గుట్టలను తవ్వేస్తారట..
రిజర్వు ఫారెస్ట్ భూముల్లో గనుల
తవ్వకానికి వ్యాపారుల దరఖాస్తు
అనుమతులు లభిస్తే ఎడారిలా
మారనున్న వ్యవసాయ భూములు
ములుగు : మైనింగ్ పేరుతో గుట్టలను తవ్వేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు రిజర్వు ఫారెస్ట్ భూముల్లో ఉన్న గనుల తవ్వకానికి అనుమతులు కావాలని కొందరు వ్యాపారులు మైనింగ్ అండ్ జియాలజీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ములుగు మండలం మల్లంపల్లి, జాకారం, అబ్బాపూర్, బాణాలపల్లి, రేగొండ మండలం కొత్తపల్లి, బాగిర్థిపేట, వెంకటాపురం మండలం ఇంచెన్చెర్వుపల్లి, నర్సాపూర్, కేశవాపూర్ పరిధిలోని రిజర్వు ఫారెస్ట్ భూముల్లో అపారమైన డోలమైట్, లాటరైట్ గనులు ఉన్నాయి. వీటిపై కన్నేసిన వ్యాపారులు గనుల తవ్వకాల కోసం 2014, మార్చి నుంచి ఇప్పటి వరకు 15 మంది వరకు ద రఖాస్తు చేసుకున్నారు. సుమారు 1000 ఎకరాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు ఇటీవల ఓ నాయకుడు సమర్పించిన సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. గతంలో ములుగు డివిజన్లో 82 శాతం ఉన్న అడవులు పోడు వ్యవసాయం, అక్రమ కలప వ్యాపారం కారణంగా ప్రస్తుతం 60 శాతానికి చేరారుు.
ఒకవేళ మైనింగ్‌కు అనుమతిస్తే ఈ ప్రాంతం ఏడారిగా మారే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ములుగు, వెంకటాపురం మండలాల్లో భూగర్భ జలాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు భూగర్భ నీటి వనరుల శాఖ నిర్ధారించింది. ఒకవేళ అనుమతులు మంజూరు చేస్తే వాతావరణంలో తీవ్రమార్పులు సంభవించే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు ఇంకిపోయి భూములు ఎడారుల్లా మారనున్నాయి. వ్యాపారుల దరఖాస్తులో రేగొండ మండలం బాగిర్థిపేట సమీపంలోని పర్యాటక ప్రాంతం పాండవులగుట్ట ఉంది. తవ్వకాలు జరిగితే పాండవుల గుట్ట ప్రమాదంలో పడి స్వభాన్నే కోల్పోయే అవకాశం ఉంది. తవ్వకాల అనుమతులపై పర్యాటక శాఖ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.
హైకోర్టులో రిట్ దాఖలు చేస్తాం
రిజర్వు ఫారెస్ట్ భూముల్లో తవ్వకాలు చేపడితే వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాం. అనుమతులు లభిస్తే వ్యవసాయ భూములు ఎడారుల్లా మారిపోతాయి. అధికారులు స్పందించకుంటే హైకోర్టులో రిట్ దాఖలు చేస్తాం.
- మస్రగాని విన య్‌కుమార్, అడ్వకేట్, మాజీ ఎంపీపీ, ములుగు