండైన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడిన సదరు అధికారి తనకేమీ తెలియదన్నట్లుగా ఆ శాఖ డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఎదుట అయామక చక్రవర్తిగా నటించినట్లు ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు, తన సస్పెన్షన్‌ను ఎత్తి వేయించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులతో హైదరాబాద్‌లో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, తన ముఠా సభ్యులు తనను కాపాడతారన్న ధీమాతో ఉన్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. -
బూరుగిద్దకు భరోసా
లింగంపేట(ఎల్లారెడ్డి) : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బూరుగిద్ద గ్రామాన్ని అక్రమంగా పట్టా చేసుకున్న వివాదంపై ‘సాక్షి’లో సోమవారం ‘ఊరినే అమ్మేశారు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు రెవెన్యూ యంత్రాంగం కదలివచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్ నాయక్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సర్వేయర్‌ను గ్రామానికి పంపి కొలతలు తీయించారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్‌నాయక్ బూరుగిద్ద గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ధ్రువపత్రాలను రద్దు చేస్తున్నామని ఆర్డీవో వెల్లడించారు. గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన భరోసా ఇచ్చారు. 311 సర్వే నంబరులో 29 గుంటల భూమి ఉన్న ట్లు రికార్డులో ఉన్నందున తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. మోకా మీద ఇళ్లు ఉన్న ట్లు రికార్డుల్లో లేదన్నారు. రికార్డులను సరిచేసి, ఆబాది కింద మార్చి 13 కుటుంబాలకు వెంటనే ఇల్లు, స్థలాలకు ధ్రువపత్రాలు అందజేస్తామన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తామన్నారు. అయితే భూమి కొనుగోలు చేసిన వారు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వారు ఇకపై ఎలాంటి ఒత్తిళ్లు కలుగజేయబోమని ఒప్పుకున్నట్లు, మళ్లీ ఘర్షణకు వస్తే చర్యలు తీసుకుంటామని ఆర్డీ వో గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సమగ్ర విచారణ చేయాలి 311 సర్వే నంబరులో 29 గుంటల భూమిని తాము ఎవ్వరికీ అమ్మలేదని పట్టాదారు పేర్కొనడం విశేషం. అలాంటప్పుడు ఇద్దరి పేర్లపైకి అధికారులు పట్టా మార్పిడి ఎలా చేశారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పట్టా మార్పిడి జరిగితే గ్రామానికి ఉన్న హద్దులు తప్పుగా నమోదు చేయడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ నారాయణ ఉన్నారు. -
అనుమతులా.. మాకెందుకు..?
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ‘నూతన మున్సిపల్ చట్టం మాకు వర్తించదు.. లే అవుట్, ఎల్ఆర్ఎస్ ఏ అనుమతి లేకున్నా ఫర్వాలేదు. బై నంబర్లతో సర్వే నంబర్లు ఉన్నా చాలు.. ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేస్తాం.’ ఇదీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లే అవుట్ లేని వెంచర్లలో ప్లాట్లకు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవహారం. సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేయడంతో ఇది బయట పడింది. మున్సిపల్ కమిషనర్ ఫలానా వెంచర్లకు లే అవుట్, ఎల్ఆర్ఎస్ అనుమతి లేదని లేఖ ఇచ్చినా ఎలా రిజిస్ట్రేషన్ చేశారని సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. పుట్టగొడుగుల్లా వెంచర్లు.. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలిశాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. గత ఏడాది సమీప గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. సూర్యాపేట పట్టణానికి సమీపంలో కుడకుడ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, జనగాం రోడ్డు, కోదాడ రోడ్డు, కోదాడలో ఖమ్మం, విజయవాడ రోడ్డు, మునగాల రోడ్డు, హుజూర్నగర్, నేరేడుచర్లలో మిర్యాలగూడ రోడ్డులో, తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో జనగామ, సూర్యాపేట రోడ్డులో వెంచర్లు వెలిశాయి. అయితే మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రియల్టర్లు వెంచర్లు చేస్తుండడం గమనార్హం. మున్సిపల్ అధికారులు పలుమార్లు అక్రమ వెంచర్లపై కొరడా ఝుళిపించి ఈ వెంచర్లలో ప్లాట్ల హద్దు రాళ్లను జేసీబీలతో తీయించినా మళ్లీ కొన్నాళ్లకే రియల్టర్లు హద్దురాళ్లు పెడుతున్నారు. నూతన మున్సిపల్ చట్టం అస్త్రం ప్రయోగించినా.. అనుమతులు లేకున్నా రియల్టర్లు ప్లాట్లు చేస్తుండడంతో మున్సిపల్ అధికారులు కొత్త మున్సిపల్ చట్టాన్ని అస్త్రంగా చేసుకున్నారు. 