అక్రమార్కులపై క్రిమినల్ కేసులు? | Irregulars criminal cases? | Sakshi
Sakshi News home page

అక్రమార్కులపై క్రిమినల్ కేసులు?

Published Thu, Jul 14 2016 1:07 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

Irregulars criminal cases?

నగరంపాలెం : రవాణాశాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ వ్యవహారంలో రవాణా శాఖ తరఫున కీలకంగా వ్యవహరించిన మంగళగిరి మోటరు వెహికల్ ఇన్‌స్పెక్టరు శివనాగేశ్వరావును ఇప్పటికే సెలవుపై పంపారు. జిల్లా రవాణా శాఖలో మంగళగిరి పరిధిలో లారీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనపై విచారణ కొనసాగుతోంది. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో సోమవారం రాత్రి నుంచి జిల్లా ఉపరవాణా కమిషనర్ జీసీ రాజారత్నం ఆధ్వర్యంలో  విచారణ జరుగుతోంది. వాహనాలు విజయవాడలోని జాస్పర్ కంపెనీలో కొనుగోలు చేసినట్లు, అక్కడి ఆటోనగర్‌లోని కరుణామయా వర్క్‌షాపులో బాడీ బిల్డింగ్ చేసినట్లు పత్రాలు ఉండటంతో మంగళవారం, బుధవారం డీటీసీ విజయవాడలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటీకే వాహనాల రిజిస్ట్రేషన్‌కు కేటాయించిన 27 నంబర్లను ఆధికారులు రద్దు చేశారు. జరిగిన సంఘటనపై జాస్పర్ కంపెనీ వైస్ చైర్మన్‌ను విచారించారు. డీలరుకు సంబంధించిన గోడౌన్‌లోని కీ ఇన్‌వాయిస్, అవుట్ గోయింగ్ రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. బాడీ బిల్డింగ్ చేసినట్లు బిల్లులు ఇచ్చిన వర్క్‌షాపు యజమానులను విచారించి నివేదికను విచారణాధికారి డీటీసీ రాజారత్నం రవాణా కమిషనర్‌కు అందించనున్నారు. దీనిపై పూర్తి వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకునేందుకు గురువారం రవాణాశాఖ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం విజయవాడ రానున్నారు.

బ్యాంకు పాస్‌బుక్  ద్వారా రిజిస్ట్రేషన్లు
వాహనాల రిజిస్ట్రేషన్లు సాధారణంగా వాహనదారుల చిరునామా ప్రకారం ఆ పరిధిలోని రవాణా శాఖ కార్యాలయాల్లో చేస్తారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లకు చిరునామ ధ్రువపత్రాలను బ్యాంకు అకౌంట్ల ద్వారా సృష్టించారు. మంగళగిరిలోని 5-649.బి కొప్పురావు కాలనీ ఇంటి చిరునామాతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో అకౌంట్లు ప్రారంభించి పాస్‌బుక్‌లు పొందిన వాహన యజమానులు వాటి ద్వారా రిజిస్ట్రేషన్లు మంగళగిరి ఎంవీఐ కార్యాలయంలో చేయించారు. రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఎంవీఐకు మధ్యవర్తులకు రూ.లక్షల్లోనే మామూళ్లు అందినట్లు సమాచారం. పూర్తి నివేదిక తర్వాత ఎంవీఐపై శాఖపరమైన చర్యలతోపాటు, వాహన డీలర్లు, బాడీ బిల్డింగ్ యజమానులు, వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న యజమానులపై క్రిమినల్ కేసులూ నమోదు చేయనున్నట్లు సమాచారం.
 
మోటారు వెహికల్ ఇన్‌చార్జి అధికారిగా బాలకృష్ణ
మంగళగిరి : విజయవాడకు చెందిన పొట్లూరి ఆనంద్, రవిశంకర్, ఈనెల రవీంద్రనాథ్, జూపల్లి పద్మావతితో పాటు మంగళగిరి మండలం నూతక్కి చెందిన వెలిశెట్టి లక్ష్మీనారాయణకు ఇండియన్ ఆయిల్ కంపెనీలో చమురు సరఫరా చేసే టెండర్లలో పాల్గొనేందుకు వాహనాలు అవసరమయ్యాయి. దీంతో విజయవాడ జాస్వర్ ఇండస్ట్రీస్ వద్ద 27 వాహనాలు కొనుగోలు చేసినట్లు బిల్లులు తీసుకున్నారు. ఆ వాహనాలకు కావాల్సిన బిల్లులు, సర్టిఫికేట్లు తీసుకుని మధ్యవర్తి ద్వారా శివనాగేశ్వరరావును కలిసినట్లు తెలుస్తోంది. సెలవుపై వెళ్లిన మంగళగిరి మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ శివనాగేశ్వరరావు స్థానంలో గుంటూరుకు చెందిన అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు.
 
లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై జేటీసీ విచారణ
విజయవాడ : రవాణా శాఖలో వెలుగు చూసిన కుంభకోణంపై జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రసాదరావు విచారణ జరిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై ఆశాఖ అధికారులు స్పందించారు. బుధవారం జేటీసీ ప్రసాదరావు విజయవాడలో జాస్పర్ ఇండస్ట్రీస్ కార్యాలయానికి వెళ్లి 27 లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారించారు. వాహనాలకు సంబంధించిన ఇన్వాయిస్, ఇతర వివరాలను సేకరించారు. లారీల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలపై ఆయన కంపెనీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలు బాడీలు నిర్మించారా  లేదా అనే సమాచారాన్ని కూడా ఆయన సేకరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement