ఇక అరెస్టులు ఉండవు.. తిప్పి పంపుడే: కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్రికన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. వీరు చిక్కినప్పుడు అరెస్టు చేస్తే వస్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) విధానానికి శ్రీకారం చుట్టారు. ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సాయంతో తొలిసారిగా ఐదుగురిపై ఈ ప్రక్రియను అనుమతి పొందారు. వీరిని బుధవారం నగర పోలీసు కార్యాలయం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పంపారు. ఈ నేపథ్యంలో హెచ్–న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ ఆనంద్ వివరాలు వెల్లడించారు.
అరెస్టు చేస్తే నేరాలకు ఊతమే...
నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు వంటి ఆఫ్రికన్ దేశాల నుంచి అనేకమంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో అనేక మంది వీసా, పాస్‌పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. గతంలో ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవాళ్లు. కోర్టులో దీని విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ చేయడానికి ఆస్కారం లేదు.
ఈ మధ్య కాలంలో బెయిల్‌పై బయటకు వచ్చే ఆ ఆఫ్రికన్లు సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయం చేపట్టడంతో కొత్త తల నొప్పులు వచ్చేవి. ఇలాంటి వారిలో కొందరు నగరంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల యువతులతో సహజీవనం చేస్తూ వారి ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, గుర్తింపుకార్డులు, వీసాలు తయారు చేసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆధార్ కార్డులు పొందడం చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక వ్యక్తులైన వీరి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది.
ఎఫ్ఆర్ఆర్ఓ సాయంతో డిపోర్టేషన్...
ఈ పరిణామాలను గమనించిన సీవీ ఆనంద్ డిపోర్టేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల హెచ్–న్యూ అధికారులు డ్రగ్స్ కోసం ఆíఫ్రికన్ల ఉంటున్న ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్లు పి.రాజేష్, పి.రమేష్ రెడ్డిలు తమ బృందాలతో రెండు నెలల క్రితం బంజారాహిల్స్‌లోని పారామౌంట్‌కాలనీలో సోదాలు చేశారు. అక్రమంగా నివసిస్తున్న ఆంటోనీ సన్డే (నైజీరియా), కోనే మౌసా (ఐవరీ కోస్టు), ఆసూయ్ విలియం డెకోస్టేరియా (ఐవరీ కోస్టు), ఒబేరా పీటర్ (నైజీరియా), ఒమెజోరియా కింగ్స్లే (నైజీరియా) చిక్కారు.
వీరి వివరాలు ఎఫ్ఆర్ఆర్ఓకు పంపి మూవ్మెంట్ రిస్ట్రెక్షన్ ఆర్డర్ పొంది సీసీఎస్‌లోని డిపోర్టేషన్ సెంటర్లో ఉంచారు. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరి గుర్తింపులు, ఢిల్లీ కార్యాలయం నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందారు. ఈ ఐదుగురికీ విమాన టిక్కెట్లు ఖరీదు చేసిన సిటీ పోలీసులు ఖతర్ ఎయిర్వేస్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఎఫ్ఆర్ఆర్ఓ నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకున్నారు. వీటి ఆధారంగా బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి డిపోర్ట్ చేశారు. దీంతో వీళ్లు మరోసారి భారత్‌లో అడుగుపెట్టడానికి ఆస్కారం ఉండదు.
750 మంది అక్రమంగా ఉంటున్నారు
హైదారాబాద్ ఎఫ్ఆర్ఆర్ఓ ద్వారా 2900 మంది ఆఫ్రికన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 750 మంది వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉండిపోయారు. వీళ్లు నగరంలో ఉన్నారా? ఇతర ప్రాంతాలకు వెళ్లారా? అనేది ఆరా తీస్తున్నాం. ఇలాంటి వారిని గుర్తించడానికి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభిస్తాం. ఇకపై చిక్కిన వాళ్లంతా డిపోర్టేషన్ కావాల్సిందే. ఇళ్ల యజమానులు సైతం వీసా, పాస్‌పోర్టు చూడకుండా అద్దెకు ఇవ్వద్దు. అనుమానం ఉంటే పోలీసుల సహాయం తీసుకోండి.
– సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
చదవండి: బీజేపీ జాతీయ సభ.. షెఫ్‌లకు యాదమ్మ ‘వంటల’ పాఠాలు!