2019 జూలైలో తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ప్రకారం లే అవుట్, ఎల్ఆర్ఎస్ అనుమతి లేని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయవద్దు. అనుమతి లేని ప్లాట్లలో భవనాలు నిర్మించినా రిజిస్ట్రేషన్ చేయవద్దని ఈ చట్టం స్పష్టం చేస్తుంది. దీని ప్రకారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో అక్రమ వెంచర్ల జాబితాను సర్వే నంబర్లతో సహా సబ్ రిజిస్ట్రార్లకు పంపారు. అయినా ఇక్కడ అక్రమ తంతుకు అడ్డుకట్ట పడలేదు. కొత్త మున్సిపల్ చట్టం అమలుకు తిలోదకాలిచ్చి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో యథేచ్ఛగా అక్రమ వెంచర్ల ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. లే అవుట్, ఎల్ఆర్ఎస్ లేకుంటే మా కెందుకు..? ఆదాయమే పరమావధిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొందరు రియల్టర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల చేతులు తడిపి మరీ హడావుడిగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమ వెంచర్లను పరిశీలించిన అనంతరం మున్సిపల్ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి కలెక్టర్ తనిఖీతో బయటపడిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం.. లే అవుట్, ఎల్ఆర్ఎస్ లేకుండా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 36 వెంచర్లలో జేసీబీలతో ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించారు. వీటిని కలెక్టర్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ వెంచర్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేశారా..? అని మున్సిపల్ అధికారులను ఆరా తీసిన కలెక్టర్ వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం లే అవుట్, ఎల్ఆర్ఎస్ అనుమతి లేకుండా 36 వెంచర్లు వెలిశాయని వీటిలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయవద్దని గత ఏడాడి నవంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్ మూడు సార్లు సబ్ రిజిస్ట్రార్‌కు లేఖలు పంపారు. ఆయా వెంచర్ల సర్వే నంబర్లు, ఎంత విస్తీర్ణం అన్నది కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ లేఖ ఇచ్చిన తర్వాత కూడా ఈ సర్వే నంబర్లలో రెండు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎలా చేశారని కలెక్టర్.. సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. ఒక సర్వే నంబర్‌కు అనుమతి లేదని ఇస్తే.. అదే సర్వే నంబర్‌కు బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు కలెక్టర్ తనిఖీలో బయటపడింది. ఇలా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయనున్నట్లు సమాచారం. నూతన మున్సిపల్ చట్టాన్ని పక్కన పెట్టి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరుపై ఆ శాఖ ఉన్నతాదికారులు కింది స్థాయి అధికారులకు ఇప్పటికే మొట్టికాయలు వేసినట్లు తెలిసింది. లే అవుట్ ఉంటనే రిజిస్ట్రేషన్ చేయాలి 2019 జూలైలో వచ్చిన నూతన మున్సి\ పల్ చట్టానికి అనుగుణంగా లే అవుట్లకు అనుమతి తీసుకోవాలి. మున్సిపాలిటీ నుంచి అనుమతి వచ్చిన లే అవుట్లకు మాత్రమే సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేయాలి. లే అవుట్ అనుమతి లేకున్నా కనీసం ఎల్ఆర్ఎస్ కచ్చితంగా ఉండాలి. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 36 అనుమతి లేని వెంచర్లు ఉన్నట్లు ప్రస్తుతం గుర్తించాం. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కలెక్టరేట్లో ఒక టీంను ఏర్పాటు చేసి అన్ని మున్సిపాలిటీల్లో అనుమతి లేని వెంచర్లు గుర్తిస్తాం. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చట్ట ప్రకారం లే అవుట్లకు అనుమతి ఇస్తాం. మున్సిపాలిటీ అనుమతి లేనిదే రిజిస్ట్రేషన్లు చేయొద్దు. – టి.వినయ్‌కృష్ణారెడ్డి, కలెక్టర్ -
భూ కుంభకోణంలో ముగ్గురు అరెస్టు
హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసిన మూసాపేట సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అప్పనంగా భూములను పొందిన గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా ప్రతినిధి పార్థసారథిని, అకౌంటెంట్ శర్మలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొంతమంది బిల్డర్ల అరెస్టు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. -
నయీం అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆర్డీవో విచారణ
నల్గొండ : భువనగిరిలో గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై స్థానిక ఆర్డీవో శనివారం విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1700 మంది బాధితులు ఇప్పటికే ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీం తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. షాద్‌నగర్‌లో నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అందులోభాగంగా పలువురు నయీం అనుచరులను ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేసి.... విచారిస్తున్నారు. త్వరలోనే ఎవరి ప్లాట్లను వారికి అప్పగిస్తామని ఈ సందర్భంగా ఆర్డీవో భూపాల్‌రెడ్డి తెలిపారు. -
అక్రమార్కులపై క్రిమినల్ కేసులు?
నగరంపాలెం : రవాణాశాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ వ్యవహారంలో రవాణా శాఖ తరఫున కీలకంగా వ్యవహరించిన మంగళగిరి మోటరు వెహికల్ ఇన్స్పెక్టరు శివనాగేశ్వరావును ఇప్పటికే సెలవుపై పంపారు. జిల్లా రవాణా శాఖలో మంగళగిరి పరిధిలో లారీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనపై విచారణ కొనసాగుతోంది. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో సోమవారం రాత్రి నుంచి జిల్లా ఉపరవాణా కమిషనర్ జీసీ రాజారత్నం ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. వాహనాలు విజయవాడలోని జాస్పర్ కంపెనీలో కొనుగోలు చేసినట్లు, అక్కడి ఆటోనగర్‌లోని కరుణామయా వర్క్‌షాపులో బాడీ బిల్డింగ్ చేసినట్లు పత్రాలు ఉండటంతో మంగళవారం, బుధవారం డీటీసీ విజయవాడలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటీకే వాహనాల రిజిస్ట్రేషన్‌కు కేటాయించిన 27 నంబర్లను ఆధికారులు రద్దు చేశారు. జరిగిన సంఘటనపై జాస్పర్ కంపెనీ వైస్ చైర్మన్‌ను విచారించారు. డీలరుకు సంబంధించిన గోడౌన్‌లోని కీ ఇన్వాయిస్, అవుట్ గోయింగ్ రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. బాడీ బిల్డింగ్ చేసినట్లు బిల్లులు ఇచ్చిన వర్క్‌షాపు యజమానులను విచారించి నివేదికను విచారణాధికారి డీటీసీ రాజారత్నం రవాణా కమిషనర్‌కు అందించనున్నారు. దీనిపై పూర్తి వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకునేందుకు గురువారం రవాణాశాఖ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం విజయవాడ రానున్నారు. బ్యాంకు పాస్‌బుక్ ద్వారా రిజిస్ట్రేషన్లు వాహనాల రిజిస్ట్రేషన్లు సాధారణంగా వాహనదారుల చిరునామా ప్రకారం ఆ పరిధిలోని రవాణా శాఖ కార్యాలయాల్లో చేస్తారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లకు చిరునామ ధ్రువపత్రాలను బ్యాంకు అకౌంట్ల ద్వారా సృష్టించారు. మంగళగిరిలోని 5-649.బి కొప్పురావు కాలనీ ఇంటి చిరునామాతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో అకౌంట్లు ప్రారంభించి పాస్‌బుక్‌లు పొందిన వాహన యజమానులు వాటి ద్వారా రిజిస్ట్రేషన్లు మంగళగిరి ఎంవీఐ కార్యాలయంలో చేయించారు. రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఎంవీఐకు మధ్యవర్తులకు రూ.లక్షల్లోనే మామూళ్లు అందినట్లు సమాచారం. పూర్తి నివేదిక తర్వాత ఎంవీఐపై శాఖపరమైన చర్యలతోపాటు, వాహన డీలర్లు, బాడీ బిల్డింగ్ యజమానులు, వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న యజమానులపై క్రిమినల్ కేసులూ నమోదు చేయనున్నట్లు సమాచారం. మోటారు వెహికల్ ఇన్చార్జి అధికారిగా బాలకృష్ణ మంగళగిరి : విజయవాడకు చెందిన పొట్లూరి ఆనంద్, రవిశంకర్, ఈనెల రవీంద్రనాథ్, జూపల్లి పద్మావతితో పాటు మంగళగిరి మండలం నూతక్కి చెందిన వెలిశెట్టి లక్ష్మీనారాయణకు ఇండియన్ ఆయిల్ కంపెనీలో చమురు సరఫరా చేసే టెండర్లలో పాల్గొనేందుకు వాహనాలు అవసరమయ్యాయి. దీంతో విజయవాడ జాస్వర్ ఇండస్ట్రీస్ వద్ద 27 వాహనాలు కొనుగోలు చేసినట్లు బిల్లులు తీసుకున్నారు. ఆ వాహనాలకు కావాల్సిన బిల్లులు, సర్టిఫికేట్లు తీసుకుని మధ్యవర్తి ద్వారా శివనాగేశ్వరరావును కలిసినట్లు తెలుస్తోంది. సెలవుపై వెళ్లిన మంగళగిరి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ శివనాగేశ్వరరావు స్థానంలో గుంటూరుకు చెందిన అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై జేటీసీ విచారణ విజయవాడ : రవాణా శాఖలో వెలుగు చూసిన కుంభకోణంపై జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రసాదరావు విచారణ జరిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై ఆశాఖ అధికారులు స్పందించారు. బుధవారం జేటీసీ ప్రసాదరావు విజయవాడలో జాస్పర్ ఇండస్ట్రీస్ కార్యాలయానికి వెళ్లి 27 లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారించారు. వాహనాలకు సంబంధించిన ఇన్వాయిస్, ఇతర వివరాలను సేకరించారు. లారీల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలపై ఆయన కంపెనీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలు బాడీలు నిర్మించారా లేదా అనే సమాచారాన్ని కూడా ఆయన సేకరించారు. -
మంగళగిరి ఆర్టీవో ఆధికారుల మాయ
-
మంత్రుల ఒత్తిడితోనే అక్రమ రిజిస్ట్రేషన్లు
-
అక్రమాలపై మంత్రి పీతల ఫైర్
సాక్షి కథనంతో కదులుతున్న డొంక మిగిలిన 100 గజాలూ వేరే వారికి రిజిస్ట్రేషన్ రంగంలోకి పోలీసులు నరసాపురం అర్బన్ :తూర్పు గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో సంచలనం కలిగించిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై స్త్రీ,శుశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సీరియస్ అయ్యారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని గురువారం పోలీసులను ఆదేశించారు. పట్టణానికి చెందిన అన్నదమ్ములు నర్సింహారావు, ఈశ్వరరావులను మంత్రి పేరుతో మోసగించి వారి ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ముఠా గురించి ‘సాక్షి’ గురువారం సంచికలో ‘మంత్రి పేరుచెప్పి భూమి హాంఫట్’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పీతల సుజాత స్పందించారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఇలాంటి వ్యవహారాలను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని పోలీసులకు సూచించినట్టు వివరించారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేకున్నా.. తన పేరును నిందితులు వినియోగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై కూపీ లాగడం మొదలుపెట్టారు. ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా దీనిపై సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిలో మిగిలిన వంద గజాల స్థలాన్ని కూడా అక్రమార్కులు వేరేవారికి అమ్మేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం 300 గజాల స్థలాన్ని ముందుగా ఓ మహిళపేరున గతనెల 16న పవర్ ఆఫ్ అటార్నీతో నిందితులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. వెంటనే మర్నాడు 17న అందులో 200 గజాల స్థలాన్ని బాధితుల తమ్ముడు కొడుకు భరత్ పేరున రిజిస్ట్రేషన్ జరిగింది. దీంతో ఇంకా మిగిలిన వంద గజాల స్థలం రిజిస్ట్రేషన్ ఆపాలని బాధితులు నరసాపురం సబ్‌రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ స్థలం కూడా ఈనెల 3న పాలకొల్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నరసాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయిస్తూ రిజిస్ట్రేషన్ జరిగిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు పూర్తిగా డీలా పడ్డారు. ఈ వ్యవహారంపై బాధితుల తరపున ఆందోళన చేపడతామని సీపీఎం నరసాపురం డివిజన్, పట్టణ కార్యదర్శులు కవురు పెద్దిరాజు, ఎం.త్రిమూర్తులు ఓ ప్రకటనలో తెలిపారు.